logo

కాకతీయులపై జరిగిన అధ్యయనం తక్కువే..

కాకతీయుల కట్టడాల పరిరక్షణ కోసం యువ చరిత్రకారుడు అరవింద్‌ ఆర్య పకిడె కృషి చేస్తున్నారు. చరిత్ర పరిశోధన అంటే కేవలం అధ్యయనమే కాదు.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందని చెబుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభం

Updated : 07 Jul 2022 06:57 IST

వారసత్వ పరిరక్షణకు ఈ ఉత్సవాలు దోహదపడతాయి

యువ పరిశోధకుడు అరవింద్‌ ఆర్య

‘ఈనాడు’  ముఖాముఖి -ఈనాడు, వరంగల్‌

కాకతీయుల కట్టడాల పరిరక్షణ కోసం యువ చరిత్రకారుడు అరవింద్‌ ఆర్య పకిడె కృషి చేస్తున్నారు. చరిత్ర పరిశోధన అంటే కేవలం అధ్యయనమే కాదు.. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉందని చెబుతున్నారు. బుధవారం నుంచి ప్రారంభం అవుతున్న కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల్లో అరవింద్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాకతీయుల వారసుడైన కమల్‌చంద్ర భంజ దేవ్‌ ఉత్సవాలకు రావడానికి ప్రభుత్వానికి మహారాజుకు మధ్య వారధిగా నిలిచారు. ఈ నేపథ్యంలో అరవింద్‌తో

ఈనాడు: చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం కాకతీయ ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఇవి వారసత్వ పరిరక్షణకు ఎలా దోహదపడతాయి?
అరవింద్‌: కాకతీయ ఉత్సవాలు మళ్లీ ఓరుగల్లులో జరగడం పూర్వ వైభవం వచ్చినట్టు అనిపిస్తోంది. రామప్పకు యునెస్కో వారసత్వ గుర్తింపు  వచ్చి ఏడాది అవుతోంది. ఈ సమయంలో ఉత్సవాల నిర్వహణ వల్ల ప్రజల్లో చరిత్రపై, వారసత్వ పరిరక్షణపై ఎంతో అవగాహన కలుగుతుంది.

చరిత్ర పరిశోధనతోపాటు, వాటి పరిరక్షణకు కృషి చేస్తున్నారు. ఏ అంశాలు మీకు సంతృప్తినిచ్చాయి?
 ఇంటర్‌ నుంచే బాహ్య ప్రపంచానికి ఎక్కువగా తెలియని ప్రాచీన కట్టడాల పరిరక్షణ కోసం నిత్యం తిరుగుతూనే ఉన్నా. కాకతీయులు ఎన్నో మెట్లబావులు నిర్మించారు. వరంగల్‌ శివనగర్‌ మెట్ల బావి దుస్థితి చూసి ఆ కట్టడం గొప్పతనం అప్పటి కలెక్టర్‌ ఆమ్రపాలికి వివరించాను. ఆమె పరిశీలించి రూ.30 లక్షలు మంజూరు చేయడంతో అది బాగైంది. జైన క్షేత్రమైన అగ్గలయ్య గుట్ట పైకి వెళ్లేందుకు మార్గం లేదు. ఈ విషయం పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌కు చెబితే ఆయన కలెక్టర్‌తో మాట్లాడి హృదయ్‌ పథకంలో చేర్చారు. ఫలితంగా కోటి రూపాయలతో పర్యాటక ప్రాంతంగా చేశారు. దామెర వాయి గుహల గురించి కేంద్ర పురావస్తు శాఖ వారికి చెబితే స్వదేశీ దర్శన్‌ పథకం కింద చేర్చారు. ప్రాచీన కట్టడాల కోసం పనిచేసినందుకు తృప్తి కలిగింది.

ఇప్పటి వరకు ఎన్ని ప్రాచీన కట్టడాలను సందర్శించారు? వాటి పరిస్థితి ?
ప్రాచీన కట్టడాల పరిశోధనలో భాగంగా 1200 ప్రాంతాలకు వెళ్లాను. ములుగులోని దేవుని గుట్టనే 49 సార్లు సందర్శించా. అది ఎంతో అద్భుతమైన కట్టడం. అలాంటి కట్టడాలు మనకు ఉండడం గర్వకారణం. నా పరిశోధనలో భాగంగా ఇప్పటికి లక్షకుపైగా ఫొటోలు తీసి భద్రపరిచా. ఇందుకోసం నాలుగు హార్డ్‌ డిస్క్‌లు ఉన్నాయి. ఇక కట్టడాల పరిస్థితి చెప్పాలంటే చాలా దీనస్థితిలో ఉన్నాయి.  

గతంలో ఒక పుస్తకం రాశారు. మళ్లీ రాస్తున్నారా?
గతంలో అన్‌టోల్డ్‌ తెలంగాణ పేరుతో బాహ్య ప్రపంచానికి అంతగా తెలియని 50 ప్రాచీన కట్టడాల గురించి పుస్తకం రాశాను.  పరిశోధన చేస్తున్న ప్రాంతాల గురించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుంటే విదేశీ పరిశోధకులు చూస్తున్నారు. జర్మనీ, యూకే, అమెరికా దేశాల నుంచి నలుగురు పరిశోధకులు ఉమ్మడి వరంగల్‌కు వచ్చి లోతైన పరిశోధన సాగించారు.  త్వరలో నేను రాసిన మరో మూడు పుస్తకాలు రాబోతున్నాయి.

వారసత్వ సంపద పరిరక్షణకు ఎవరి పాత్ర ఏంటి?
చరిత్ర అధ్యయనం చేయడానికి శాసనాలే ప్రామాణికం. కాబట్టి ప్రభుత్వం శాసనాలు చదివేవాళ్లను నియమించాలి.  మేము టార్చ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేసి వారసత్వ పరిరక్షణకు నడుం కట్టాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని