అరుదైన మొక్కలతో ఆదర్శవనం

ప్రతి గ్రామంలో చిట్టడవి ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రకృతి వనాలు’ అనే

Published : 17 Jul 2021 21:50 IST

సంగారెడ్డి: ప్రతి గ్రామంలో చిట్టడవి ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘పల్లె ప్రకృతి వనాలు’ అనే కార్యక్రమం చేపట్టింది. దీంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని గ్రామాల్లో వనాలు ఏర్పాటు చేశారు. కానీ సంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామం మాత్రం అందుకు విభిన్నంగా ప్రయత్నించి ఆదర్శంగా నిలుస్తోంది. 

పచ్చదనానకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం ప్రతి గ్రామంలో చిట్టడవిని అభివృద్ధి చేసేలా పల్లె ప్రకృతి వనాల పేరుతో కార్యచరణ రూపొందించింది. అందులో భాగంగా సుమారు ఎకరా విస్తీర్ణంలో  కనీసం నాలుగు వేల మొక్కలు నాటుతారు. చాలా గ్రామాల్లో తమకు అందుబాటులో ఉన్న మొక్కలను నాటి ప్రకృతి వనాన్ని పెంచుతున్నారు. అయితే సంగారెడ్డి జిల్లా, కులబ్ గూర్ గ్రామస్తులు ఇందుకు భిన్నంగా ఆలోచించారు. స్థానిక అధికారుల సహకారంతో తమ వనాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చి దిద్దారు. గతంలో సంగారెడ్డి పురపాలక సంఘం డంప్‌యార్డ్‌గా ఉపయోగించిన స్థలంలో చెత్తను తొలగించి, మొక్కల పెంపకానికి అనుకూలంగా భూమిని సిద్ధం చేశారు. ఎకరా విస్తీర్ణంలో 120 రకాల ఫల, పుష్ప, ఔషధ, అడవిజాతి మొక్కలను అయిదు వేలకు పైగా నాటారు. మొక్కలను నాటడమే కాకుండా, వాటిని బతికించడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. ఈ పల్లె ప్రకృతి వనాన్ని అభివృద్ధి చేయడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచిన ఉప సర్పంచి మరో రెండు ఎకరాల్లో ఆయుర్వేద, నక్షత్ర వనాలను పెంచేందుకు పూనుకున్నారు. కాగా పరిసర గ్రామాలకు చెందిన ప్రజలతో పాటు, సంగారెడ్డి పట్టణానికి చెందినవారు సైతం ఈ ప్రకృతి వనాన్ని సందర్శిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని