
క్యాన్సర్‌కు పసుపుతో బయో డ్రగ్
దుష్ప్రభావాలు లేని చికిత్సకు దోహదం
ఆర్‌ఎన్‌ఏఐ, నానో టెక్నాలజీ సాయంతో సీసీఎంబీ రూపకల్పన
ఎలుకలపై ప్రయోగాలు విజయవంతం
ఈనాడు, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్సలో.. దుష్ప్రభావాలు లేని ఔషధాల కోసం సీసీఎంబీ చేపట్టిన ప్రయోగాలు సత్ఫలితాలిస్తున్నాయి. ఆర్‌ఎన్‌ఏఐ, నానో టెక్నాలజీ సాయంతో క్యాన్సర్ చికిత్సకు పసుపుతో బయోడ్రగ్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా రూపొందించినట్లు సంస్థ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. క్యాన్సర్ సోకితే శరీరంలో పెరిగే క్యాన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన ఇతర కణాలపైనా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. క్యాన్సర్ సోకిన కణాలే లక్ష్యంగా ఔషధాలు పనిచేసేలా కేంద్రీకృత చికిత్స కోసం జన్యు సైలెన్సింగ్ (ఆర్‌ఎన్‌ఏఐ) ఒక మంచి సాధనం. ఈ విధానంలో జన్యువులోని నిర్దిష్ట భాగాలను మాత్రమే జత చేయడానికి వీలవుతుంది. ఇప్పటివరకు సురక్షితమైన పద్ధతులు లేకపోవడంతో ఆర్‌ఎన్‌ఏఐ ఆధారిత చికిత్స అందించలేకపోతున్నారు. సీసీఎంబీలోని శాస్త్రవేత్త డాక్టర్ లేఖా దినేష్ కుమార్ బృందం, మరో పరిశోధన సంస్థ ఎన్‌సీఎల్‌లోని పాలిమర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగంతో కలిసి ఆర్‌ఎన్‌ఏఐ, ఇతర అణువులను నిక్షిప్తం చేయడానికి నానో కర్కుమిన్ నిర్మాణాలను అభివృద్ధి చేశారు. క్యాన్సర్ ముప్పును తగ్గించే లక్షణాలున్న పసుపు నుంచి దీన్ని సంగ్రహించి బయో ఔషధాన్ని రూపొందించారు. ఈ ఔషధం నిర్దిష్ట కణజాలాలను లక్ష్యంగా చేసుకుని పనిచేయడాన్ని గుర్తించారు. ఎక్కువ తీసుకున్నా ఎలాంటి దుష్ప్రభావాలు లేవంటున్నారు. ‘పెద్ద పేగు, రొమ్ము క్యాన్సర్ బారిన పడిన ఎలుకల్లో బయో ఔషధాన్ని ప్రయోగించాం. ఆరు నెలల వ్యవధిలో ఎలుకల్లోని కణుతులు తగ్గడం కనిపించింద’ని డాక్టర్ లేఖా తెలిపారు. ఈ పరిశోధన పత్రం తాజాగా నానో జర్నల్‌లో ప్రచురితమైంది.
Advertisement