వ్యవసాయ డిగ్రీ సీట్ల పెంపు

వ్యవసాయ కోర్సులకున్న భారీ డిమాండుతో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పందించింది. ఏటా వరసగా సీట్లు పెంచాలని తాజాగా నిర్ణయించింది. గతేడాది (2020-21) 710 వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ)

Published : 22 Jan 2022 03:12 IST

జయశంకర్‌ వర్సిటీ నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: వ్యవసాయ కోర్సులకున్న భారీ డిమాండుతో ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్పందించింది. ఏటా వరసగా సీట్లు పెంచాలని తాజాగా నిర్ణయించింది. గతేడాది (2020-21) 710 వ్యవసాయ డిగ్రీ (ఏజీ బీఎస్సీ) సీట్లుండగా ఈ ఏడాది 760కి, 2022-23లో 995కి పెంచబోతోంది. ఈ వర్సిటీ తరపున రాష్ట్రంలో ఐదుచోట్ల వ్యవసాయ కాలేజీలున్నాయి. వీటిలో ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా పాలెం, వరంగల్‌, సిరిసిల్ల కాలేజీల్లో 72 చొప్పునే సీట్లు ఉన్నాయి. వచ్చే ఏడాది పాలెం, సిరిసిల్లలో 100కి, వరంగల్‌లో 75కి సీట్లు పెరగనున్నాయి. అత్యధికంగా రాజేంద్రనగర్‌ కాలేజీలో 320 ఉంటాయి. జగిత్యాల, అశ్వారావుపేటల్లో 200కి పెంచబోతున్నారు.

ఉద్యోగం పక్కా అనే ప్రచారంతో..
రాష్ట్రంలో 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఏర్పాటైన తరవాత వాటిలో వ్యవసాయ డిగ్రీ కోర్సులు ప్రారంభించారు. కానీ అవి జయశంకర్‌ వర్సిటీకి అనుబంధం కావు. ఇతరత్రా ప్రైవేటు కాలేజీల ఏర్పాటుకు అనుమతి లేదు. వ్యవసాయ డిగ్రీ చదివితే ఉద్యోగం గ్యారంటీ అనే ప్రచారం ఎక్కువగా ఉన్నందున ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు కాలేజీల్లో ఈ డిగ్రీలో చేరేందుకు లక్షల రూపాయల డొనేషన్లు కట్టి తెలుగు విద్యార్థులు చేరుతున్నారు. తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు లేకపోవడం, జయశంకర్‌ వర్సిటీలో ఇంతకాలం 710 సీట్లు మాత్రమే ఉండటం వల్ల తీవ్రమైన పోటీ ఉంది. కాలేజీలు, సీట్ల సంఖ్య ఇంకా పెంచాలని ఎప్పటినుంచో డిమాండు ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని  ప్రైవేటు వర్సిటీల్లోనూ చేరేందుకు విద్యార్థులు పోటీపడుతున్నారు. కానీ 3 ప్రైవేటు విశ్వవిద్యాలయాలలో నిర్వహిస్తున్న ఏజీ బీఎస్సీ కోర్సులకు ఇంతవరకూ ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌) గుర్తింపు రాలేదు. జయశంకర్‌ వర్సిటీ కోర్సులకు మాత్రమే ఉంది. గుర్తింపు ఉన్న డిగ్రీ చదివిన వారికే జయశంకర్‌ వర్సిటీలో పీజీ, పీహెచ్‌డీ సీట్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భర్తీచేసే వ్యవసాయాధికారి పోస్టులకు సైతం వారినే ఎంపిక చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జయశంకర్‌ వర్సిటీ నిర్వహిస్తున్న ఏజీ బీఎస్సీ కోర్సులకే అధిక డిమాండు ఉన్నందునే సీట్లు పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ వి.ప్రవీణ్‌రావు ‘ఈనాడు’కు చెప్పారు.

ఎంబీబీఎస్‌ కౌన్సెలింగ్‌ తరవాతే..
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్‌లో ర్యాంకుల ఆధారంగా ఏజీ బీఎస్సీ సీట్లను జయశంకర్‌ వర్సిటీ భర్తీ చేస్తుంది. కానీ జాతీయస్థాయిలో నిర్వహించిన నీట్‌ ఆధారంగా ఎంబీబీఎస్‌, దంత వైద్య కోర్సులకు కౌన్సెలింగ్‌ ఇంకా జరగలేదు. అది పూర్తయిన తరవాతే ఏజీ బీఎస్సీ, ఉద్యాన, పశువైద్య డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉమ్మడి కౌన్సెలింగ్‌ను జయశంకర్‌ వర్సిటీ నిర్వహిస్తుంది. వచ్చేనెల మొదటివారంలో ఇది జరిగే అవకాశాలున్నాయని ప్రవీణ్‌రావు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని