Published : 28 Jan 2022 05:21 IST

మరమ్మత్తు చేసేందుకే..!

డ్రగ్స్‌కు చెక్‌ పెట్టేందుకు సర్కారు ప్రత్యేక వ్యూహం
గట్టి పట్టుదలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అడుగులు
ఇప్పటిదాకా శాఖల మధ్య కొరవడిన సమన్వయం

మత్తు రాజధాని ముద్ర చెరిపేసేందుకు గట్టి ప్రయత్నం మొదలైంది. వెయ్యి మంది సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి సర్కారు కొత్త వ్యూహానికి తెరదీసింది. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో విపరీతంగా పెరిగిపోయిన మాదకద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం మోపేందుకు సాక్షాత్తూ ముఖ్యమంత్రే నడుం బిగించడంతో యంత్రాంగంలో కదలిక వచ్చింది. దీనికి సంబంధించి శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పడు కూడా మత్తుమందుల నియంత్రణ చర్యలున్నప్పటికీ అదంతా వ్యవస్థీకృతంగా లేదు. పోలీస్‌, ఆబ్కారీశాఖలతోపాటు కేంద్ర ప్రభుత్వ విభాగాలు కూడా కేసులు నమోదు చేస్తున్నాయి. వీటి మధ్య సమన్వయం లేదు. దాంతో అడపాదడపా డ్రగ్స్‌ పట్టుబడుతున్నప్పటికీ దొరక్కుండా వెళుతున్నవి ఇంతకు పదిరెట్లు ఉంటాయని అంచనా. అందుకే ఎన్ని కేసులు నమోదు చేస్తున్నా వాడకంలో మాత్రం ఎక్కడా తేడా రావడంలేదు. మాదకద్రవ్యాల వినియోగం, ఉత్పత్తి, రవాణా విషయంలో హైదరాబాద్‌ దేశంలోనే కీలకంగా మారింది. డీఆర్‌ఐ విడుదల చేసిన 2020-21 నివేదిక సూరత్‌, హైదరాబాద్‌లలో రసాయన మత్తుమందులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు పేర్కొంది. నగరం చుట్టుపక్కల చిన్నాపెద్దా ఔషధ పరిశ్రమలు పెద్దసంఖ్యలో విస్తరించడం డ్రగ్స్‌ ఉత్పత్తిదారులకు అవకాశంగా మారింది. మూతపడ్డ ఇలాంటి పరిశ్రమల మాటున రసాయన మాదకద్రవ్యాలు ఉత్పత్తి చేస్తున్నారు.

ప్రస్తుతానికి ఏ శాఖలో ఎలా ఉందంటే...
* వాస్తవానికి డ్రగ్స్‌ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్పీబీ) ఉంది. కాని ఈ విభాగానికి కనీస వసతులు లేవు. ఒకరిద్దరు సిబ్బందితో నెట్టుకొస్తున్నారు.
* ఇక  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ప్రధానంగా దిగుమతి, ఎగుమతులపైనే దృష్టి సారిస్తుంది. ఈ విభాగానికి ఇతరత్రా బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి.
* వాస్తవానికి రాష్ట్ర స్థాయిలో మత్తుమందులు వాడకాన్ని నిరోధించాల్సిన బాధ్యత ఆబ్కారీ శాఖది. కాని ఆ శాఖ దృష్టంతా మద్యం అమ్మకాలపైనే ఉంటుంది.
* ఇక పోలీసులకు కూడా అధికారం ఉన్నప్పటికీ వారికి ఉన్న సవాలక్ష బాధ్యతల్లో ఇది ఒక్కటి మాత్రమే. అందుకే పూర్తిగా మత్తుమందులపై ఎవరూ దృష్టి పెట్టలేకపోతున్నారు. అందుకే ఆశించిన ఫలితాలు రావడంలేదు.

మచ్చుకు కొన్ని దృష్టాంతాలు..
* డీఆర్‌ఐ అధికారులు కేవలం నెల రోజుల వ్యవధిలోనే హైదరాబాద్‌లో రూ.121 కోట్ల విలువైన హెరాయిన్‌ పట్టుకున్నారు. దీంతోపాటు పోలీసులు అనేక అంతర్జాతీయ మత్తు ముఠాలను కూడా అరెస్టు చేశారు.
* ముంబయిలో ఉంటున్న నైజీరియాకు చెందిన టోనీ అరెస్టు ఈ క్రమంలో ఎంతో కీలకం. గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్‌లో బడాబాబులకు అతడు ఖరీదైన కొకైన్‌ విక్రయిస్తున్నట్లు వెల్లడయింది.
* మరోపక్క ఉత్తరాంధ్రలో పండిన గంజాయి హైదరాబాద్‌ మీదుగానే దేశంలోని ఇతర ప్రాంతలకు సరఫరా అవుతోంది. మొత్తంమీద తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్‌కు ఆలవాలంగా మారింది. మత్తుమందుల వినియోగం మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది.

సాంకేతిక దన్నుకూ ఏర్పాట్లు!
శాఖల మధ్య సమన్వయ లేమిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. పోలీసు, ఆబ్కారీ శాఖల నుంచి వెయ్యిమంది సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకొని ‘మాదకద్రవ్యాలు-వ్యవస్థీకృత నేరాల నిరోధక కేంద్రం’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విభాగం పూర్తిగా మత్తుమందులు నియంత్రణపైనే దృష్టి పెడుతుందని, తద్వారా మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతానికి డీజీపీ కార్యాలయంలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మత్తుమందుల అనుపానులు తెలుసుకోవాలంటే నిఘా సమాచారం కీలకం కాబట్టి ఇందులో ప్రత్యేకంగా నిఘాతోపాటు సాంకేతిక విభాగం కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

- ఈనాడు, హైదరాబాద్‌

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని