ధాన్యం కొనుగోళ్లలో లీలలు!

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాలేదు. ప్రభుత్వానికి విక్రయించలేదు. అయినా విక్రయించినట్లు, ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించారు. పౌరసరఫరాల శాఖ సాఫ్ట్‌వేర్‌లోనూ

Updated : 27 Jan 2022 05:05 IST

సరకు లేకున్నా.. రికార్డుల్లో నమోదు

 ప్రతి సీజన్‌లో వెలుగుచూస్తున్న మోసాలు

తనిఖీ కొరవడడంతోనే పునరావృతం

 త్వరలో పూర్తికానున్న కొనుగోళ్లు

* కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురాలేదు. ప్రభుత్వానికి విక్రయించలేదు. అయినా విక్రయించినట్లు, ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసినట్లు రికార్డుల్లో చూపించారు. పౌరసరఫరాల శాఖ సాఫ్ట్‌వేర్‌లోనూ నమోదు చేశారు. బిల్లులు సిద్ధం చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయించుకున్నారు. ప్రస్తుత సీజన్‌లో కామారెడ్డి జిల్లాలో ఈ తరహా అక్రమాలు కొన్ని వెలుగులోకి వచ్చాయి.

* సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండలంలో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేసి, కేంద్రాలను అధికారికంగా మూసివేశాక.. వందల టన్నులు కొనుగోలు చేసినట్లు రికార్డులు పుట్టించారు. ఆ సరకును మిల్లులకు తరలించినట్లు సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేశారు. సర్కారు సొమ్మును స్వాహా చేశారు. దీనికి సంబంధించి బాధ్యుడైన ఒకరిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. పై రెండు ఘటనల్లో రూ.2 నుంచి 3 కోట్ల చొప్పున ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఇవి వెలుగులోకి వచ్చిన కొన్ని ఉదాహరణలు మాత్రమే.

ఈనాడు - హైదరాబాద్

పౌరసరఫరాలశాఖలో ఈ తరహా తప్పులు గత కొన్ని సీజన్లుగా జరుగుతున్నాయి. రూ.పదుల కోట్లు పక్కదారి పడుతున్నాయి. నగదు చెల్లింపుల సమయంలో శాఖాపరంగా నిఘా ఉంటే ఈ పరిస్థితి ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిల్లుల వద్ద ధాన్యం దించాక.. అక్కడి నుంచి వచ్చే సమాచారం ఆధారంగా పౌరసరఫరాల సంస్థ అధికారులు నగదును బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. చెల్లింపుల సమయంలో.. నిజంగా సరకు వచ్చిందా? విక్రయించిన వ్యక్తి రైతేనా? అంతమొత్తం ఆయనే పండించారా? అనే వివరాలు తనిఖీ చేస్తున్న దాఖలాలు లేవు. కనీసం రోజుకు ఒకటిరెండు చెల్లింపుల విషయంలోనైనా తనిఖీ చేస్తే అక్రమాలకు అవకాశం ఉండదన్న అభిప్రాయం అధికారుల్లోనే వ్యక్తమవుతోంది. ఆయా రైతులకు సంబంధించిన వివరాలు వ్యవసాయశాఖ వద్ద ఉంటాయి. వాటి ఆధారంగా పరిశీలన చేయడం సమస్య కాదు. అయినా ఆ దిశగా చర్యలులేవు. జాప్యం లేకుండా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో తనిఖీ కష్టతరమని ఓ అధికారి ‘ఈనాడు’తో వ్యాఖ్యానించారు.

ఒక్కో రైతు పేరుతో రూ.కోట్ల నిధులా?

సాధారణంగా ఎంత పెద్ద రైతైనా, ఉమ్మడి కుటుంబాలైనా రూ.కోట్లు విలువ చేసే ధాన్యాన్ని పండించే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అయినా గత సీజనులో కొందరు రైతుల ఖాతాల్లో రూ.కోట్లు జమ చేసిన ఉదాహరణలు ఉన్నాయని చెబుతున్నారు.

70 లక్షల టన్నులు మించకపోవచ్చు..

వానా కాల ధాన్యం కొనుగోళ్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. వారం రోజుల వ్యవధిలో కొనుగోళ్లు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. వరంగల్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే స్వల్ప మొత్తంలో ఇంకా ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. సోమవారం నాటికి రాష్ట్రంలో 69.64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు చేపట్టారు. కోటి మెట్రిక్‌ టన్నుల వరకు ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసినా.. 70 లక్షల మెట్రిక్‌ టన్నులకు మించి రాకపోవచ్చని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని