Updated : 04 Dec 2021 05:56 IST

ముందు ఇవ్వాల్సింది ఇవ్వండి

తెలంగాణ నుంచి 29 లక్షల మెట్రిక్‌ టన్నులు రావాలి
కేంద్ర మంత్రి గోయల్‌ స్పష్టం

ఈనాడు, దిల్లీ: తెలంగాణ ఎంపీలు బియ్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని రాజ్యసభాపక్షనేత, కేంద్ర ఆహారం, ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ ఆరోపించారు. ప్రస్తుతం కొనసాగుతున్న సీజన్‌లో హామీ ఇచ్చిన దానికంటే 29 లక్షల టన్నులు తక్కువగా తెలంగాణ రాష్ట్రం బియ్యం సరఫరా చేసిందని, ముందు ఈ లోటును భర్తీచేసి భవిష్యత్తు గురించి అడగాలని హితవుపలికారు. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు, ఆ పార్టీ ఎంపీ కె.ఆర్‌. సురేష్‌రెడ్డి బియ్యం సేకరణ లక్ష్యాల గురించి స్పష్టతనివ్వాలని కోరుతూ అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సమాధానం ఇచ్చారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఏటా బియ్యం సేకరణను పెంచుతూపోతోంది. తెలంగాణలోనూ బియ్యం సేకరణను 51.9 లక్షల టన్నుల నుంచి 94.54 లక్షల టన్నులకు పెంచాం. తెలంగాణ నుంచి 2020-21 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో 50 లక్షల టన్నులు ఇస్తామని హామీఇచ్చి, 32.66 లక్షల టన్నులే ఇచ్చారు. రబీ సీజన్‌లో 55 లక్షల టన్నులు అంచనా వేసి, 61.8 లక్షల టన్నులు సేకరించారు. మొత్తంగా 94.53 లక్షల టన్నుల వరకు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లుచెప్పాం. ఆ రెండు సీజన్‌లకు సంబంధించి ఇంకా 29 లక్ష టన్నులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. వాస్తవంగా తెలంగాణ నుంచి సేకరించాల్సిన ఉప్పుడు బియ్యం లక్ష్యం 24.75 లక్షల టన్నులు మాత్రమే. వాళ్లు వచ్చి అడిగితే ఏకకాల పరిష్కారం కింద లక్ష్యాన్ని 44.75 లక్షల టన్నులకు పెంచాం. అందులోనూ ఇప్పటివరకూ 27.78 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా దాదాపు 17 లక్షల టన్నులు రావాల్సి ఉంది.’’ అని అన్నారు.

ఎఫ్‌సీఐ ముందే చెప్పింది కదా?
ఈ రబీ సీజన్‌కు సంబంధించి ఎంత పరిమాణంలో బియ్యం కొంటారో స్పష్టంగా చెప్పాలంటూ కేశవరావు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ ‘‘ప్రస్తుత సీజన్‌లో మీరు సరఫరా చేస్తామని చెప్పిన బియ్యమే పూర్తిగా ఇవ్వలేదు. అందువల్ల పెండింగ్‌లో ఉన్న 29 లక్షల టన్నులు ప్రస్తుతం ఇవ్వమని అడుగుతున్నాం. అది సేకరించిన తర్వాత కూడా ఇంకా ఏదైనా సమస్య ఉంటే వాళ్లు ప్రభుత్వాన్ని అడగొచ్చు. ’’ అని సమాధానమిచ్చారు. ఉప్పుడు బియ్యం కొనుగోలు గురించి ఒడిశా బీజేడీ సభ్యుడు సస్మిత్‌పాత్ర అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి బదులిస్తూ ‘‘ఎంఓయూ క్లాజ్‌ 18లో టీపీడీఎస్‌ కింద కేటాయించిన పరిమితులకు మించి రాష్ట్రాలు అధికంగా బియ్యం సేకరిస్తే దాన్ని ఎఫ్‌సీఐకి అప్పగించాలని చెప్పాం. అలా అప్పగించేది ఉప్పుడు బియ్యంగా ఉండాలా? ముడిబియ్యంగా ఉండాలా? అనేది చెప్పే అధికారం ఎఫ్‌సీఐకి ఉంటుందని చెప్పాం. అందుకే ఎంఓయూలో దేశీయ అవసరాలకు తగ్గ బియ్యం మాత్రమే సరఫరా చేయాలనే నిబంధనను ఎఫ్‌సీఐ నిర్దేశించింది’’ అని పేర్కొన్నారు. నిల్వల్లో లోపాలున్నాయని కేంద్రమంత్రి తప్పుగా చెప్పారని కె.ఆర్‌. సురేష్‌రెడ్డి అనగా పీయూష్‌గోయల్‌ దానికీ వివరణ ఇచ్చారు. ‘‘నిల్వల్లో ఉన్న లోపాల గురించి నేను ఇప్పటికే రాష్ట్ర మంత్రికి లేఖ రాశాను. ఉదాహరణకు వరంగల్‌ జిల్లాలో నిల్వ 25,303 మెట్రిక్‌ టన్నులు తక్కువగా కనిపించింది’’ అని తెలిపారు.


లేఖ ఇచ్చి ఇప్పుడిలా ఎందుకు?

విష్యత్తులో ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని తెలంగాణ ప్రభుత్వమే అంగీకరించినట్లు పీయూష్‌ గోయల్‌ మరోసారి స్పష్టంచేశారు. ‘‘భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి ఉప్పుడు బియ్యం సరఫరా చేయబోమని అక్టోబరు 4న రాసిన లేఖలో తెలంగాణ ప్రభుత్వం చెప్పింది.’’ అన్నారు.


Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని