Updated : 13 Mar 2022 05:51 IST

EPFO: ఈపీఎఫ్‌ వడ్డీలో కోత

భవిష్య నిధిపై వడ్డీరేటు 8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

  ప్రతి రూ.లక్షపై రూ. 432 తగ్గనున్న ఆదాయం

  1977-78 తర్వాత ఇదే అతి తక్కువ

ఈనాడు, హైదరాబాద్‌: వేతన జీవులకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) షాక్‌ ఇచ్చింది. ఈపీఎఫ్‌ నిల్వలపై ఏటా ఇచ్చే వడ్డీని 0.4 శాతం తగ్గించింది. గువాహటిలో సమావేశమైన ఈపీఎఫ్‌వో ట్రస్టీ బోర్డు 2021-22 ఏడాదికి వడ్డీ రేటుని 8.1 శాతంగా నిర్ణయించింది. గత ఏడాది 8.5 శాతమే అతి తక్కువ వడ్డీరేటని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా.. ఈ ఏడాదికి మరింత తగ్గించడం విశేషం. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా 6.5 కోట్ల మంది చందాదారులపై ప్రభావం చూపనుంది. దాదాపు 44 ఏళ్ల తరువాత ఇదే అత్యంత తక్కువ వడ్డీరేటు కావడం గమనార్హం. ఈపీఎఫ్‌ పథకం 1952లో అమల్లోకి వచ్చింది. ఈ ఏడాదితో 70 ఏళ్లు పూర్తిచేసుకోనుంది. ఈపీఎఫ్‌వోకు వచ్చిన చందా సొమ్మును షేర్లు (ఈక్విటీ), బ్యాంకుల్లో పెట్టుబడిగా పెట్టి, ఆ మొత్తంపై వచ్చే లాభాన్ని వడ్డీగా చందాదారుల ఖాతాల్లో జమచేస్తోంది. గతంలో ఈపీఎఫ్‌వో బోర్డు సొంతంగా నిర్ణయాలు తీసుకుని వడ్డీ ఇచ్చేది. గత పదేళ్లుగా ఆర్థికశాఖ సూచన మేరకు వడ్డీరేట్లు ఖరారవుతున్నాయి. చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్లతో పోలిస్తే ఈపీఎఫ్‌వో ఇచ్చే వడ్డీ రేటు ఎక్కువగా ఉండటంతో వేతన జీవులు పీఎఫ్‌ ఖాతాల్లో స్వచ్ఛంద భవిష్యనిధి (వీపీఎఫ్‌) కింద అదనంగా జమ చేస్తున్నారు.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి దీనిని నియంత్రించేందుకు అదనపు పెట్టుబడులు (ఈపీఎఫ్‌, వీపీఎఫ్‌ కలిపి) రూ.2.5 లక్షలు దాటితే ఆ మొత్తంపై వడ్డీని పన్ను పరిధిలోకి తీసుకువచ్చారు.

1977-78లో 8 శాతం వడ్డీ

1977-78లో పీఎఫ్‌ వడ్డీరేటు 8 శాతంగా ఉంటే, ప్రస్తుతం 8.1 శాతంగా నిర్ణయించారు. గత 44 ఏళ్లలో ఎప్పుడూ పీఎఫ్‌ వడ్డీరేటు ఈస్థాయిలో తగ్గలేదు. ఈపీఎఫ్‌ వడ్డీరేట్లను చిన్నమొత్తాల పొదుపు వడ్డీరేట్లతో సమానంగా తీసుకురావాలన్నలక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.

కోత ఎందుకంటే...

‘‘ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ, మార్కెట్‌ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 8.1 శాతానికి సిఫార్సు చేశాం. మేం ఇప్పుడు నష్టభయం అధికంగా ఉండే వాటిలో పెట్టుబడులు పెట్టలేం. సామాజిక భద్రతను, మార్కెట్‌ స్థిరత్వాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి’’ అని ఈపీఎఫ్‌వో ట్రస్టీ బోర్డు సభ్యుల సమావేశం అనంతరం కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌ తెలిపారు.

విమర్శించిన ప్రతిపక్షాలు

ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు తగ్గింపును కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు వడ్డీరేటు తగ్గింపు రూపంలో భాజపా తిరుగు బహుమతి ఇచ్చిందని విమర్శించింది. వామపక్షాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్నివ్యతిరేకించాయి. ఎన్నికల్లో గెలుపు తర్వాత  ప్రజలపై భాజపా ప్రతీకార దాడులను పెంచిందని సీపీఎం ఆరోపించింది. వడ్డీ రేటును పెంచాల్సింది పోయి.. తగ్గిస్తారా అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు సీపీఐ లేఖ రాసింది. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని అభ్యర్థించింది.


ఎంత తగ్గుతుందంటే?

ద్యోగి పీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగి, యజమాని వాటా, ఈపీఎస్‌ పేరిట మూడు ఖాతాలు ఉంటాయి. ఈపీఎస్‌ అనేది భవిష్యత్తులో ఇచ్చే పింఛను నిధి. ఈ నిధిపై ఎలాంటి వడ్డీ లభించదు. ఉద్యోగి పీఎఫ్‌ ఖాతాలో వేతనం నుంచి చెల్లించే నిర్బంధ చందాతో పాటు స్వచ్ఛందంగా చెల్లించే వీపీఎఫ్‌ చందా కలిపి ఉంటాయి. యజమాని వాటాలో ఈపీఎస్‌ చందా తీసివేయగా మిగతా మొత్తాన్ని యజమాని ఖాతా కింద చూపిస్తారు. ఉద్యోగి, యజమాని ఖాతాల్లోని మొత్తానికి కలిపి ఈపీఎఫ్‌వో వడ్డీ చెల్లిస్తుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి ఈపీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగి, యజమాని చందా మొత్తం రూ.లక్ష ఉంటే.. 2020-21 ఏడాది వడ్డీరేటు 8.5% ప్రకారం ఏడాదికి రూ.8,839 వడ్డీ జమవుతుంది. 2021-22 ఏడాదికి వడ్డీరేటు 8.1 శాతంగా నిర్ణయించడంతో రూ.8,407 వడ్డీ మాత్రమే వస్తుంది. అంటే ప్రతి లక్షకు వచ్చే వడ్డీ రూ.432 తగ్గుతుంది.ఈ లెక్కన పీఎఫ్‌ ఖాతాలో ఎంతనగదు ఉంటే.. ఆ మేరకు వచ్చే వడ్డీ తగ్గుతుంది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని