Hijab Row: విద్యా సంస్థల్లో హిజాబ్‌ వద్దు

‘ముస్లింల పవిత్ర ఖురాన్‌లో హిజాబ్‌ను అనివార్యం చేయలేదు. అది ఒక సూచన మాత్రమే. హిజాబ్‌ ధరించని వారికి శిక్షలు, జరిమానాలు లేవు.  మహిళల సామాజిక భద్రతకు అవసరమైన హిజాబ్‌ను

Updated : 16 Mar 2022 04:49 IST

పవిత్ర ఖురాన్‌లోనూ తప్పనిసరి చేయలేదు

ప్రభుత్వ ‘యూనిఫాం’ ఆదేశాలపై విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు

వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

‘ముస్లింల పవిత్ర ఖురాన్‌లో హిజాబ్‌ను అనివార్యం చేయలేదు. అది ఒక సూచన మాత్రమే. హిజాబ్‌ ధరించని వారికి శిక్షలు, జరిమానాలు లేవు.  మహిళల సామాజిక భద్రతకు అవసరమైన హిజాబ్‌ను మతంలో భాగంగా పరిగణించలేం.

పాఠశాలల్లో పక్షపాతం లేని నిబంధనలను, విధానాలను రూపొందిస్తారు. వస్త్రధారణలో ఏకరూపత లేకుంటే ఈ నిబంధనల ఉద్దేశం దెబ్బతింటుంది. సమాజంలోని ప్రాంతీయతత్వం, మతాలు, జాతులు, సంస్కృతుల మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలకు ఏకరూప వస్త్రాలతోనే పరిష్కారం చూపగలం.

- కర్ణాటక హైకోర్టు

ఈనాడు డిజిటల్‌, బెంగళూరు: హిజాబ్‌.. ముస్లిం మతంలో అనివార్యంగా ఆచరించాల్సిన వస్త్రధారణ కాదని కర్ణాటక హైకోర్టు తేల్చి చెప్పింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాల నిబంధనలను పాటించాలన్న కర్ణాటక సర్కారు ఆదేశాన్ని సమర్థించింది. విద్యా సంస్థల్లో ఏకరూప వస్త్రాలపై ఆదేశాలిచ్చే అధికారం సర్కారుకు ఉందని విస్పష్టంగా ప్రకటించింది. రాజ్యాంగంలోని అధికరణలు 19(1)(ఎ), 25లో ప్రస్తావించిన మౌలిక హక్కులకు అనుగుణంగానే ప్రభుత్వం ఆదేశాలిచ్చినట్లు పేర్కొంది. విద్యార్థులకు ప్రభుత్వ ఆదేశాలను ప్రశ్నించే హక్కు లేదని సూచించిన కోర్టు.. ఈ వివాదంపై దాఖలైన ఇతర పిటిషన్లు హేతుబద్ధంగా లేవంటూ కొట్టేసింది. వివాదాస్పదంగా మారిన హిజాబ్‌ వస్త్ర ధారణపై మంగళవారం కర్ణాటక హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సుదీర్ఘ విచారణల అనంతరం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రితురాజ్‌ అవస్థి, జస్టిస్‌ ఎస్‌.కృష్ణ దీక్షిత్‌, జస్టిస్‌ మొహిద్దీన్‌ ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.

కేసు నేపథ్యం..

గత జనవరిలో ఉడుపి జిల్లా కుందాపురలోని ఓ కళాశాలకు హిజాబ్‌తో వచ్చిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం అడ్డుకుంది. దీన్ని ప్రశ్నిస్తూ, హిజాబ్‌ను అనుమతించాలని ఆరుగురు విద్యార్థినులు కోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ వివాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమవుతుండగా పాఠశాలల అభివృద్ధి సమితి (ఎస్‌డీసీ) రూపొందించిన ఏకరూప వస్త్రాల నిబంధనను తప్పనిసరి చేస్తూ ఫిబ్రవరి 5న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ వివాదంపై త్రిసభ్య ధర్మాసనం ఫిబ్రవరి 14 నుంచి 11 రోజులపాటు విచారణ జరిపింది.

తీర్పును సవాలు చేస్తూ సుప్రీంలో పిటిషన్‌

దిల్లీ: కర్ణాటక హైకోర్టు తీర్పును ఓ విద్యార్థిని సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. సుప్రీంకోర్టులో మంగళవారం ఈ పిటిషన్‌ దాఖలైంది. హిజాబ్‌తో తరగతి గదుల్లోకి అనుమతించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విద్యార్థినుల్లో ఈ పిటిషనర్‌ కూడా ఒకరు. రాజ్యాంగ అధికరణం 21 కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కు పరిధిలోకి హిజాబ్‌ వస్తుందని గుర్తించడంలో హైకోర్టు విఫలమైందని పేర్కొన్నారు.


కోర్టు తీర్పును పాటించాల్సిందే

కోర్టు తీర్పును అందరూ పాటించాల్సిందే. విద్యార్థులకు చదువు కంటే ఏదీ ముఖ్యం కాదు. కోర్టు తీర్పుతో హిజాబ్‌ వివాదం సమసిపోయింది. ఇక నుంచైనా విద్యార్థులు కళాశాలలకు హాజరవ్వండి.

- కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై


వివాదం మరింత ముదిరిందిఈ తీర్పుతో వివాదం సమసిపోక పోగా.. మరింత ముదిరే ప్రమాదం ఉంది. ప్రభుత్వం అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుంటే సరైన పరిష్కారం దొరికి ఉండేది. విద్యార్థుల భవిష్యత్తును పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- మాజీ ప్రధాన మంత్రి దేవేగౌడ


మళ్లీ నాలుగు గోడల్లోకి నెట్టారు

ఇలాంటి నిరంతర ప్రయత్నాలతో మహిళలను మళ్లీ నాలుగు గోడల మధ్య నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నవభారత నిర్మాణంలో మహిళలు కీలకంగా వ్యవహరించాలి. ఈ తీర్పును పూర్తిగా స్వాగతించలేం.

- అరీఫ్‌ మహ్మద్‌ ఖాన్‌, కేరళ గవర్నర్‌


హైకోర్టు తీర్పును స్వాగతించిన భాజపా నేతలు

కర్ణాటక హైకోర్టు వెలువరించిన తీర్పును పలువురు భాజపా నేతలు స్వాగతించారు. ఈ అంశాన్ని మహిళల సాధికారత కోణంలో నుంచి చూడాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి, కర్ణాటకకు చెందిన భాజపా నేత ప్రహ్లాద్‌ జోషి, సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు.


బాలికల విద్యకు భరోసానివ్వాలి: కాంగ్రెస్‌

కర్ణాటకలో బాలికల విద్యకు భరోసానివ్వడంతో పాటు సమాజంలో శాంతి, సామరస్యాలను పరిరక్షించాల్సిన బాధ్యత ఆ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. భాజపా ఎజెండా అమలు కోసం విద్యా సంస్థల్లోని ప్రశాంత వాతావరణాన్ని దెబ్బ తీయరాదని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలా సూచించారు.


ముస్లిం బాలికల విద్యకు విఘాతం

విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని హైకోర్టు సమర్థించడంవల్ల మత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని, ముస్లిం బాలికల విద్యకు అవరోధం ఏర్పడుతుందని ‘జమీయత్‌ ఉలేమా ఎ హింద్‌’ అభిప్రాయపడింది. హైకోర్టు తీర్పు అసంతృప్తికి గురి చేసిందని ఆ సంస్థ అధ్యక్షుడు మౌలానా మహమూద్‌ మదానీ తెలిపారు.

- జమీయత్‌ ఉలేమా హింద్‌


మత స్వేచ్ఛ హక్కుకు ప్రతికూలం

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉందని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ పేర్కొన్నారు. తీర్పు వెలువడిన తర్వాత వరుసగా పోస్టు చేసిన ట్వీట్లలో ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజ్యాంగంలోని 15వ అధికరణం దేశ ప్రజలకు కల్పించిన మత, సాంస్కృతిక, భావ ప్రకటనా స్వేచ్ఛను తీర్పు హరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ముస్లిం మహిళల మీద ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ఆధునికత అంటే మతపరమైన ఆచారాలను విడిచిపెట్టడం కాదని పేర్కొన్నారు. హిజాబ్‌ వేసుకుంటే సమస్య ఏమిటని ఒవైసీ ప్రశ్నించారు.

- అసదుద్దీన్‌ ఒవైసీ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని