మానవతామూర్తికి అమృత నివాళి

రైతు బాంధవుడు, పౌల్ట్రీ పరిశ్రమ మార్గదర్శి, బాలాజీ హేచరీస్‌ అధినేత డాక్టర్‌ ఉప్పలపాటి సుందర నాయుడి పార్థివదేహం శుక్రవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని స్వగృహానికి చేరుకుంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న

Updated : 30 Apr 2022 05:47 IST

సుందర నాయుడి పార్థివదేహానికి   ప్రముఖుల శ్రద్ధాంజలి

ఈనాడు డిజిటల్‌, చిత్తూరు: రైతు బాంధవుడు, పౌల్ట్రీ పరిశ్రమ మార్గదర్శి, బాలాజీ హేచరీస్‌ అధినేత డాక్టర్‌ ఉప్పలపాటి సుందర నాయుడి పార్థివదేహం శుక్రవారం సాయంత్రం చిత్తూరు నగరంలోని స్వగృహానికి చేరుకుంది. ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ పార్టీల నేతలు, రైతులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఉదయం నుంచే సుందరనగర్‌లోని ఇంటికి చేరుకున్నారు. సుందర నాయుడి సతీమణి సుజీవన, అల్లుడు.. ‘ఈనాడు’ ఎండీ కిరణ్‌, కుమార్తెలు, మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ శైలజాకిరణ్‌, నీరజ, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సుందర నాయుడు గొప్ప మానవతావాదని.. రైతుల శ్రేయస్సు కోసం నిరంతరం తపించిన వ్యక్తి అని బరువెక్కిన హృదయంతో నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుందర నాయుడి పార్థివదేహానికి భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల కుటుంబసభ్యులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించారు. మాజీ ఎంపీలు చింతా మోహన్‌, దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు వెంకటేశ్వర చౌదరి, సీకే బాబు, ఆయన సతీమణి సీకే లావణ్య, చిత్తూరు మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ చెంగల్రాయ నాయుడు, రాస్‌ ప్రధాన కార్యదర్శి వెంకటరత్నం, సంయుక్త కార్యదర్శి మమత, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వైవీ రాజేశ్వరి, చిత్తూరు జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడు కట్టమంచి బాలకృష్ణారెడ్డి, పలువురు కోళ్ల రైతులు సుందర నాయుడి భౌతిక కాయం వద్ద నివాళులర్పించారు.

పూతలపట్టు మండలం నుంచి ర్యాలీగా

శుక్రవారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌ నుంచి అంబులెన్సులో డాక్టర్‌ సుందర నాయుడి పార్థివదేహాన్ని చిత్తూరుకు తరలించారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు వాహనం వెంట వచ్చారు. కర్నూలు, నంద్యాల, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం ఎం.రంగపేటకు అంబులెన్స్‌ చేరుకుంది. అక్కడి నుంచి కోళ్ల రైతుల ఆధ్వర్యంలో చిత్తూరు వరకు ర్యాలీగా వచ్చారు. సాయంత్రం 4.20 గంటలకు కలెక్టరేట్‌ సమీపంలోని సుందరనగర్‌లోని స్వగృహానికి చేరుకున్నారు.


నేడు అంత్యక్రియలు

డాక్టర్‌ సుందరనాయుడు అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమవుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. సుందరనగర్‌లోని బాలాజీ హేచరీస్‌ ఆవరణలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేయనున్నారు.

* పౌల్ట్రీ రంగ దిగ్గజం సుందరనాయుడుతో తనకు దశాబ్దాలుగా పరిచయం ఉందని రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పౌల్ట్రీ రంగంలో లక్షలమందికి స్ఫూర్తిగా నిలిచిన సుందరనాయుడు మృతి తీరనిలోటు అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని