బీటెక్‌ ఫీజుల నిర్ధారణకు బ్రేక్‌

వచ్చే మూడు విద్యా సంవత్సరాలకు బీటెక్‌ ఫీజుల నిర్ధారణ ఆగిపోయింది. రుసుముల నిర్ధారణపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి కొత్త మార్గదర్శకాలు అందాయని, అందువల్ల ప్రస్తుత ఫీజుల ప్రక్రియను నిలిపివేస్తున్నామని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రకటించింది.

Published : 20 May 2022 06:05 IST

ఏఐసీటీఈ కొత్త మార్గదర్శకాలు వచ్చినందునే: టీఏఎఫ్‌ఆర్‌సీ
ఇప్పటివరకు నిర్ధారించిన వాటిని పునఃసమీక్షిస్తామని స్పష్టీకరణ
రేపు కీలక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: వచ్చే మూడు విద్యా సంవత్సరాలకు బీటెక్‌ ఫీజుల నిర్ధారణ ఆగిపోయింది. రుసుముల నిర్ధారణపై అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి కొత్త మార్గదర్శకాలు అందాయని, అందువల్ల ప్రస్తుత ఫీజుల ప్రక్రియను నిలిపివేస్తున్నామని తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ప్రకటించింది. రాష్ట్రంలో ఈ నెల 16వ తేదీ నుంచి ఆయా కళాశాలల రుసుముల నిర్ధారణ ప్రక్రియను ప్రారంభించగా.. వాటిని తిరిగి సమీక్షిస్తామని పేర్కొంది.

‘శ్రీకృష్ణ’ సిఫారసులకు ఆమోదం

బీటెక్‌కు కనీస రుసుం రూ.79,600, గరిష్ఠంగా రూ.1,89,800 ఉండాలని ఏఐసీటీఈ నియమించిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ సిఫారసు చేసింది. దీన్ని కేంద్ర విద్యాశాఖ ఆమోదించింది. ఏఐసీటీఈ పంపించిన కమిటీ నివేదిక గురువారం టీఏఎఫ్‌ఆర్‌సీకి అందింది. తాజా మార్గదర్శకాలను అమలు చేయాలని ఏఐసీటీఈ లేఖ రాసిన నేపథ్యంలో.. శనివారం సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు తెలిపాయి. ఏఐసీటీఈకి ఫీజులను నిర్ణయించే అధికారం లేదని, ఏఎఫ్‌ఆర్‌సీలదే తుది నిర్ణయమని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని.. ఇప్పుడు జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నిర్ణయించిన ఫీజులను అమలుచేయాలనడం ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోందని టీఏఎఫ్‌ఆర్‌సీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇందులో న్యాయపరమైన అంశాలపైనా చర్చిస్తామన్నాయి. శ్రీకృష్ణ కమిటీ సిఫారసులను కేంద్రం ఆమోదించిన తర్వాతే ఏఐసీటీఈ అన్ని రాష్ట్రాలకు పంపడంతో మార్గదర్శకాలను అమలుచేయాల్సిందేనా అన్న సందేహమూ వస్తోంది. కనీస ఫీజు రూ.79,600 ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వంపై బోధనా రుసుముల పేరిట భారీగానే భారం పడనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కనీస రుసుం రూ.35 వేలు, గరిష్ఠంగా రూ.1.34 లక్షలు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని