Updated : 28 Jun 2022 06:21 IST

బ్రాండ్‌... భారత్‌ !

ఇక ఒకే పేరుతో యూరియా, డీఏపీ అమ్మకం
ఎరువుల కంపెనీల సొంత బ్రాండ్లు రద్దు

ఈనాడు, హైదరాబాద్‌ : రసాయన ఎరువుల అమ్మకాల్లో ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యానికి అడ్డుకట్ట పడబోతోంది. కృత్రిమ కొరత సృష్టించే సంస్థల ఎత్తుగడలను అడ్డుకునేందుకు కేంద్రం కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దీనిని ప్రాథమికంగా ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అనే పేరుతో పిలుస్తున్నారు. ఇకపై ‘ఒక దేశం-ఒకటే ఎరువు’ నినాదంతో డీఏపీ, యూరియాలను ఒకే బ్రాండ్‌ పేరుతో అమ్మాలని కేంద్రం అన్ని కంపెనీలకు నిబంధన పెట్టనుంది. భారత్‌ డీఏపీ, భారత్‌ యూరియా పేరుతో ఈ రెండు ఎరువులను కంపెనీలు మార్కెట్‌లో రైతులకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఆగస్టు 15 నుంచి దేశంలో కొన్ని ప్రాంతాల్లో అమల్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అమలు ఇలా..

కేంద్ర ఎరువుల శాఖ సూచనల ప్రకారం ఇకపై అన్ని కంపెనీలు తయారుచేసే బస్తాలపై ఒకటే లోగో ఉంటుంది. పక్కన ‘ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారిక్‌ పరియోజన’ అని పథకం పేరు ఉంటుంది. దానికింద ‘భారత్‌ యూరియా’ అనే బ్రాండు పేరు, దాని తయారీ, మార్కెటింగ్‌ కంపెనీ పేరు ముద్రిస్తారు. మొత్తం 16 భారతీయ భాషల్లో ‘భారత్‌ యూరియా’ అనే పేరు ఉంటుంది. కేంద్రం ఇచ్చే రాయితీ వివరాలూ బస్తాలపై ఉంటాయి. ఈ పథకం అమలుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం దేశవ్యాప్తంగా అన్ని ఎరువుల కంపెనీలు, రాష్ట్ర వ్యవసాయశాఖల అధికారులతో ఆన్‌లైన్‌లో చర్చించాలని కేంద్ర ఎరువుల శాఖ నిర్ణయించింది. అనంతరం ఎరువుల నియంత్రణ చట్టం కింద నోటిఫికేషన్‌ జారీ చేస్తారు. దీని అమలుకు కంపెనీలు, వ్యాపారులు, కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తారు. సోషల్‌ మీడియాలో ఈ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని కేంద్రం నిర్ణయించింది.

ఇవీ ప్రయోజనాలు..

కొత్త పథకం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 21 కంపెనీలు 31 ప్లాంట్లలో యూరియాను ఉత్పత్తి చేస్తూ వివిధ బ్రాండ్ల పేర్లతో రైతులకు అమ్ముతున్నాయి. మరో 3 ప్రభుత్వ వాణిజ్య సంస్థలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 15 కంపెనీలు డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులను తయారుచేస్తున్నాయి. దేశీయంగా 45 కిలోల యూరియా బస్తా ఉత్పత్తి వ్యయం రూ.1,350 కాగా రైతుకు రూ.266.50కి విక్రయిస్తున్నారు. మిగిలిన రూ.1083.50 కేంద్రం రాయితీగా భరించి ఎరువుల కంపెనీలకు చెల్లిస్తోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న యూరియా బస్తా రూ.2,433 కాగా అందులో రూ.2166.50 కేంద్రం రాయితీగా భరిస్తోంది. ఏకంగా 90 శాతం సొమ్మును కేంద్రం రాయితీ రూపంలో భరిస్తుంటే కంపెనీలు సొంత బ్రాండ్‌ పేరుతో అమ్ముకోవడం ఏంటన్నది కేంద్రం వాదన. పైగా యూరియాలో ఉండే రసాయనం నత్రజని ఒకటే అయితే తమ కంపెనీ యూరియా వాడితే అధిక దిగుబడి వస్తుందని కొన్ని కంపెనీలు రైతులను పక్కదారిపట్టిస్తున్నాయి. దీనివల్ల ఆ బ్రాండ్‌ మార్కెట్‌లో లేకపోతే యూరియా కొరత ఉందని రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ‘భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ’ అంటూ ఒకటే బ్రాండు పేరుతో అమ్మాలనేది ఈ పథకం లక్ష్యం. దీనివల్ల రూ.3వేల కోట్ల వరకూ రవాణా వ్యయం ఆదా అవుతుందని కేంద్రం భావిస్తోంది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని