Telangana High Court: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ప్రమాణం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.05 గంటలకు జస్టిస్‌ భూయాన్‌తో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసైలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.

Updated : 29 Jun 2022 05:49 IST

 రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్‌ తమిళిసై

హాజరైన సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఇతర ప్రముఖులు

ఈనాడు, హైదరాబాద్‌: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10.05 గంటలకు జస్టిస్‌ భూయాన్‌తో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణం చేయించారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, గవర్నర్‌ తమిళిసైలు పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ సతీమణి సంఘమిత్ర, కుమార్తె, బంధువులు,  కేంద్ర మంత్రి  కిషన్‌రెడ్డి హాజరయ్యారు. ఇంకా శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు ఎస్‌.నిరంజన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం అనంతరం జస్టిస్‌ భూయాన్‌ తొలి రోజు మొదటి కోర్టు హాలులో కేసుల విచారణను చేపట్టారు.

అనుమానాలకు తెరదించుతూ హాజరైన సీఎం

గత కొంతకాలంగా గవర్నర్‌ కార్యాలయానికి, ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రాజకీయ విభేదాల నడుమ ఈ కార్యక్రమం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం తీరుపై గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేయగా.. ఆమెపై మంత్రులు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారా అన్న అనుమానాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి హాజరయ్యారు. 2021 అక్టోబరులో గత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం రాజ్‌భవన్‌కు ముఖ్యమంత్రి రావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితో నవ్వుతూ కరచాలనం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముందు సీఎం, గవర్నర్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌లు కలిసి మాట్లాడుకున్నారు. కార్యక్రమం అనంతరం కిషన్‌రెడ్డి, గవర్నర్‌, సీఎంలు ఒకేచోట కూర్చుని తేనీరు సేవించారు. వేదికపై జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్నపుడు గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు.

బదిలీపై వచ్చి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి

జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ ముంబయి హైకోర్టు నుంచి తెలంగాణ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చి.. ఇక్కడే ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 1964 ఆగస్టు 2న అస్సాంలోని గువాహటిలో జస్టిస్‌ భూయాన్‌ జన్మించారు. 1991 మార్చిలో బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. 2010లో సీనియర్‌ న్యాయవాది హోదా పొందగా, అస్సాం అదనపు అడ్వొకేట్‌ జనరల్‌గా విధులు నిర్వహించారు. ఆయన తండ్రి కూడా అడ్వొకేట్‌ జనరల్‌గా పనిచేయడం విశేషం. 2011 అక్టోబరు 17న గువాహటి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ భూయాన్‌ నియమితులయ్యారు. 2019లో అక్టోబరులో ముంబయి హైకోర్టుకు బదిలీపై వచ్చి.. అక్కడి నుంచి 2021 అక్టోబరు 22న తెలంగాణ హైకోర్టుకు వచ్చారు. తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా విధులు నిర్వహించిన ఆయన.. ఇకముందు ప్యాట్రన్‌ ఇన్‌ చీఫ్‌గా వ్యవహరించనున్నారు.


దిల్లీ సీజేగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ

దిల్లీ: దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ హైకోర్టు సీజేగా పనిచేసిన ఆయన ఇటీవలే దిల్లీకి బదిలీ అయిన విషయం తెలిసిందే. జస్టిస్‌ సతీశ్‌చంద్ర శర్మతో దిల్లీ లెఫ్టినెంట్‌ కర్నల్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, సీనియర్‌ న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని