18 కేసుల్లో అభియోగపత్రాలున్న జగన్‌కు లేని ఇబ్బంది నాకెందుకు?

‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీకి సంబంధించి మొత్తం 18 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలై ఉన్నాయి. విధి నిర్వహణలో ఆయనకు కలగని ఇబ్బంది (ఎంబ్రాస్‌మెంట్‌) ఏ కేసులోనూ ఛార్జిషీటే లేని నాకు ఎందుకు

Published : 30 Jun 2022 06:18 IST

ఏ కేసులోనూ నాపై ఛార్జిషీట్‌ లేదు

ఏపీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు

ఈనాడు, అమరావతి: ‘ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ, ఈడీకి సంబంధించి మొత్తం 18 కేసుల్లో అభియోగపత్రాలు దాఖలై ఉన్నాయి. విధి నిర్వహణలో ఆయనకు కలగని ఇబ్బంది (ఎంబ్రాస్‌మెంట్‌) ఏ కేసులోనూ ఛార్జిషీటే లేని నాకు ఎందుకు ఎదురవుతుంది’ అని సీనియర్‌ ఏపీ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘రాజకీయ నాయకులకు అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమావళి వర్తించదు కదా అనొచ్చు. నైతికంగా వర్తిస్తుందా లేదా అనేది వారిష్టం. కానీ ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మిపై కూడా పలు కేసుల్లో అభియోగపత్రాలు దాఖలయ్యాయి. ఆమెకు వర్తించని నియమావళి నాకు మాత్రమే ఎలా వర్తిస్తుంది? ఇది నా ప్రాథమిక హక్కుకు భంగం కలిగించటం కాదా’ అని నిలదీశారు. ఈ వ్యవహారంపై న్యాయపోరాటం చేస్తానని వ్యాఖ్యానించారు. ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. నేర విచారణ ఎదుర్కొంటున్న ఏసీబీ కేసుకు సంబంధించి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారంటూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఆయన్ను సస్పెండ్‌ చేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న ఆయన పోస్టింగులో కొనసాగితే విధి నిర్వహణలో ఎంబ్రాస్‌మెంట్‌ ఎదురవుతుందని సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడలోని తన నివాసంలో బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజ్యాంగ, చట్టబద్ధ పరిపాలన వ్యవస్థల్లో ముఖ్యమంత్రి సహా సీఎస్‌, డీజీపీ ఎవరైనా సరే పరిమితులకు లోబడే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వాటిని దాటి ప్రవర్తిస్తే ఈ రోజు కాకపోతే రెండేళ్ల తర్వాతైనా చేసిన తప్పులకు సమాధానం చెప్పాల్సిందే, తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందేనని అన్నారు. తానైతే ఈ వ్యవహారాన్ని అసలు విడిచిపెట్టేదే లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని