ఏపీలో మరోసారి ఆర్టీసీ ఛార్జీల బాదుడు

ప్రయాణికులపై ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి ఛార్జీల భారం మోపింది.  ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచిన సంస్థ... మళ్లీ రెండున్నర నెలలకే అదే డీజిల్‌ సెస్‌ పేరు చెబుతూ టికెట్ల ధరలను పెంచింది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణికులపై

Published : 01 Jul 2022 06:10 IST

 గరిష్ఠంగా ఎక్స్‌ప్రెస్‌లో రూ.90, సూపర్‌ లగ్జరీలో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 పెంపు

పల్లెవెలుగులోనూ 30 కి.మీ. దాటాక వడ్డన

నేటి నుంచే అమలు

ఈనాడు, అమరావతి: ప్రయాణికులపై ఏపీఎస్‌ఆర్టీసీ మరోసారి ఛార్జీల భారం మోపింది.  ఏప్రిల్‌ 14 నుంచి డీజిల్‌ సెస్‌ పేరిట ఛార్జీలు పెంచిన సంస్థ... మళ్లీ రెండున్నర నెలలకే అదే డీజిల్‌ సెస్‌ పేరు చెబుతూ టికెట్ల ధరలను పెంచింది. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణికులపై ఛార్జీలు బాదేశారు. పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు సర్వీసుల్లో గరిష్ఠంగా రూ.20-25 వరకు పెంచగా, ఎక్స్‌ప్రెస్‌లో రూ.90, అల్ట్రా డీలక్స్‌, సూపర్‌ లగ్జరీల్లో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 వరకు గరిష్ఠంగా పెంచారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో తిరిగే సిటీ సర్వీసులకు పెంపు నుంచి మినహాయించారు. డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యం రూ.2.50 కోట్లు అదనంగా ఖర్చవుతోందని, అందుకే ఛార్జీలు పెంచామని యాజమాన్యం పేర్కొంది. ఈసారి పెరిగిన ఛార్జీలతో ప్రయాణికులపై ఏటా రూ.500 కోట్ల వరకు భారం పడుతుందని అంచనా. ఈ పెంపు శుక్రవారం నుంచే అమలులోకి వస్తుంది.

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.70-80 పెరుగుదల

విజయవాడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దూర ప్రాంత సర్వీసుల్లో ఛార్జీల రూపంలో ప్రయాణికులపై మరింత భారం పెరుగుతోంది. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు ఒక్కొక్కరికీ సూపర్‌ లగ్జరీలో రూ.70, ఏసీ సర్వీసుల్లో రూ.80 చొప్పున పెరుగుతోంది. విజయవాడ నుంచి విశాఖపట్నానికి సూపర్‌లగ్జరీలో రూ.80, ఏసీలో రూ.90 పెరుగుతుంది. విజయవాడ నుంచి తిరుపతికి సూపర్‌లగ్జరీలో రూ.100, ఏసీ సర్వీసుల్లో రూ.110-120 చొప్పున అదనపు భారం పడుతోంది. విశాఖపట్నం నుంచి ఖమ్మం మీదుగా హైదరాబాద్‌కు సూపర్‌లగ్జరీలో రూ.120, ఏసీ సర్వీసుల్లో రూ.140 చొప్పున ఛార్జీ పెరిగింది.

తిరుమల ఘాట్‌ సర్వీసుల్లో రూ.15 పెంపు

తిరుపతి-తిరుమల ఘాట్‌లో తిరిగే ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో ప్రతి టికెట్‌పై రూ.15 చొప్పున పెంచారు. ప్రస్తుతం వీటిలో ఛార్జీ రూ.75 ఉండగా... రూ.90 చేశారు. పిల్లలకు రూ.45 ఉండగా రూ.50 చేశారు. కొండపైకి వెళ్లి, వచ్చేందుకు కలిపి తీసుకునే టిక్కెట్‌ ఛార్జి ప్రస్తుతం రూ.135 ఉండగా దాన్ని రూ.160 చేశారు. పిల్లలకు రూ.85 ఉంటే, రూ.5 పెంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని