187 కుటుంబాలకు పరిహారం చెల్లింపు

రంగారెడ్డి జిల్లా ఎల్‌కట్టా, చౌలపల్లిల్లోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారినపడి మృతి చెందిన వారికి సంబంధించి 187 కుటుంబాలకు పరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. చట్టప్రకారం

Published : 05 Jul 2022 05:52 IST

హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా ఎల్‌కట్టా, చౌలపల్లిల్లోని సిలికా గనుల్లో పనిచేసి కాలుష్యం బారినపడి మృతి చెందిన వారికి సంబంధించి 187 కుటుంబాలకు పరిహారం చెల్లించినట్లు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు నివేదించింది. చట్టప్రకారం ఒక్కొక్కరికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు సాయం అందించినట్లు తెలిపంది. సిలికా గనుల్లో పని చేసి భర్తలు మృతి చెందడంతో వందల మంది మహిళలు ఎల్‌కట్టా, చౌలపల్లిల్లో ఇబ్బందులెదుర్కొంటున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని 2019లో సుమోటోగా హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎస్‌.నందలతో కూడిన ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ చేపట్టింది. గత విచారణ సందర్భంగా ఈ వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నివేదికను సమర్పించింది. 2013నాటి రికార్డులు అందుబాటులో లేవంటూ కలెక్టర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు. జిల్లాల విభజన కారణంగా రికార్డులు కనిపించడంలేదని, బాధితులను గుర్తించడానికి కమిటీలు వేశామని తెలిపారు. వీటన్నింటిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధిత కుటుంబాలకు పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ నివేదిక ప్రకారం 187 మంది బాధిత కుటుంబాలకు పరిహారం అందజేసినట్లు తెలిపింది. ప్రభుత్వం బాధితులకు పరిహారం అందజేసినందున ఈ పిటిషన్‌పై విచారణను మూసివేస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని