NTA: మళ్లీ ఐఐటీలకు ఎన్‌టీఏ షాక్‌

జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మరోసారి విద్యార్థులతోపాటు ఐఐటీలకు షాక్‌ ఇచ్చింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే ఆదివారం ఎన్‌టీఏ విడుదల చేసింది. ఫలితంగా

Updated : 10 Aug 2022 11:20 IST

ర్యాంకులను వెల్లడించని వైనం

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) మరోసారి విద్యార్థులతోపాటు ఐఐటీలకు షాక్‌ ఇచ్చింది. జేఈఈ మెయిన్‌ ర్యాంకులను విడుదల చేయకుండా కేవలం ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే ఆదివారం ఎన్‌టీఏ విడుదల చేసింది. ఫలితంగా జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆదివారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 7 ఉదయం 10 గంటల నుంచి మొదలవుతుందని ఐఐటీ బాంబే గత ఏప్రిల్‌ 14నే ప్రకటించింది. జేఈఈ మెయిన్‌ పరీక్షలను నిర్వహించిన ఎన్‌టీఏ వాటి ర్యాంకులను ఆదివారం ప్రకటించలేదు. ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీని మాత్రమే వెల్లడించింది. ఆ ర్యాంకులు లేకుండా అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు అర్హులు ఎవరో తెలియదు. ర్యాంకుల్ని ఎప్పుడు ప్రకటించేది ఎన్‌టీఏ ఆదివారం కూడా ప్రకటించలేదు. దానితో సంప్రదించే ఐఐటీలు కాలపట్టికను ప్రకటిస్తాయి. ఆ సంస్థ మాత్రం అందుకు అనుగుణంగా నడుచుకోవడంలేదనే విమర్శలు వస్తున్నాయి. వాస్తవానికి ఐఐటీలు ఒక కాలపట్టికను చెబితే కచ్చితంగా అమలు చేస్తాయి. గత రెండేళ్లుగా మాత్రం ఎన్‌టీఏ దెబ్బకు ఐఐటీలు దాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాయి.

ఇలాగేనా ప్రశ్నపత్రాలు రూపొందించేది?

జులై 23 నుంచి 30 వరకు జేఈఈ మెయిన్‌ చివరి విడత పరీక్షలు జరిగాయి. ప్రశ్నపత్రాల్లో 23 తప్పులు జరిగినట్లు ప్రొవిజనల్‌ ఫైనల్‌ కీ ద్వారా వెల్లడైంది. ఆరు ప్రశ్నలను తొలగించారు. వాటికి మార్కులు ఇవ్వరు. కొన్నిటికి జవాబులు మార్చారు. మరికొన్నిటికి రెండు సరైన సమాధానాలుగా పేర్కొన్నారు. ప్రతిసారి ఇలా ఎందుకు జరుగుతుందో ఎన్‌టీఏ సమీక్షించుకోవాలని, ఇన్ని మార్పులు, చేర్పులు సమంజసం కాదని జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని