సంక్షిప్త వార్తలు (14)

యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఆచార్య డాక్టర్‌ కందాల వెంకటరమణాచారి (68) శుక్రవారం మాల్దీవులులో గుండెపోటుతో మృతిచెందారు. ప్రాథమిక విద్య నుంచి హెచ్‌ఎస్సీ

Updated : 02 Oct 2022 05:41 IST

బర్హంపూర్‌ ఐఐఎస్‌ఈఆర్‌ డైరెక్టర్‌ కేవీఆర్‌ చారి హఠాన్మరణం

భువనగిరి, న్యూస్‌టుడే: యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన ఆచార్య డాక్టర్‌ కందాల వెంకటరమణాచారి (68) శుక్రవారం మాల్దీవులులో గుండెపోటుతో మృతిచెందారు. ప్రాథమిక విద్య నుంచి హెచ్‌ఎస్సీ వరకు భువనగిరిలో చదువుకున్న ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత చదువు పూర్తిచేశారు. ఒడిశాలోని బర్హంపూర్‌ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌, రీసెర్చ్‌ సెంటర్‌(ఐఐఎస్‌ఈఆర్‌)లో డైరెక్టర్‌గా, ప్రొఫెసర్‌గా కొనసాగుతున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఇటీవల విహారయాత్ర కోసం మాల్దీవులకు వెళ్లారు. కేవీఆర్‌ చారికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చారి భార్య విజయలక్ష్మి హైదరాబాద్‌ యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (హెచ్‌యూఎంటీఏ) ఎండీగా కొనసాగుతున్నారు.


నేటి నుంచి జూనియర్‌ కళాశాలలకు దసరా సెలవులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని అన్ని జూనియర్‌ కళాశాలలకు ఆదివారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు దసరా సెలవులను ప్రకటించింది. సెలవుల అనంతరం తిరిగి 10న కళాశాలలు ప్రారంభమవుతాయని పేర్కొంది. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది.


ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌గా నవీన్‌ మిత్తల్‌

ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శిగా, ఇంటర్‌ విద్యాశాఖ కమిషనర్‌గా కళాశాల, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ శనివారం పూర్తి అదనపు బాధ్యతలు(ఎఫ్‌ఏసీ) తీసుకున్నారు. ఇప్పటివరకు పనిచేసిన జలీల్‌ పదవీ విరమణ పొందడంతో ప్రభుత్వం ఆయనకు ఈ బాధ్యతలను అప్పగించింది.


వ్యవసాయ వర్సిటీల్లో ధ్యాన విద్య

నందిగామ, న్యూస్‌టుడే: దేశంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో ధ్యాన విద్య(మెడిటేషన్‌ కోర్సు)ను ఉచితంగా అందించేందుకు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌(ఐసీఏఆర్‌), హార్ట్‌ఫుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు(హెచ్‌ఈటీ) సంస్థలు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందుకోసం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యానమందిరం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హశాంతివనంలోని శ్రీరామచంద్ర మిషన్‌ వేదికయింది.


నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌  వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ అత్యధికంగా హైదరాబాద్‌ శివారులోని శివరాంపల్లెలో 4.7 సె.మీ., అత్తాపూర్‌లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


హ్యాకింగ్‌కు గురైన తెదేపా ట్విటర్‌ ఖాతా

ఈనాడు డిజిటల్‌, అమరావతి:తెదేపా ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయినట్లు ఆ పార్టీ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. వైకాపా మద్దతుదారులే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆరోపించింది.


సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌లో ఆఫర్ల పండగ

ఈనాడు, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ‘సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌’లో అక్టోబరు 25వరకు ఆకర్షణీయమైన డిస్కౌంట్లు  అందిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్‌ పి.వి.యస్‌.అభినయ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. వీటితో పాటు రూ.6కోట్ల బహుమతులతో ‘లక్కీ బంపర్‌ డ్రా’ను నిర్వహిస్తున్నామని, వీటి ఫలితాలు ఈ నెల 5, 25వ తేదీల్లో  వెల్లడిస్తామని పేర్కొన్నారు. విజేతలకు 50 కార్లు, 130 ఎలక్ట్రిక్‌ బైకులు, 100 వెండి పళ్లాలు, 1,140 ఇండక్షన్‌ స్టౌలతో పాటు ఇంకా ఎన్నో బహుమతులు అందజేస్తామని వివరించారు.


ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌లో బహుమతుల సంబరాలు

ఈనాడు, హైదరాబాద్‌: దసరా, దీపావళి పండగల సందర్భంగా ‘ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌’లో వస్త్రాలు, నగలు కొనుగోలు చేసే కస్టమర్లు అద్భుతమైన బహుమతులు గెలుచుకోవచ్చని సంస్థ డైరెక్టర్‌ టి.కేశవ్‌ గుప్తా ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 5, 26వ తేదీల్లో గోల్డెన్‌ బంపర్‌ డ్రా ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు 2.5 కేజీల బంగారం, 80 కేజీల వెండి, 150 టీవీలు, 600 గ్రైండర్లు, 1,375 ఎలక్ట్రిక్‌ కుక్కర్లు తదితర బహుమతులు గెలుచుకొనే అవకాశం ఉందన్నారు. బంగారు, వెండి వస్తువులపైనా ఆఫర్లు అందిస్తున్నట్లు వివరించారు.


నల్ల నరసింహులుకు మంత్రి కేటీఆర్‌ నివాళులు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు అణచివేతకు వ్యతిరేకంగా నిలిచిన ధీశాలి, స్ఫూర్తిదాత అని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ తెలిపారు. నల్ల నరసింహులు జయంతి (అక్టోబరు 2) సందర్భంగా ఆయనకు మంత్రి నివాళులర్పించారు. జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడి, మహోన్నత నాయకుడిగా జనం గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారని కొనియాడారు.


ఏపీ విద్యుత్‌ ఉద్యోగులకు వేతనాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఏపీ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ అయి తెలంగాణలో చేరేందుకు ఎదురుచూస్తున్న 84 మంది ఉద్యోగులకు వేతనాలు చెల్లించడానికి అనుమతి ఇస్తూ తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకరరావు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. వీరిని ఏపీలో రిలీవ్‌ చేసిన తరవాత తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో చేర్చుకునేందుకు ఇక్కడ అనుమతించలేదు. తమ సమస్య పరిష్కరించాలంటూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించగా తీర్పు రిజర్వులో పెట్టింది. తీర్పు రావడానికి ఆలస్యమవుతున్నందున వారికి సెప్టెంబరు నుంచి వేతనాలు చెల్లించాలని సీఎండీ ఇచ్చిన ఆదేశాల్లో పేర్కొన్నారు. తీర్పు వచ్చిన తరవాత దాని ప్రకారం నడుచుకుంటామని  అందులో వివరించారు. సుదీర్ఘకాలంగా వేతనాలు లేక అల్లాడుతున్న ఈ ఉద్యోగులు సీఎండీ ఇచ్చిన ఆదేశాలతో ఊపిరిపీల్చుకున్నారు. వారిని విధుల్లోకి తీసుకుంటారా లేదా అనే విషయం మాత్రం ఇందులో స్పష్టం చేయలేదు.


24 జిల్లాల్లో 5 మీటర్లలోపే నీరు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 24 జిల్లాల్లో భూగర్భ జలమట్టం భూ ఉపరితలం నుంచి 5 మీటర్ల లోపే ఉందని భూగర్భ జలవనరుల శాఖ పేర్కొంది. సెప్టెంబరు నెల నివేదికను శనివారం విడుదల చేసింది. రాష్ట్ర సగటు భూగర్భ నీటి మట్టం 4.08 మీటర్లుగా నమోదయింది. గతేడాది 4.57 మీటర్లతో పోల్చితే 0.48 మీటర్లు పెరిగినట్లు గుర్తించారు. గత నెల సాధారణ వర్షపాతం 721 మి.మీటర్లకు గాను 52 శాతం అధికంగా 1,099 మి.మీటర్లు నమోదయింది. గతేడాది సెప్టెంబరుతో పోల్చితే 23 జిల్లాల్లో నీటి మట్టం పైకి వచ్చింది. సంగారెడ్డి జిల్లాలో గరిష్ఠంగా 2.62 మీటర్లు, కనిష్ఠంగా భద్రాద్రి జిల్లాలో 0.03 మీటర్లు పైకి వచ్చినట్లు గుర్తించారు. పది జిల్లాల్లో మాత్రం తరుగుదల నమోదయింది. 


అర్వింద్‌కుమార్‌కు ఇన్‌ఛార్జి సీఎస్‌ బాధ్యతలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ ఇక్రిశాట్‌ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకు శనివారం కెన్యా రాజధాని నైరోబీకి బయల్దేరి వెళ్లారు. 7న హైదరాబాద్‌కు తిరిగి వస్తారు. సీఎస్‌ విదేశీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌కు ప్రభుత్వం ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించింది.


అన్ని ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ అమలుచేయండి

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద గుర్తింపు కలిగిన అన్ని ఆస్పత్రుల్లో ఈహెచ్‌ఎస్‌ను అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. వేతన సవరణ సంఘం(పీఆర్సీ) సిఫార్సుల మేరకు పింఛను మూలవేతనంలో ఒక శాతం మినహాయించుకొని ఉద్యోగులందరికీ అమలుచేయాలి. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛను చెల్లించేలా చర్యలు చేపట్టాలని సంఘం నేతలు పేర్కొన్నారు.


మండలి ఉపాధ్యాయ ఓటర్ల నమోదు ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: శాసనమండలిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 29న ఆ స్థానం ఖాళీ కానుంది. శనివారం నుంచి వచ్చే నెల ఏడో తేదీ వరకు ఓటు హక్కు నమోదుకు అవకాశం ఉంది. నవంబరు 23న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. తుది ఓటర్ల జాబితాను డిసెంబరు 30న ప్రకటించనున్నట్లు వికాస్‌రాజ్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


 

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని