అగ్నివీర్‌ను ఆర్మీ రెండేళ్లు వ్యతిరేకించింది

మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వ్యాపార సవాళ్ల నేపథ్యంలో యురేషియా దేశాలతో భారతదేశం వ్యూహాత్మక, దీర్ఘకాలిక, ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని దౌత్యవేత్త, భారత మాజీ రాయబారి తల్మిజ్‌ అహ్మద్‌ అన్నారు.

Updated : 03 Oct 2022 11:09 IST

 యురేషియాలో భారత్‌కు వ్యూహాత్మక ప్రణాళిక అవసరం

ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదు

మంథన్‌ సంవాద్‌ సదస్సులో వక్తల ఉద్ఘాటన

ఈనాడు, హైదరాబాద్‌: మారుతున్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక, వ్యాపార సవాళ్ల నేపథ్యంలో యురేషియా దేశాలతో భారతదేశం వ్యూహాత్మక, దీర్ఘకాలిక, ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని దౌత్యవేత్త, భారత మాజీ రాయబారి తల్మిజ్‌ అహ్మద్‌ అన్నారు. దేశంలో అగ్నివీర్‌ ప్రతిపాదనను తొలుత ఆర్మీ కూడా వ్యతిరేకించిందని, రెండేళ్లపాటు నచ్చజెప్పేందుకు ప్రయత్నించి చివరకు ప్రజా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమోదించిందని రచయిత సుశాంత్‌ సింగ్‌ తెలిపారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి మారడం సరికాదని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అభిప్రాయపడ్డారు. దేశ విభజన శాంతియుతంగా జరగలేదని భాజపా నేత రాంమాధవ్‌ అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా మంథన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఇక్కడ మంథన్‌ సంవాద్‌ సదస్సు జరిగింది. భారత దేశ పశ్చిమ పొరుగు దేశాల్లో స్నేహితులెవరు.. శత్రువులెవరు; అడకత్తెరలో రాజ్యాంగం, పార్లమెంటు; అగ్నిపథ్‌, భారత దేశ జాతీయ రక్షణపై ప్రభావం; దేశ విభజన భూభాగంపైనా  మనుషుల మనసులపైనా అంశాలపై వక్తలు ప్రసంగించారు. భారత్‌లో తొలి మానవుడు అండమాన్‌లో అడుగు పెట్టారని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌, డయాగ్నస్టిక్‌ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్‌ కె.తంగరాజ్‌ తెలిపారు.

భారత్‌.. జీసీసీకి మరింత చేరువవ్వాలి

ఇప్పటికే అమెరికాకు చైనా, రష్యాతో మైత్రి దెబ్బతింది.  చైనా ముప్పుగా మారుతున్నందున పశ్చిమ ఆసియా దేశాలతో భారత్‌ భాగస్వామ్యం కీలకం. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ)తో భారత్‌ వ్యూహాత్మక పాత్ర పోషించాల్సిన అవసరముంది. అమెరికా ప్రాబల్యం ఇప్పటికే అక్కడ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో రాజకీయ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు ఆయా దేశాలకు నమ్మకమైన భారత్‌.. జీసీసీకి మరింతగా చేరువై, ఆయా దేశాలతో వ్యూహాత్మక వ్యాపార, భాగస్వామ్య, రక్షణ పాత్ర పోషించాలి. చైనా, రష్యాలతో సంబంధాలు పెంచుకుంటూ, ఇరాన్‌, అఫ్గాన్‌, టర్కీతో భాగస్వామ్యం పెంచుకోవాలి.

- తల్మిజ్‌ అహ్మద్‌, దౌత్యవేత్త, భారత మాజీ రాయబారి

దేశరక్షణ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడం సరికాదు

ఆర్మీలో పింఛన్ల భారం ఏడేళ్లలో రూ.45వేల కోట్ల నుంచి రూ.1.2లక్షల కోట్లకు చేరింది. ఈ భారాన్ని తగ్గించేందుకు దేశరక్షణ వ్యవస్థను ప్రమాదంలోకి నెట్టడం సరికాదు. ఇప్పటివరకు 17 ఏళ్లపాటు ఆర్మీలో పనిచేస్తే, పింఛను తదుపరి ఉద్యోగాలకు రిజర్వేషన్‌ లభించేది. ఇప్పుడు అగ్నివీర్‌గా ఎంపికైన వారు 23 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. వ్యూహాత్మకంగా తరాలుగా వస్తున్న విధానాన్ని కొనసాగించాల్సిన అవసరముంది. హిమాలయాల్లో రక్షణ కోసం నేపాల్‌కు చెందిన గూర్ఖాలను ఆర్మీలోకి తీసుకుంటున్నాం. ఇక వారికి పింఛను, శాశ్వత ఉద్యోగాలు ఉండబోవని చెబితే బలగాల్లో వారెందుకు చేరతారు? ఇప్పటికే గూర్ఖాలను తమ బలగాల్లోకి తీసుకోవాలని చైనా చూస్తోంది.

- సుశాంత్‌ సింగ్‌,  రచయిత

హిందూ ముస్లింలు ఐక్యతతో జీవిస్తున్నారు

దేశ విభజన శాంతియుతంగా జరగలేదు. చాలా మంది వ్యతిరేకించారు. కానీ కేవలం ఒక్కవ్యక్తి   పట్టుబట్టడంతో జరిగింది.  దేశ విభజన సమయంలో జనాభాలో ముస్లింలు 20 శాతం ఉన్నారు. ఇప్పుడు దేశంలో దాదాపు 18-20 శాతం మంది ఉన్నారు. ఇప్పటికీ దేశంలో హిందూ ముస్లింలు ఐక్యతతో జీవిస్తున్నారు. కొందరి కారణంగా వివాదాలు తలెత్తుతున్నాయి.

- రాంమాధవ్‌, భాజపా నేత

విద్వేష ప్రసంగాలే భాజపా అభిమతం

మతం, ప్రాంతం, వర్గం, కులం ఆధారంగా ఎన్నికలు జరిగే పరిస్థితి పోవాలి. దేశంలో విద్వేష ప్రసంగాలు కొనసాగాలన్నదే భాజపా అభిమతం. విద్వేష పూరిత ప్రసంగాలు చేసేవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. ఎంఐఎం పార్టీలోని వారెవరైనా ఈ తరహా ప్రసంగాలు చేస్తే ఉపేక్షించం. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం.

- అసదుద్దీన్‌ ఒవైసీ, హైదరాబాద్‌ ఎంపీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని