దేశ ఆర్థిక ఆరోగ్యానికి సీఏలు కీలకం

దేశ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల(సీఏ) పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 07 Oct 2022 04:54 IST

ఐసీఏఐ స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మాదాపూర్‌, న్యూస్‌టుడే: దేశ ఆర్థిక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ఛార్టర్డ్‌ అకౌంటెంట్ల(సీఏ) పాత్ర కీలకమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ది ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) స్నాతకోత్సవాన్ని మాదాపూర్‌ శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. అత్యంత ముఖ్యమైన సంస్కరణల్లో ఒకటైన జీఎస్టీ సజావుగా అమలయ్యేలా చూడటంలో సీఏలది ప్రధాన పాత్ర అని అన్నారు.  ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థ గల దేశాల్లో భారత్‌ అయిదో స్థానంలో ఉందని, భవిష్యత్తులో ప్రథమ స్థానంలో నిలిచే దిశగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ హయాంలో దేశ ఆర్థిక ముఖచిత్రం పూర్తిగా మారిపోయిందని, ప్రపంచ దేశాల్లో భారత్‌కు సముచిత స్థానం, గౌరవం దక్కుతున్నాయని చెప్పారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ పనిచేస్తున్నారని, కొందరు ముఖ్యమంత్రులైతే సచివాలయ ముఖం కూడా చూడకుండానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో కేంద్ర ప్రభుత్వం ముందంజలో ఉందని, ఒక్క తెలంగాణలోనే రహదారుల అభివృద్ధికి రూ.లక్షా 5 వేల కోట్లు ఖర్చు పెట్టిందన్నారు. ఐసీఏఐ సెంట్రల్‌ కౌన్సిల్‌ సభ్యుడు(సీసీఎం) ముప్పాల శ్రీధర్‌ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన 1,400 మంది విద్యార్థులు స్నాతకోత్సవం సందర్భంగా సీఏ కోర్సు పట్టా అందుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలను విస్మరించకుండా పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు, సీఏ కోర్సు పూర్తి చేసినవారికి ధ్రువపత్రాలు ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని