సంక్షిప్త వార్తలు(16)

ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మా డి, ఎంఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది.

Updated : 08 Oct 2022 05:59 IST

పీజీఈసెట్‌లో నేటికి 6,975 కన్వీనర్‌ సీట్లు
ప్రైవేట్‌ కళాశాలల్లో ప్రస్తుతానికి పాత ఫీజులే

ఈనాడు, హైదరాబాద్‌: ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఫార్మా డి, ఎంఆర్క్‌ సీట్ల భర్తీకి సంబంధించి పీజీఈసెట్‌ కౌన్సెలింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. ఇప్పటివరకు నాలుగు రకాల కోర్సుల్లో మొత్తం 9,967 సీట్లకు ఆయా వర్సిటీలు అనుమతి ఇవ్వగా అందులో 6,975 సీట్లను కన్వీనర్‌కోటాలో భర్తీ చేయనున్నారు. మొత్తం 84 ఎంటెక్‌, 91 ఎంఫార్మసీ, 26 ఫార్మాడి, ఆరు ఎంఆర్క్‌ కళాశాలలనే కౌన్సెలింగ్‌లో చేర్చారు. ఇంకా మరికొన్ని కళాశాలలకు జేఎన్‌టీయూహెచ్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంది. అనుబంధ గుర్తింపుపై ఆ వర్సిటీ తీవ్ర జాప్యం చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌, ఓయూ ఇంజినీరింగ్‌, టెక్నాలజీ కళాశాలలు ఈసారి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ సీట్ల ఫీజులను రూ.లక్షకు పెంచాయి. మరోవైపు ప్రైవేట్‌ కళాశాలల్లో కొత్తఫీజులకు సంబంధించి ప్రభుత్వం నుంచి జీవో రాకపోవడంతో ప్రస్తుతానికి గత ఏడాది ఫీజులనే కౌన్సెలింగ్‌లో ఉంచారు. జీవో వచ్చాక  కొత్త ఫీజులు అమల్లోకి వస్తాయని అభ్యర్థులకు సూచించారు.


దోస్త్‌ ప్రత్యేక విడత రిజిస్ట్రేషన్‌ గడువు పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: దోస్త్‌ ప్రత్యేక విడత ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి రిజిస్ట్రేషన్‌ గడువు శుక్రవారంతో ముగియగా దాన్ని ఈనెల 11 వరకు పొడిగించినట్లు కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి తెలిపారు. వారికి ఈనెల 13న సీట్లు కేటాయిస్తామన్నారు. ఇప్పటివరకు ముగిసిన మూడు విడతల దోస్త్‌ ద్వారా 1.53 లక్షల మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరారని తెలిపారు.


యువ ఐఏఎస్‌లతో ‘సివిల్స్‌’ కార్యశాల

ఈనాడు, హైదరాబాద్‌: ‘తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించం ఎలా?’ అనే అంశంపై ఈనెల 12-16 తేదీల మధ్య పలువురు యువ ఐఏఎస్‌ అధికారులతో 5 రోజులపాటు ఉచిత కార్యశాల నిర్వహిస్తున్నట్లు ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ ఛైర్మన్‌ పి.కృష్ణప్రదీప్‌ తెలిపారు. అశోక్‌నగర్‌లోని అకాడమీలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి బీపీ ఆచార్య పర్యవేక్షణలో నిర్వహించే ఈ కార్యశాలలో రాహుల్‌రెడ్డి, మకరంద్‌, ప్రతీక్‌షా, రాజర్షి, ముజ్జామిల్‌ఖాన్‌  యువ అధికారులు పాల్గొంటారన్నారు.


డిగ్రీలో ద్వితీయ భాషగా ఫ్రెంచ్‌

స్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం(2022-23) నుంచి ఫ్రెంచ్‌ను ద్వితీయ భాషగా ప్రవేశపెడుతున్నారు. దీనికి రాష్ట్ర ఉన్నత విద్యామండలి కూడా ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఫ్రెంచ్‌ భాషను నేర్పే కొన్ని ప్రైవేట్‌ సంస్థలతో రాష్ట్ర ఉన్నత విద్యామండలి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.


నేటి నుంచి ఐసెట్‌ కౌన్సెలింగ్‌

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి ఉద్దేశించిన ఐసెట్‌ కౌన్సెలింగ్‌ శనివారం నుంచి మొదలుకానుంది. ఈ నెల 12 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. 10-13 తేదీల మధ్య ధ్రువపత్రాల పరిశీలన, 10-15 తేదీల మధ్య వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని ప్రవేశాల కన్వీనర్‌ నవీన్‌మిత్తల్‌ ఓ ప్రకటనలో తెలిపారు.


15, 16 తేదీల్లో వీఆర్‌ఏల పాదయాత్ర

ఈనాడు, హైదరాబాద్‌: సమస్యలను పరిష్కరించాలంటూ ఈ నెల 15, 16 తేదీల్లో యాదాద్రి నుంచి ప్రగతిభవన్‌ వరకు పాదయాత్ర చేయనున్నట్లు వీఆర్‌ఏల ఐకాస ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమై భవిష్యత్‌ కార్యాచరణనుప్రకటించింది.


శ్రీశైలం, సాగర్‌లకు పెరిగిన ప్రవాహం
గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాలకు ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో క్రస్టు గేట్లు తెరుచుకున్నాయి. జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు ప్రవాహం పెరిగింది. కర్ణాటకలోని నారాయణపూర్‌ నుంచి కూడా దిగువకు 35 వేల క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. దీంతో శ్రీశైలం వద్ద ఇన్‌ఫ్లో క్రమంగా పెరిగింది. శుక్రవారం ఉ. 9 గంటలకు ఒక గేటు, 12 గంటలకు 3 గేట్లు, సాయంత్రానికి ప్రవాహం 1.54 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో 5 గేట్లు ఎత్తి 1.39 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. సాగర్‌కు కూడా ఉదయం 10 గంటల సమయానికి 1.15 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం చేరుకుంది. దీంతో తొలుత 8 గేట్లు, మధ్యాహ్నం 14 గేట్లను, సాయంత్రానికి 20 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.


సీఎస్‌ఎస్‌ వివరాల నమోదులో మార్పులు

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్‌ఎస్‌) ఆర్థిక అంశాలకు సంబంధించిన పాలనాపరమైన మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థికశాఖలోని వ్యయ విభాగం ఉత్తర్వులిచ్చింది. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా ఉన్న కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కేంద్రం సూచించింది. సమాచారం ఇస్తున్న విధానంలో ఎదురవుతున్న సమస్యలకు ముగింపు పలికేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. నమోదు చేసే వివరాల్లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను స్పష్టంగా పేర్కొనాలని వివరించింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన వివరాల నమోదును, సూచించిన మార్పులను ఈ నెల 15లోపు పూర్తి చేయాలని కేంద్ర ఆర్థికశాఖ రాష్ట్రాలను ఆదేశించింది.


9న బాలగోపాల్‌ స్మారక సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య భవన్‌లో ఈ నెల 9న మానవ హక్కుల నేత కె.బాలగోపాల్‌ 13వ స్మారక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) శుక్రవారం ప్రకటనలో తెలిపింది. ‘రాజ్యాంగ విలువల క్షీణత, ప్రజాస్వామ్య పునరుద్ధరణ అవసరం’ అంశంపై నిర్వహించే ఈ సమావేశంలో ప్రముఖ రచయిత్రి అరుంధతీరాయ్‌, పీయూసీఎల్‌ నేత మిహిర్‌ దేశాయ్‌, జాహా ఆరా తదితరుల ప్రసంగాలు ఉంటాయని వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయకర్తలు ఎస్‌.జీవన్‌కుమార్‌, వి.ఎస్‌.కృష్ణ తెలిపారు.


కొత్త కేసులు 76

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 76 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 8,38,376కి పెరిగింది.  తాజా ఫలితాల్లో హైదరాబాద్‌లో 44 పాజిటివ్‌లు నిర్ధారణయ్యాయి.   తాజాగా మరో 93 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 8,33,774 మంది ఆరోగ్యవంతులయ్యారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు.


ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
మంత్రి కేటీఆర్‌కు టీఎన్జీవోల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్‌ మంత్రి కేటీఆర్‌ను కోరారు. ఈ మేరకు శుక్రవారం వారు టీఎన్జీవోల సంఘం మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్‌, హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌, నగర శాఖ అధ్యక్షుడు శ్రీరామ్‌, కేంద్ర అసోసియేట్‌ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణతో కలిసి ప్రగతిభవన్‌లో మంత్రికి వినతిపత్రం సమర్పించారు. దంపతుల బదిలీలు చేపట్టడంతోపాటు డీఏలు మంజూరు చేయాలని, గచ్చిబౌలిలోని భాగ్యనగర్‌ హౌసింగ్‌ సొసైటీ ప్లాట్లను తమకు అప్పగించాలని ఈ సందర్భంగా వారు మంత్రిని అభ్యర్థించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరలోనే సమావేశం నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారని సంఘం నేతలు తెలిపారు.


నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణపై గాలులతో ఉపరితల ఆవర్తనం, ఉపరితల ద్రోణి ఏర్పడ్డాయి. కోస్తాంధ్ర నుంచి మహారాష్ట్ర వరకు గాలులతో 900 మీటర్ల ఎత్తున ఏర్పడిన ఉపరితల ఆవర్తనం తెలంగాణపై నుంచి వెళ్తోంది. మరోవైపు కోస్తాంధ్ర నుంచి తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలుల ద్రోణి వెళ్తోంది. వీటి ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తున్నాయని, శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం ఉదయం 8 నుంచి శుక్రవారం 8 గంటల వరకు అత్యధికంగా రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో 12.4 సెంటీమీటర్లు, చుక్కాపూర్‌లో 11.9, సోలిపూర్‌(వనపర్తి)లో 9.8, బొల్లంపల్లి(నాగర్‌కర్నూల్‌)లో 9.5, గంధమల్‌ (నారాయణపేట)లో 8.8 నాగారం(వికారాబాద్‌)లో 8.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది.


బాలమల్లు పదవీకాలం మూడేళ్లు పొడిగింపు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) ఛైర్మన్‌ గ్యాదరి బాలమల్లు పదవీకాలాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరో మూడేళ్ల పాటు పొడిగించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2025 అక్టోబరు 7వ తేదీ వరకు ఆయన పదవిలో కొనసాగుతారని అందులో పేర్కొంది. టీఎస్‌ఐఐసీ ఛైర్మన్‌గా తనకు మరో అవకాశం ఇచ్చినందుకుగాను బాలమల్లు శుక్రవారం ప్రగతిభవన్‌లో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.


ఇళ్ల ముందు నాలా..  తవ్వి వదిలేశారిలా..!

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నల్లకుంటలోని పద్మ కాలనీలో నాలా పనులు ప్రారంభించి ఆరు నెలలు కావస్తున్నా ఎక్కడి పనులు అక్కడే వున్నాయి. రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు కాలనీ వాసులు వాపోతున్నారు. మే నెలలో పనులు ప్రారంభించగా నెల రోజుల పాటు చేసి నిలిపివేశారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చూసి వెళ్తున్నారే తప్ప పనులు పునఃప్రారంభించడం లేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవలే మంత్రి కేటీఆర్‌కు సైతం ఫిర్యాదు చేశామన్నారు. వర్షాల వల్ల ఇళ్ల ముందటి స్థలం పెచ్చులూడి రోజురోజుకూ ప్రమాదభరితంగా తయారవుతోందని, త్వరగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు.

 


గూడ్స్‌రైలు ఢీకొని 335 గొర్రెల మృతి

దేవరకద్ర గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని 335 గొర్రెలు మృతి చెందాయి. ఈ సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండలం కౌకుంట్లలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన కాపరులు కుర్వ రవి, కుర్వ దులన్న, తిరుపతిలు రైలు పట్టాలకు దగ్గరున్న పొలంలో గొర్రెల మందను నిలిపారు. వర్షానికి చుట్టూ బురద కావడంతో 355 గొర్రెలు రైలు పట్టాలపైకి వెళ్లి నిలబడ్డాయి. అర్ధరాత్రి 2 గంటల సమయంలో వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీకొట్టడంతో 335 గొర్రెలు అక్కడికక్కడే చనిపోగా మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు రూ.30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.


ర్యాంకు తగ్గింపుపై వివరణివ్వండి
ఎన్‌టీయేకు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన విద్యార్థినికి నీట్‌ పరీక్షలో మార్కులు 482 నుంచి 294కు తగ్గించడంపై వివరణ ఇవ్వాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీయే)కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఎన్టీయే మార్కులు తగ్గించడాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన జి.ఎస్‌.జోత్స్న హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌, జస్టిస్‌ సీహెచ్‌.సుమలతలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.ఎస్‌.అర్జున్‌కుమార వాదనలు వినిపిస్తూ సెప్టెంబరు 7న వెలువడిన నీట్‌ ఫలితాల్లో స్కోర్‌ కార్డులో 482 మార్కులతో ఆలిండియా ర్యాంకు 100456, ఓబీసీ కేటగిరీలో 50567 ర్యాంకు వచ్చిందన్నారు. అయితే కాళోజీ  వర్సిటీ వెబ్‌సైట్‌లో తెలంగాణ నుంచి నీట్‌కు హాజరైన అభ్యర్థుల వివరాలు, ర్యాంకులను పరిశీలిస్తే మార్కులు 482 నుంచి 294కు తగ్గించారని, దీనివల్ల ర్యాంక్‌లు కోల్పోయినట్లు తెలిపారు. దీనికి ఎలాంటి కారణాలు చెప్పలేదని, మెయిల్‌ పంపినా ఎన్టీయే స్పందించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం ఎన్టీయే వివరణ తెలుసుకుని చెప్పాలంటూ దాని తరఫు న్యాయవాది బి.కవితాయాదవ్‌కు ఆదేశాలు జారీచేస్తూ విచారణను ఈనెల 11కి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని