డిసెంబరులో అసెంబ్లీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాలు, ఈడీ, ఐటీ, సిట్‌ సోదాలు లాంటి పరిణామాల నేపథ్యంలో డిసెంబరులో తెలంగాణ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు జరగనున్నాయి.

Updated : 25 Nov 2022 04:33 IST

మండలి సమావేశాలు కూడా
వారం రోజులపాటు నిర్వహణ
వాడీవేడిగా జరిగే అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ వైరుధ్యాలు, ఈడీ, ఐటీ, సిట్‌ సోదాలు లాంటి పరిణామాల నేపథ్యంలో డిసెంబరులో తెలంగాణ శాసనసభ, మండలి శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. వారం రోజుల పాటు వీటిని నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. గురువారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావులను ఆదేశించారు. శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబరు 13న ముగిశాయి. ఆ సమావేశాల్లో సీఎం మాట్లాడుతూ శీతాకాల సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగా తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

కేంద్రం, గవర్నర్‌ లక్ష్యంగా

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సమావేశాలు వాడీవేడిగా జరగనున్నాయి. తెలంగాణపై కేంద్రం విధిస్తున్న అనవసర ఆంక్షలతో పాటు, విభజన హామీల అమలులో వైఫల్యం, కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన వాటిని ఇతర రాష్ట్రాలకు తరలించడం, రాష్ట్ర మంత్రులు, నేతలపై ఈడీ, ఐటీ దాడులు తదితరాలను ఎండగట్టాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలిసింది. తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల మాదిరే విశ్వవిద్యాలయాలకు కులపతి (ఛాన్స్‌లర్‌) పదవి నుంచి గవర్నర్‌ను తొలగించి, ముఖ్యమంత్రికి ఆ పదవి దక్కేలా తీర్మానం చేసి, బిల్లు పెట్టే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. గత సమావేశాల సందర్భంగా 8 బిల్లులను శాసనసభ, మండలిలు ఆమోదించి పంపగా... అందులో ఒక్క జీఎస్టీ సవరణ బిల్లునే గవర్నర్‌ తమిళిసై ఆమోదించారు. మిగిలిన ఏడు బిల్లులు పెండింగులోఉన్నాయి. దీనిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. పోడు భూములు, ధరణి సమస్యలూ చర్చకు రానున్నాయి.

సమావేశాలు ఏయే తేదీల్లో...

శాసనసభ, మండలి సమావేశాల్లో వచ్చే నెల మొదటి లేదా రెండో వారంలో ఈ సమావేశాలు జరిగే వీలుంది. డిసెంబరులో జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి, సమీకృత జిల్లా కలెక్టరేట్లు, వైద్య కళాశాలలతో పాటు తెరాస జిల్లా కార్యాలయాలను ప్రారంభించాలని సీఎం ఇప్పటికే నిర్ణయించారు. నాలుగున ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటన ఖరారయింది. ఏడో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సమావేశాలు నిర్వహిస్తోంది. డిసెంబరులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబాల్లో వివాహాది శుభకార్యాలున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ, మండలి సమావేశాల తేదీలను ఖరారు చేసే వీలుంది.

అప్పటి సెషనే కొనసాగింపు

సెప్టెంబరు 13న శాసనసభ సమావేశాలు ముగిశాయి. అప్పటి సెషన్‌ ఇంకా ప్రొరోగ్‌ (సమావేశాల ముగింపు) జరగలేదు. వచ్చే నెలలో శాసనసభ ఎనిమిదో సెషన్‌కు సంబంధించి నాలుగో సమావేశం, మండలి 18వ సెషన్‌కు సంబంధించిన నాలుగో సమావేశంగా జరగనున్నాయి. మునుగోడులో తెరాస అభ్యర్థిగా గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి సభలో అడుగుపెట్టనున్నారు. సభాపతిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గత సమావేశాల చివరి రోజున భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను స్పీకర్‌ సస్పెండ్‌ చేశారు.ఆయన సస్పెన్షన్‌ను కొనసాగిస్తారా.. లేదా? అనేది సమావేశం మొదటి రోజున స్పష్టత వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని