క్రైస్తవులకు ప్రత్యేక పేరుతో ‘షాదీ ముబారక్‌’

ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ వర్గాల పేదింటి ఆడపిల్లల వివాహాలకు ‘షాదీ ముబారక్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని.. క్రైస్తవులకు సంబంధించిన పేరుతో ప్రత్యేకంగా అమలు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనలపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

Updated : 01 Feb 2023 05:23 IST

టీయూసీపీఏ సదస్సులో మంత్రి తలసాని

నారాయణగూడ, న్యూస్‌టుడే: ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మైనార్టీ వర్గాల పేదింటి ఆడపిల్లల వివాహాలకు ‘షాదీ ముబారక్‌’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని.. క్రైస్తవులకు సంబంధించిన పేరుతో ప్రత్యేకంగా అమలు చేస్తే బాగుంటుందనే ప్రతిపాదనలపై త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. మంగళవారం తెలంగాణ యునైటెడ్‌ క్రిస్టియన్‌ అండ్‌ పాస్టర్స్‌ అసోసియేషన్‌ (టీయూసీపీఏ) ఆధ్వర్యంలో నారాయణగూడలోని బాప్టిస్ట్‌ చర్చిలో రాష్ట్రంలోని 33 జిల్లాల పాస్టర్ల సదస్సులో మంత్రి మాట్లాడారు. క్రైస్తవులు తమ పిల్లలను మైనార్టీ గురుకులాల్లో చేర్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ శ్మశాన వాటికకు 64 ఎకరాలు కేటాయించగా, అందులో 42 ఎకరాలు రంగారెడ్డి, మేడ్చల్‌, మెదక్‌ జిల్లాల్లో సిద్ధంగా ఉందని, తీసుకునేవారు కనిపించడం లేదన్నారు. తెలంగాణలో మతతత్వశక్తుల పప్పులుడకవని పేర్కొన్నారు. ఈ సమావేశానికి వెళ్లడానికి వీల్లేదంటూ కొందరు తనకు ఫోన్లు చేశారని, ఇది క్రైస్తవుల్లో అనైక్యతను సూచిస్తోందన్నారు. సంఘం ఉపాధ్యక్షుడు జోయల్‌ మాట్లాడుతూ.. చాలాకాలంగా ముఖ్యమంత్రిని కలవాలనుకుంటున్నామని, ఒకసారి అవకాశం కల్పించాలని విన్నవించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. అందరూ ఐక్యతతో వస్తే పదిసార్లయినా ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ ఇప్పించడానికి సిద్ధమని పేర్కొన్నారు. సినీ నటుడు, పాస్టర్‌ రాజా మాట్లాడుతూ.. చట్టసభలకు క్రైస్తవుల గొంతు వినిపించే వ్యక్తిని పంపించాలన్నారు. సదస్సుకు సంఘం ప్రధాన కార్యదర్శి సాల్మన్‌రాజ్‌ అధ్యక్షత వహించారు. ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, సంఘం అధ్యక్షులు బిషప్‌ తిమోతి, క్రిస్టియన్‌ మైనారిటీ కార్పొరేషన్‌ ఏఓ శామ్యూల్‌, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు