తృణధాన్యాల కేంద్రం హైదరాబాద్‌!

దేశంలో తృణధాన్యాల పంటల (మిల్లెట్స్‌) సాగు, వాటి ఆహారోత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారనుంది. 

Updated : 02 Feb 2023 04:56 IST

అంకుర సంస్థలు, ఎఫ్‌పీఓల అనుసంధాన బాధ్యత ఐఐఎంఆర్‌కు

ఈనాడు, హైదరాబాద్‌: దేశంలో తృణధాన్యాల పంటల (మిల్లెట్స్‌) సాగు, వాటి ఆహారోత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా మారనుంది.  రాజేంద్రనగర్‌లోని ‘భారత తృణధాన్యాల పంటల పరిశోధన సంస్థ’ (ఐఐఎంఆర్‌)ను ఈ పంటల సాగు, ఆహారోత్పత్తుల వినియోగం పెంచే కార్యక్రమాలకు నోడల్‌ ఏజెన్సీగా కేంద్రం ఎంపిక చేసింది. ఈ ఏడాది (2023)ని ‘అంతర్జాతీయ తృణధాన్యాల సంవత్సరం’గా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున మనదేశంలో ఈ పంటల సాగుకు అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కేంద్ర బడ్జెట్‌లో తాజాగా ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ పంటలపై ఏర్పాటవుతున్న ‘అంకుర సంస్థ’ (స్టార్టప్‌)లను, ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (ఎఫ్‌పీఓ)లను అనుసంధానం చేసే బాధ్యతను ఐఐఎంఆర్‌కు కేంద్రం అప్పగించింది. ఇప్పటికే 400కు పైగా అంకుర సంస్థలు ఐఐఎంఆర్‌ అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ప్రజల్లోకి ఈ ఆహారోత్పత్తులను తీసుకెళ్లేందుకు పనిచేస్తున్న అంకురాలను, ఈ పంటలు పండించే ఎఫ్‌పీఓలతో అనుసంధానం చేయడం వల్ల రైతులకు మంచి ధరలు వచ్చి వారి ఆదాయం పెరుగుతుందని కేంద్రం తాజాగా సూచించింది. ‘ఒక జిల్లాలో ఒక తృణధాన్యాల ప్రధాన పంట’ అనే కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 19 జిల్లాలను 19 రకాల పంటల సాగు కోసం ఎంపిక చేయనున్నట్లు బడ్జెట్‌లో కేంద్రం తెలిపింది. ఈ పంటలు, వీటి ఆహారోత్పత్తులను పెద్దఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అనేకరకాల కార్యక్రమాలను చేపడతామని ఐఐఎంఆర్‌ సంచాలకురాలు డాక్టర్‌ సీవీ రత్నావతి ‘ఈనాడు’కు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని