నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం
ప్రారంభానికి ముందే.. నిర్మాణంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ వెనుకభాగంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి.
తెల్లవారుజామున భారీగా కమ్ముకున్న పొగలు
మంటలను అదుపు చేసేందుకు గంట పాటు కసరత్తు
కరిగిపోయిన విద్యుత్తు తీగలు
ఈనాడు, హైదరాబాద్: ప్రారంభానికి ముందే.. నిర్మాణంలో ఉన్న రాష్ట్ర సచివాలయ భవనంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్ వెనుకభాగంలో శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా సచివాలయాన్ని పొగలు కమ్మేశాయి. పోర్టికో వరకు వ్యాపించాయి. పోర్టికోపైన ఏర్పాటు చేసిన గుమ్మటం కూడా పొగబారింది. భవనానికి రక్షణ కోసం ఏర్పాటు చేసిన తెరలు అంటుకోవటంతో పొగ మరింత పెరిగింది. ప్రమాద తీవ్రతతో విద్యుత్తు తీగలు, ఏసీ వైర్లు కొన్ని కరిగిపోగా, మరికొన్ని వంకర్లు తిరిగాయి. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో నిల్వ చేసిన కార్పెట్లు, ఏసీలకు ఉపయోగించే పైపులు, ఫోము పెద్ద మొత్తంలో ఉండటంతో మంటలు సుమారు గంట పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. గతంలో సచివాలయం ఉన్న ప్రాంగణంలోనే నూతన భవన సముదాయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న దీనిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దక్కన్ మాల్‌లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదాన్ని మరవక ముందే సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించడం సంచనలం సృష్టించింది. సచివాలయంలో మంటలు వస్తున్నట్లు అక్కడికి సమీపంలో అంతర్గత రోడ్డు పనులు చేస్తున్న కార్మికులు గుర్తించారు. వెంటనే గుత్తేదారుల ప్రతినిధులకు సమాచారం ఇవ్వటంతో వారు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. తొలుత రెండు ఫైరింజన్లు మంటలను అదుపు చేసేందుకు వచ్చాయి. మంటలు అదుపులోకి రాకపోవటంతోపాటు, పొగలు దట్టంగా కమ్ముకోవటంతో సిబ్బంది లోపలికి వెళ్లలేకపోయారు. ఈలోగా మరికొన్ని ఫైరింజన్లు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. మొత్తం 11 ఫైరింజన్లతో సిబ్బంది గంట పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పదిహేను నుంచి ఇరవై నిముషాల వ్యవధిలో ఫైరింజన్లు వచ్చినట్లు సమాచారం. అయితే ఇది అగ్ని ప్రమాదం కాదని, మాక్ డ్రిల్ అని పోలీసులు తెలిపినట్లు ప్రచారం జరిగింది. ఇది చర్చనీయాంశమైంది.
షార్ట్‌సర్క్యూటా? మానవ తప్పిదమా?
సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్‌సర్క్యూటా? లేక మానవ తప్పిదమా? అన్న అనుమానం వ్యక్తమవుతోంది.లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రమాద సమయంలో పనులు జరగటం లేదని తెలుస్తోంది. పనులు జరగకపోతే ప్రమాదం ఎలా జరిగిందన్నది ప్రశ్న. మంటలను గుర్తించిన వెంటనే విద్యుత్తు సరఫరాను నిలుపుదల చేయటంతో మంటలు మరింత విస్తరించకుండా నిలువరించగలిగారు. సచివాలయ పనులు మూడు షిఫ్టుల్లో 24 గంటలూ జరుగుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన ఫ్లోర్‌లో ఎంతమంది ఉన్నారన్నది స్పష్టత లేదు. రాత్రి సమయంలో చలి ఎక్కువగా ఉండటంతో అక్కడ ఉన్న కార్మికుల్లో ఎవరైనా బీడీ, చుట్ట వెలిగించి పూర్తిగా ఆర్పకుండా వేయటంతో అక్కడే ఉన్న కార్పెట్లు, తదితరాలకు నిప్పు అంటుకుని మంటలు వ్యాపించినట్లు అనుమానిస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.
ఫైరింజన్లు ఏవీ?
ప్రారంభోత్సవం కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నా ఆ ప్రాంగణంలో అధికారులు ముందస్తుగా ఒక్క అగ్నిమాపక శకటాన్ని కూడా అందుబాటులో ఉంచకపోవటం చర్చనీయాంశంగా మారింది. గతంలో సచివాలయంలో రెండు ఫైరింజన్లు ఉండేవి. పాత భవనాల కూల్చివేత సందర్భంగా వాటిని మరో ప్రాంతానికి తరలించారు. అంత భారీ స్థాయిలో పనులు జరుగుతున్న దృష్ట్యా ఫైరింజన్ అందుబాటులో ఉండి ఉంటే ప్రమాద తీవ్రత మరికొంత తగ్గి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
సచివాలయంలో మంటలు దురదృష్టకరం: బండి
నూతన సచివాలయంలో మంటలు చెలరేగడం దురదృష్టకరమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజునాడు కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలనే నిర్ణయాన్ని వాయిదా వేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పుట్టిన రోజున ప్రారంభించాలని కోరారు. నాణ్యత లేకుండా పనులు చేయడం, ఫిబ్రవరి 17నే ప్రారంభించాలనే తొందరపాటు చర్యలే ప్రస్తుత ఘటనకు కారణమని అన్నారు.
ప్రమాద ప్రాంతం పరిశీలనకు కాంగ్రెస్ నేతల యత్నం
గాంధీభవన్, న్యూస్‌టుడే: కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగిన నేపథ్యంలో ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించడం ఉద్రిక్తతకు దారితీసింది. విషయం తెలుసుకున్న పోలీసులు గాంధీభవన్ వద్ద భారీగా మోహరించారు. ఎవరూ బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. నాయకులు షబ్బీర్‌అలీ, అంజన్‌కుమార్ యాదవ్ మల్లు రవి తదితరులు కార్యకర్తలతో వాటిని తోసుకుని బయటకు రావడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని సాయంత్రం వదిలిపెట్టారు. ప్రమాదంపై నిజానిజాలను ప్రజలకు తెలిపేందుకు బయల్దేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ట్విటర్‌లో తెలిపారు. కేసీఆర్ పుట్టిన రోజు నాడే ప్రారంభించాలనే ఒత్తిడితో, ప్రమాణాలు పాటించడం లేదని స్పష్టమవుతోందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
‘విశాఖ మెట్రోరైలు ప్రాజెక్టు కోసం.. ఏపీ నుంచి ప్రతిపాదనలు రాలేదు’
-
Politics News
Vitapu-Botsa: విఠపు పరీక్షలో.. బొత్సకు 2 మార్కులే!
-
Ap-top-news News
AP Assembly: సభాపతి స్థానాన్ని అగౌరవపరిస్తే సస్పెండ్ అయినట్లే.. రూలింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని
-
India News
Property: ఏనుగుల కోసం రూ.5 కోట్ల ఆస్తి
-
India News
మహిళలకు ప్రతీనెలా రూ.వెయ్యి పంపిణీ