సీబీఐకే ఎమ్మెల్యేలకు ఎర కేసు

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తునకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని హైకోర్టు కొట్టివేసింది.

Updated : 07 Feb 2023 08:59 IST

ప్రభుత్వ అప్పీళ్ల కొట్టివేత
అవి విచారణార్హం కాదన్న హైకోర్టు
తీర్పు నిలిపివేయాలన్న ఏజీ అభ్యర్థన తిరస్కరణ
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో సీబీఐ దర్యాప్తునకు అడ్డంకులు తొలగిపోయినట్లయింది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు విచారణార్హం కావని హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం 111 పేజీల తీర్పు వెలువరించింది. ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం తీర్పు అమలును కొంత కాలంపాటు నిలిపివేయాలన్న అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ అభ్యర్థనకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. అప్పీలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఎమ్మెల్యేలకు ఎర వ్యవహారంలో మొయినాబాద్‌ ఫాం హౌస్‌ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్‌, సింహయాజీలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌, కేరళకు చెందిన తుషార్‌ వెల్లపల్లిలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారించిన సింగిల్‌ జడ్జి... కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డిసెంబరు 26న తీర్పు వెలువరించారు. ఇదే అభ్యర్థనతో భారతీయ జనతా పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మొత్తం 6 అప్పీళ్లను దాఖలు చేశారు. భాజపా దాఖలు చేసిన పిటిషన్‌ విచారణార్హం కాదంటూ సింగిల్‌ జడ్జి కొట్టివేయగా దానిపై ప్రభుత్వం అప్పీలు దాఖలు చేయడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

క్రిమినల్‌ జ్యూరిస్‌డిక్షన్‌లోనే సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టారు

‘‘నిందితులు దాఖలు చేసిన పిటిషన్లు, అభ్యర్థనల వంటి అన్ని విషయాలను పరిశీలిస్తే క్రిమినల్‌ జ్యూరిస్‌డిక్షన్‌(క్రిమినల్‌ కేసుల విచారణ పరిధి)లోనే  సింగిల్‌ జడ్జి విచారణ చేపట్టారనడంలో ఎలాంటి సందేహం లేదు. అభియోగపత్రం దాఖలు చేయకముందే దర్యాప్తు సమాచారాన్ని వెల్లడించడం ద్వారా నిందితులుగా ముద్ర వేయడంతో వారి హక్కులపై ప్రభావం ఉంటుందని ఆ న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయడం, కేసును మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించడం ఇవన్నీ తెలంగాణ హైకోర్టు లెటర్స్‌ ఆఫ్‌ పేటెంట్‌ క్లాజ్‌ 15 ప్రకారం నేర న్యాయ పరిధిలో తీసుకున్న నిర్ణయం తప్ప మరోటి కాదు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సూక్ష్మ పరిశీలన చేస్తే తీర్పు క్రిమినల్‌ జ్యూరిస్‌డిక్షన్‌లోనే ఉందని స్పష్టమవుతోంది. క్రిమినల్‌ కేసుల్లో సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీలు (ఇంట్రా కోర్టు అప్పీలు) లెటర్స్‌ ఆఫ్‌ పేటెంట్‌ నిబంధన 15 ప్రకారం నిషేధం. ఇది విచారణార్హం కాదు. అప్పీళ్లు విచారణార్హం కాదన్న నిర్ణయానికి వచ్చినపుడు కేసు పూర్వాపరాలు, ఇతర అంశాలను పరిశీలించాల్సిన అవసరంలేదు. సుప్రీంకోర్టు రామ్‌కిషన్‌ ఫౌజీ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం ఇంట్రా కోర్టు అప్పీలు చెల్లదు. క్రిమినల్‌ జ్యూరిస్‌డిక్షన్‌ పరిధిలో ఇచ్చిన తీర్పు, ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీలు దాఖలు చేయడానికి వీల్లేదు. కేసును కొట్టివేస్తున్నాం’’ అంటూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

సివిల్‌ కేసుల పరిధిలోకే వస్తుంది:సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే

ఇది సివిల్‌ కేసుల పరిధిలోకే వస్తుందని, తమ అప్పీలుకు విచారణార్హత ఉందని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే పేర్కొన్నారు. ‘‘రోస్టర్‌ ప్రకారం సింగిల్‌ జడ్జి క్రిమినల్‌ కేసులను విచారించడంలేదు. అందువల్ల ఇది క్రిమినల్‌ జ్యూరిస్‌డిక్షన్‌లోనే ఉందనడానికి వీల్లేదు. పబ్లిక్‌లో ఉన్న సమాచారాన్ని ముఖ్యమంత్రి వెల్లడించారన్న కారణంగా నిందితుల హక్కులకు భంగం వాటిల్లుతుందంటూ కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వు సరికాదు’’ అని వివరించారు. 


ఇదీ నేపథ్యం

మ్మెల్యేలకు ఎర కేసులో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గత ఏడాది అక్టోబరు 26న ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. రామచంద్రభారతి, నందకుమార్‌లు, సింహయాజీలు రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఆయనతో పాటు వేరే ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. భాజపాలోకి వస్తే తనకు రూ.100 కోట్లు ఇస్తామని, మిగిలిన ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టారని, పార్టీలోకి రాకపోతే సీబీఐ, ఈడీ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించారని రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని ట్రాప్‌ చేసి వీడియో, ఆడియో రికార్డింగ్‌లను సీజ్‌ చేసి నిందితులను ఏసీబీ కోర్టు ముందు హాజరుపరచగా రిమాండ్‌కు తిరస్కరించింది.

* దీనిపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా 29న ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ నిందితులు కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది.

* ఇదే సమయంలో భాజపాతో పాటు నిందితులు కేసును సిట్‌ లేదా సీబీఐకి అప్పగించాలని పిటిషన్‌లు దాఖలు చేశారు. మొదట సింగిల్‌ జడ్జి... దర్యాప్తును నిలిపివేసినప్పటికీ తరువాత కొనసాగించడానికి అనుమతించారు.

* దీనిపై అప్పీలు దాఖలు చేయగా అప్పటికే ప్రభుత్వం సిట్‌ వేసినందున దాని దర్యాప్తును సింగిల్‌ జడ్జి పర్యవేక్షణలో కొనసాగించాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.

* ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మధ్యలో తుషార్‌ వెల్లపల్లి, భూసారపు శ్రీనివాస్‌ తదితరులను నిందితులుగా చేర్చాలన్న మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేయగా సిట్‌ హైకోర్టును ఆశ్రయించింది.

* ఈ పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా నిందితుల పిటిషన్లపై విచారించిన సింగిల్‌ జడ్జి... ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తీర్పు వెలువరించారు. నిందితులుగా చేర్చాలన్న సిట్‌ అప్పీలును కొట్టివేశారు.

* సింగిల్‌ జడ్జి కేసును సీబీఐకి అప్పగిస్తూ ఇచ్చిన తీర్పుపై ఇప్పటిదాకా ధర్మాసనం విచారణ కొనసాగినందున సీబీఐ దర్యాప్తు చేపట్టలేదు. ప్రస్తుతం ధర్మాసనం తీర్పు వెలువరించడంతోపాటు ఎలాంటి స్టే ఇవ్వకపోవడంతో దర్యాప్తునకు అడ్డంకులు తొలగినట్లయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని