ఇల్లెందు ఆర్టీసీ కార్గో ఏజెంట్‌ లైసెన్సు రద్దు

తక్కువ బరువున్నా.. ఎక్కువగా నమోదు చేసి వినియోగదారు నుంచి అధిక రుసుము తీసుకున్న ఇల్లెందు కార్గో ఏజెంట్‌ లైసెన్సును టీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది.

Published : 24 Mar 2023 03:55 IST

తక్కువ బరువును ఎక్కువగా నమోదు చేసిన వ్యవహారంలో చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌: తక్కువ బరువున్నా.. ఎక్కువగా నమోదు చేసి వినియోగదారు నుంచి అధిక రుసుము తీసుకున్న ఇల్లెందు కార్గో ఏజెంట్‌ లైసెన్సును టీఎస్‌ఆర్టీసీ రద్దు చేసింది. ‘తూచింది 51 కేజీలు.. వచ్చింది 27 కేజీలు’ శీర్షికన ‘ఈనాడు’లో ఈ నెల 22న వచ్చిన కథనంతో అధికారులు అప్రమత్తమయ్యారు. విచారణ చేపట్టి ఇల్లెందు బస్టాండ్‌ కార్గో పార్సిల్‌ ఏజెంట్‌ సుధాకర్‌ పొరపాటు చేసినట్లు గుర్తించామని కార్గో విభాగం బిజినెస్‌ హెడ్‌ పి.సంతోష్‌కుమార్‌ గురువారం తెలిపారు. ఈ నెల 18న మురళి అనే వ్యక్తి జామకాయల పార్సిల్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రింగురోడ్డుకు బుక్‌ చేశారు. అవి 27 కిలోలు ఉండగా.. ఏజెంటు పొరపాటుతో 51 కిలోలుగా నమోదైందన్నారు. దీంతో వినియోగదారు రూ.180కు బదులు రూ.443 చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. ఆలస్యమైతే పాడైపోయే వస్తువుల విభాగంలో వాటిని బుక్‌ చేస్తే మరుసటి రోజుకే నగరానికి వచ్చేవని.. కానీ సాధారణ వస్తువుల్లా పంపించడంతో 20న వచ్చాయని తెలిపారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు వినియోగదారుడి నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేయడంతో చర్యలు తీసుకున్నామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని