ఈ ఏడాది రిజిస్ట్రేషన్ల రాబడి రూ.14,180 కోట్లు!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.14,180 కోట్లకు చేరుకోవచ్చని ఆ శాఖ అంచనా వేస్తోంది.

Updated : 31 Mar 2023 05:17 IST

నిరుటి ఆదాయం రూ.12,364 కోట్లు
ఆర్థిక సంవత్సరం చివరి రోజుపై అధికారుల ఆశలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23)లో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ఆదాయం దాదాపు రూ.14,180 కోట్లకు చేరుకోవచ్చని ఆ శాఖ అంచనా వేస్తోంది. 30వ తేదీ శ్రీరామనవమి సెలవు రావడంతో ఆఖరి రోజైన శుక్రవారం వీలైనంత ఎక్కువ సమయం లావాదేవీలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో 143 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. తాజాగా రామగుండం, పటాన్‌చెరు కార్యాలయాలు ఈ జాబితాలో చేరాయి. నిరుడు మొత్తంగా 19.88 లక్షల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ సంఖ్య ఈ ఏడాది 20 లక్షలకు చేరుకోవచ్చు. రాబడిపరంగా పరిశీలిస్తే 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.12,364 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 29 నాటికే రూ.14,122 కోట్లు సమకూరింది. నిరుటితోపోలిస్తే ఇది రూ.1,758 కోట్లు అధికం. చివరిరోజు మరో రూ.58 కోట్లను ఆర్జిస్తే మొత్తం ఆదాయం రూ.14,180 కోట్లకు చేరుకుంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ అంచనా వేస్తోంది. ఈమేరకు శుక్రవారం వీలైనన్ని లావాదేవీలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఇప్పటివరకు వ్యవసాయ భూముల దస్తావేజుల రిజిస్ట్రేషన్లు 7.30 లక్షలు పూర్తయ్యాయి. చివరిరోజు లావాదేవీల ద్వారా మరో రూ.5 కోట్ల వరకు రాబడి రావచ్చని భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని