కేంద్రం ఆధ్వర్యంలోనూ ఉత్సవాలు

కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తారు.

Published : 02 Jun 2023 04:12 IST

గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న కిషన్‌రెడ్డి
భాజపా కార్యాలయంలో సంజయ్‌..

ఈనాడు హైదరాబాద్‌: కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ ఆధ్వర్యంలో గోల్కొండ కోటలో శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవాలు నిర్వహించనున్నారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని జాతీయపతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం పారామిలిటరీ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. సాయంత్రం ప్రముఖ నర్తకి, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆనందశంకర్‌, ప్రముఖ గాయకులు శంకర్‌మహదేవన్‌, మంగ్లీ, మధుప్రియ, ఇతర కళాకారులతో దేశ, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పాటలు, కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు కిషన్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.రాష్ట్ర అవతరణ దినోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు భాజపా పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంతోపాటు జిల్లా, మండల కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగురవేసి, పార్టీ నేతలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

20 రాష్ట్రాల రాజ్‌భవన్‌లలో నిర్వహణ: కిషన్‌రెడ్డి

గోల్కొండ కోటలో ఏర్పాట్లను కిషన్‌రెడ్డి గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..   రాష్ట్ర అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉందని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో భాజపా ముందుండి నడిపించిందని, దివంగత కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. ఇరవై రాష్ట్రాల్లోని రాజ్‌భవన్‌లలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించేందుకు మొదటిసారిగా ఏర్పాట్లు చేశామన్నారు. మంత్రి వెంట మర్రి శశిధర్‌రెడ్డి, కార్వాన్‌ భాజపా ఇన్‌ఛార్జి అమర్‌సింగ్‌ తదితరులున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని