Justice NV Ramana: అబ్బాయ్‌ రమణా.. అనే పలకరింపుతో మేను పులకరించింది

‘అబ్బాయ్‌ రమణా! అంటూ మా ఊరి పెద్దల పలకరింపు నన్ను పులకరింపజేసింది. ఆ ఆశీర్వచన భరిత పలకరింపు ముందు అన్ని గౌరవార్థకాలు దిగదుడుపే’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

Updated : 28 Dec 2021 05:28 IST

తెలుగు ప్రజల ఆశీర్వాదబలమే నన్ను ఈ స్థాయికి చేర్చింది

  పర్యటన మధురస్మృతుల్ని గుర్తుచేసుకుంటూ సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ బహిరంగ లేఖ

ఈనాడు, అమరావతి: ‘అబ్బాయ్‌ రమణా! అంటూ మా ఊరి పెద్దల పలకరింపు నన్ను పులకరింపజేసింది. ఆ ఆశీర్వచన భరిత పలకరింపు ముందు అన్ని గౌరవార్థకాలు దిగదుడుపే’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పేర్కొన్నారు. తెలుగు ప్రజల ఆశీర్వాద బలమే తనను ఈ స్థాయికి చేర్చిందని, ఆ ఆశీర్వాదాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పర్యటన ముగించుకుని సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ.. పర్యటనలోని మధురస్మృతుల్ని గుర్తు చేసుకుంటూ బహిరంగ లేఖ రాశారు. ‘మా ఊరు పొన్నవరం వెళ్లి అయిన వాళ్లందరినీ పలకరించి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. సుప్రీంకోర్టుకు శీతాకాలం సెలవులు ప్రకటించటంతో నా ఆలోచన అమల్లో పెట్టే అవకాశం లభించింది. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారిగా ఈ నెల 24వ తేదీ ఉదయం ఎంతో ఉత్సుకతతో మా స్వగ్రామానికి సకుటుంబ సమేతంగా బయలుదేరాను. గరికపాడువద్ద ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో కాలు మోపింది మొదలు...ప్రజలు బారులు తీరి,  ప్రేమాభిమానాలతో ముంచెత్తిన తీరు ఎప్పటికీ మరువలేము. అలాగే ఈ నెల 24న హైదరాబాద్‌లో బయలుదేరినది మొదలు ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు వరకూ, తిరిగి సోమవారం నాడు ఏపీ సరిహద్దు నుంచి హైదరాబాద్‌ చేరే వరకూ, సకల సదుపాయాలు కల్పించిన తెలంగాణ పోలీసు సిబ్బందికి, తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు. తెలంగాణలో ప్రకటిత కార్యక్రమాలు లేకున్నా దారిలో ఎందరో న్యాయవాదులు, న్యాయాధికారులు, ప్రజలు మాకు స్వాగతం పలికారు. అందరికీ అభివందనాలు’ అని జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ఆ లేఖలో వివరించారు.


ఏపీలో పర్యటించి హైదరాబాద్‌ వస్తున్న సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు సోమవారం సూర్యాపేటలోని సెవన్‌ హోటల్‌లో నల్గొండ ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి జగ్జీవన్‌కుమార్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం సీజేఐ పోలీస్‌ గౌరవ వందనం స్వీకరించారు.  

  -న్యూస్‌టుడే, సూర్యాపేట గ్రామీణం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని