Ts Group-4: ముగిసిన గ్రూప్‌-4 దరఖాస్తు ప్రక్రియ.. ఒక్క పోస్టుకు 116 మంది పోటీ

రాష్ట్రంలో గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జులై 1న రాతపరీక్ష జరగనున్న ఈ పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి.

Updated : 04 Feb 2023 07:23 IST

8,180 పోస్టులకు 9.51 లక్షల దరఖాస్తులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-4 దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. జులై 1న రాతపరీక్ష జరగనున్న ఈ పోస్టుల కోసం 9,51,321 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గ్రూప్‌-4 సర్వీసుల కింద రాష్ట్రంలో ఈ సారి 8,180 పోస్టులు భర్తీ చేయనుండగా.. ఒక్కోపోస్టుకు సగటున 116 మంది చొప్పున అభ్యర్థులు పోటీపడుతున్నారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో ఈ స్థాయిలో దరఖాస్తులు రావడం ఇది రెండోసారి.  

2018లో 700 వీఆర్‌వో పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన రాతపరీక్షకు రికార్డుస్థాయిలో 10.58 లక్షల దరఖాస్తులు వచ్చాయి. అప్పట్లో పోస్టులు తక్కువగా ఉండటంతో ఒక్కో పోస్టుకు సగటున 1511 మంది పోటీపడ్డారు. ఈ సంవత్సరం 8,180 గ్రూప్‌-4 పోస్టులకు 9,51,321 లక్షల దరఖాస్తులు రావడం గమనార్హం.

సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 దరఖాస్తులు

రాష్ట్రంలో 581 వసతిగృహ సంక్షేమాధికారుల పోస్టులకు 1,45,358 మంది దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఆగస్టు నెలలో రాతపరీక్ష జరగనుంది.


అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 2,930..

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖలో భర్తీ చేయనున్న 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు 2930 దరఖాస్తులు వచ్చాయి. ఈ శాఖలోని 34 విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా అనస్థీషియా విభాగంలో 155 పోస్టులు భర్తీ చేయనుండగా వీటికి 332 దరఖాస్తులు వచ్చాయి. గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎండోక్రైనాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌, సీటీ సర్జరీలో పోస్టుల కంటే తక్కువ దరఖాస్తులు రావడం గమనార్హం. గ్యాస్ట్రోఎంట్రాలజీలో 14 పోస్టులకు 8, సీటీ సర్జరీలో 21 పోస్టులకు 10, ట్రాన్స్‌ఫ్యూజన్‌ మెడిసిన్‌లో 14 పోస్టులకు 7, ఎండోక్రైనాలజీలో 12 పోస్టులకు 5 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 7 నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని