Tomcom: విదేశీ ఉపాధికి ద్వారం ‘టామ్‌కామ్‌’.. నైపుణ్యమున్న యువతకు వరం

నైపుణ్యం గల తెలంగాణ యువతకు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయా దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి అవసరాల మేరకు నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు కార్యాచరణ చేపట్టింది.

Updated : 19 Nov 2022 08:30 IST

ఆ సంస్థ ద్వారా నియామకాలకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ

ఈనాడు - హైదరాబాద్: నైపుణ్యం గల తెలంగాణ యువతకు గల్ఫ్‌తో పాటు ఇతర దేశాల్లో భారీగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆయా దేశాల రాయబారులతో సంప్రదింపులు జరిపి అవసరాల మేరకు నియామక ప్రక్రియను ప్రారంభించేందుకు కార్యాచరణ చేపట్టింది. దీన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) సోమేశ్‌కుమార్‌ పర్యవేక్షిస్తున్నారు. విదేశీ ఉద్యోగాల పేరిట జరిగే మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం 2016లో తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌)ను ఏర్పాటు చేసింది. ఇటీవల ఉద్యోగ నియామకాల కోసం టామ్‌కామ్‌ను విదేశీ సంస్థలు సంప్రదిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకొని ఆయా దేశాల్లోని భారత రాయబారులకు లేఖలు రాస్తోంది. ఇటీవల సౌదీ అరేబియా, ఒమన్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌, ఖతార్‌, కువైట్‌లతో పాటు జపాన్‌, పోర్చుగల్‌, జర్మనీ దేశాలకు లేఖలు రాయగా... స్పందన లభించింది. ఆయా దేశాలు తమకు కావాల్సిన మానవ వనరుల వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి పంపిస్తున్నాయి.

ఏయే ఉద్యోగాలు

నర్సులు, పారామెడికల్‌, ఆటోమొబైల్‌, వైమానిక, భవన నిర్మాణం, నిర్వహణ, యంత్ర విడిభాగాల తయారీ, ఆతిథ్యరంగం, పారిశ్రామిక యంత్రాలు, వ్యవసాయం, ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆహారం, శీతల పానీయాలు, నౌకాయానం, మత్స్యరంగంలో ఉద్యోగాలున్నాయి. లక్ష మందికి పైగా నర్సింగ్‌, ఆసుపత్రి సిబ్బంది అవసరమని గల్ఫ్‌  దేశాలు సమాచారమిచ్చాయి. నర్సింగ్‌లో 60 వేల మంది కావాలని జపాన్‌ కోరింది. ఇంకా ఆహార, శీతల పానీయాల సేవా రంగంలో 53 వేలు, భవన నిర్మాణంలో 40 వేలు, పారిశుద్ధ్య సిబ్బంది 37 వేలు, ఆహార తయారీ రంగంలో 34 వేలు, వాహన రంగంలో 22 వేలు, వ్యవసాయ రంగంలో 36,500, యంత్ర పరికరాల తయారీలో 21 వేలు, నౌకా నిర్మాణ, యంత్రాల తయారీ పరిశ్రమలో 13 వేలు, మత్స్యరంగంలో 9 వేలు, పారిశ్రామిక రంగంలో 5,250, ఎలక్ట్రిక్‌, ఎలక్ట్రానిక్స్‌లో 4,700 మంది అవసరమని ఆ దేశం పేర్కొంది.

సలహామండలి ఏర్పాటు

విదేశాల నుంచి ఉద్యోగాల కోసం లేఖలు వస్తున్న తరుణంలో సీఎస్‌ దీనిపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. టామ్‌కామ్‌లో ప్రాజెక్టు మానిటరింగ్‌ విభాగాన్ని, సలహా మండలిని ఏర్పాటు చేశారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ముందుగా టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. వారికి ఆయా రంగాలకు సంబంధించిన ప్రాథమిక పాఠ్యాంశాలతో పాటు హిందీ, ఆంగ్ల భాషల్లో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ నేర్పుతారు. నర్సింగ్‌ సిబ్బందికి డిమాండ్‌ ఎక్కువగా ఉన్నందున ఆ కోర్సు పూర్తయిన వారు ముందుకొస్తే వైద్యఆరోగ్యశాఖ శిక్షణ ఇస్తుంది. ఆటో మెకానిక్‌లు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్ల ఎంపిక ప్రక్రియను ప్రత్యేకంగా నిర్వహిస్తారు.


వెబ్‌సైట్‌లో నమోదు ఇలా..

ఉద్యోగాలను ఆశించే వారు టామ్‌కామ్‌ వెబ్‌సైట్‌లో (http://tomcom.telangana.gov.in/OnlineRegistrationNew.aspx) తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఆధార్‌ లేదా పాస్‌పోర్ట్‌లో ఉన్న పేరు, తల్లిదండ్రులు, పుట్టిన తేదీ, కావాల్సిన ఉద్యోగం, ఫోన్‌ నంబర్‌, చిరునామా, విద్యార్హతలు, ప్రత్యేక నైపుణ్యం ఉంటే ఆ వివరాలు, శిక్షణ పొందిన సంస్థ పేరు, అనుభవం, విదేశాల్లో ఉద్యోగం చేసిన వారైతే ఏ దేశంలో, ఏ సంస్థలో, ఏ హోదాతో పనిచేస్తున్నారు. గతంలో పనిచేస్తే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పనిచేశారు.పాస్‌పోర్ట్‌ వివరాలు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే ఆ సమాచారంతో పాటు అభ్యర్థి ఫొటో (సంతకం చేసింది), ఆధార్‌కార్డులను జత చేయాలి. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లే ముందు ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని టామ్‌కామ్‌ ఆరు జిల్లాల్లో నిర్వహిస్తోంది. దీనికి కూడా అభ్యర్థులు వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు.


విదేశాల్లోనూ అపార అవకాశాలు

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

విదేశాల్లో తెలంగాణ యువతకు అపార అవకాశాలున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుంది. 20 ప్రాధాన్య దేశాలను గుర్తించి... అక్కడ పని చేసేందుకు ఆసక్తి గల వారిని ఎంపిక చేసి, ముందస్తు శిక్షణతో  సంసిద్ధం చేస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని