Viral: చీరల కోసం కుమారుడి ప్రాణాలను పణంగా పెట్టిన తల్లి.. వైరల్‌ వీడియో

ఆరేసిన చీరలు కింది ఫ్లోర్‌లో పడిపోతే.. వాటిని తీసుకొచ్చేందుకు కుమారుడి ప్రాణాలను పణంగా పెట్టింది ఓ తల్లి.......

Published : 13 Feb 2022 19:39 IST

దిల్లీ: ప్రమాదంలో ఉన్న బాలుడిని చీర సాయంతో పైకి లాగి కాపాడుతున్నట్లుంది కదా.. పై ఫొటోలోని దృశ్యం. కానీ మ్యాటర్‌ అది కాదు. ఓ తల్లి అజాగ్రత్త, బాధ్యతారాహిత్యానికి అద్దంపట్టే దృశ్యాలు ఇవి. ఆరేసిన చీరలు కింది ఫ్లోర్‌లో పడిపోతే.. వాటిని తీసుకొచ్చేందుకు కుమారుడితో ఓ తల్లి చేయించిన సాహసం ఇది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్‌ కావడంతో ఆ తల్లిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో ఓ మహిళ తన కుటుంబంతో నివాసముంటోంది. ఫ్లోరిడా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లోని 10వ అంతస్తులో వారు ఉంటున్నారు. అయితే బాల్కనీలో వేసిన దుస్తులు కింది 9వ అంతస్తులో పడిపోవడంతో.. ఓ చీర సాయంతో తన కుమారుడిని 9వ అంతస్తులోకి దించింది ఆ తల్లి. బాలుడు చీరల్ని పట్టుకోగా మళ్లీ అదే రీతిలో కుమారుడిని పైకి లాగింది. ఓ వృద్ధురాలు కూడా ఆమెకు సాయమందించింది. ఒకవేళ చేయి జారిపోయి కిందపడిపోతే ఆ బాలుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయేవే. ఎదురు బిల్డింగ్‌లోని ఓ వ్యక్తి ఈ దృశ్యాలను చిత్రీకరించి ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచగా.. అది కాస్తా వైరల్‌గా మారింది.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు భయాందోళన వ్యక్తం చేశారు. కనీసం ఎలాంటి జాగ్రత్తలు కూడా పాటించకుండా వారు ఈ తరహా సాహసానికి తెగించడంపై మండిపడ్డారు. ఐపీఎస్‌ అధికారి దిపాన్షు కబ్రా సదరు వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేస్తూ.. ఆ తల్లి చర్యను ఖండించారు. ‘అజాగ్రత్త, బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట’ అంటూ వ్యాఖ్యానించారు.

ఈ ఘటనపై ఆ కాంప్లెక్స్‌లోని పర్వీణ్‌ సరస్వత్‌ మాట్లాడారు. 9వ ఫ్లోర్‌లోని ఓ ఫ్లాట్‌కు నిత్యం తాళం వేసి ఉండటం, అక్కడికి వెళ్లేందుకు వీలులేకపోవడంతో ఆ తల్లి ఇలా చేశారని తెలిపారు. కాగా ఈ ఘటనపై వివరణ ఇవ్వాలని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ యాజమాన్యం ఆ మహిళకు నోటీసు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అయితే కుమారుడి ప్రాణాలను పణంగా పెట్టిన తన చర్య పట్ల బాలుడి తల్లి విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని