Alexei Navalny: పుతిన్‌ ప్రత్యర్థి నావల్నీ జైలులో మృతి..!

రష్యాలో అధ్యక్ష ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్షుడు పుతిన్‌ ప్రత్యర్థి నావల్నీ(Alexei Navalny) ప్రాణాలు కోల్పోయారు. 

Updated : 16 Feb 2024 21:04 IST

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించిన నాయకుడు అలెక్సీ నావల్నీ(Alexei Navalny) జైలులో మృతి చెందారు. ఆర్కిటిక్‌ ప్రిజన్ కాలనీలో ఆయన మరణించినట్లు రష్యా ఫెడరల్ ప్రిజన్ సర్వీస్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘వాకింగ్ తర్వాత అస్వస్థతకు గురయ్యారు. ఆ వెంటనే స్పృహ కోల్పోవడంతో వైద్య సేవలందించినా ప్రాణాలు కాపాడలేకపోయామని వైద్య సిబ్బంది తెలిపారు. ఆయన మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని ఆ ప్రకటనలో పేర్కొంది. రష్యాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో నావల్నీ మరణం చర్చనీయాంశంగా మారింది.

రష్యా (Russia)లో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సీ నావల్నీ(Alexei Navalny)కి పలు కేసుల్లో జైలు శిక్ష పడింది. గత మూడేళ్లుగా రాజధాని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కొద్దినెలల క్రితం జైలు నుంచి అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. ‘జైలు గదిలోనే అనారోగ్యానికి గురయ్యారు. ఆ తర్వాత నుంచే కనిపించడం లేదు’ అని అప్పట్లో నావల్నీ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. తర్వాత వారం రోజులకే ఆచూకీ లభించినట్లు ఆయన ప్రతినిధులే తెలిపారు.

ఎవర్నీ నావల్నీ..?

అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్న నాయకుడు అలెక్సీ నావల్నీ (Alexei Navalny). ‘రష్యా ఆఫ్ ది ఫ్యూచర్’‌ పార్టీ నేతగా అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారుల అవినీతిని బయటపెట్టారు. గత అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా ఆదరణ లభించింది. ఈ క్రమంలోనే 2020లో సెర్బియా పర్యటనలో ఉన్నప్పుడు అతడిపై విషప్రయోగం జరగడం సంచలనం సృష్టించింది. నరాల్లోకి విషపూరిత ఇంజెక్షన్‌ను ఎక్కించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జర్మనీలో కొన్ని నెలల పాటు చికిత్స తీసుకుని ప్రాణాలతో బయటపడి.. 2021 జనవరిలో రష్యాకు తిరిగొచ్చారు. అయితే, వచ్చీ రాగానే రష్యా పోలీసులు ఎయిర్‌పోర్టులోనే అరెస్టు చేశారు. నిధుల దుర్వినియోగం సహా పలు అభియోగాలపై ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు అప్పట్లో రష్యా అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపర్చగా వివిధ కేసుల్లో 19 ఏళ్ల జైలు శిక్ష విధించారు.

జీవితంపై సినిమా..

ఆయన జీవితాన్ని ఆధారంగా చేసుకుని కెనడాకు చెందిన దర్శకుడు డేనియల్‌ రోహెర్‌ ‘నావల్నీ’ పేరుతో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. గతేడాది ఈ చిత్రానికి ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌గా ప్రతిష్ఠాత్మక ఆస్కార్‌ పురస్కారం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని