Heart Diseases: ఆ రీజియన్లలో గుండె సంబంధిత మరణాల ముప్పు ఎక్కువ!

ఆసియా, ఐరోపా, ఆఫ్రికాతోపాటు మధ్యప్రాచ్యంలో గుండె సంబంధిత మరణాల ముప్పు ఎక్కువగా ఉంటున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Published : 13 Dec 2023 01:53 IST

దిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా హృదయ సంబంధిత మరణాలు  గణనీయంగా పెరిగినట్లు తాజా అధ్యయనం (Study) పేర్కొంది. ముఖ్యంగా ఆసియా (Asia), ఐరోపా, ఆఫ్రికా (Africa)తోపాటు మధ్యప్రాచ్యంలో ఈ మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నట్లు అంచనా వేసింది. అధిక రక్తపోటు, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం, వాయు కాలుష్యం వంటివి వీటికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని పేర్కొంది. వీటికి సంబంధించిన నివేదిక అమెరికన్‌ కాలేజ్‌ ఆఫ్‌ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైంది.

హృదయ సంబంధిత వ్యాధులకు (CVD) సంబంధించి అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ హెల్త్‌, ఐహెచ్‌ఎంఈ, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భాగంగా 21 రీజియన్లలోని మొత్తం దేశాలతోసహా 204 ప్రాంతాల సమాచారాన్ని విశ్లేషించారు. వీటిలో 24 చోట్ల 2015-2022 మధ్యకాలంలో ఈ మరణాలు మరింత పెరిగినట్లు గుర్తించారు. గుండె సంబంధిత మరణాలు 1990లో 1.2కోట్లుగా నమోదు కాగా.. 2022లో 1.98 కోట్లకు పెరిగినట్లు కనుగొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత మరణాలకు ఇస్కీమిక్‌ గుండె సమస్యే (Coronary Heart Disease) ప్రధాన కారణమని పరిశోధకులు గుర్తించారు. ప్రతి లక్ష జనాభాకు దాదాపు 110 మంది దీంతోనే చనిపోతున్నట్లు అంచనా వేశారు. మెదడు రక్తస్రావం, థ్రోంబస్‌లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రీజియన్ల వారీగా చూస్తే గుండె సంబంధిత మరణాల్లో తూర్పు ఐరోపా అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ ప్రతి లక్ష జనాభాకు 553 హృదయ సంబంధిత మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ఓషనియాగా పిలిచే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తోపాటు పసిఫిక్‌ దీవుల్లో ఈ మరణాల రేటు తక్కువగా (లక్ష జనాభాకు 122.5గా) ఉంది.

మధ్య ఆసియా, తూర్పు ఐరోపా, ఉత్తర ఆఫ్రికాతోపాటు మధ్యప్రాచ్యంలో గుండె సంబంధిత మరణాలకు అధిక రక్తపోటు కారణంగా కనిపిస్తుండగా.. ఆహార సంబంధిత ముప్పు మాత్రం మధ్య ఆసియా, ఓషనియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు, మధ్యప్రాచ్యంలో అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని