Golden Visa: ఆస్ట్రేలియా ‘గోల్డెన్‌ వీసాలు’ ఇక బంద్‌.. భారతీయులపై ప్రభావమెంత..?

Golden Visa: విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులకు ఇచ్చే గోల్డెన్‌ వీసాల జారీని ఆస్ట్రేలియా రద్దు చేసింది. మరి ఈ నిర్ణయం భారతీయులపై ఏ మేరకు ప్రభావం చూపించనుంది..?

Updated : 23 Jan 2024 13:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్టుబడులకు కీలకమైన ‘గోల్డెన్‌ వీసా (Golden Visa)’ల జారీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వీసా ప్రోగ్రామ్‌ ఆశించిన ఆర్థిక ఫలితాలను ఇవ్వట్లేదని ఆ దేశ హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీని స్థానంలో వృత్తి నిపుణులకు ఇచ్చే వీసాలను పెంచనున్నట్లు తెలిపింది.

ఏంటీ గోల్డెన్‌ వీసా..?

విదేశాలకు చెందిన సంపన్న పెట్టుబడిదారులు కొన్నేళ్ల పాటు తమ దేశంలో నివసించేందుకు వీలుగా ఈ గోల్డెన్‌ వీసాలను జారీ చేస్తుంటారు. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం.. కనీసం 5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేవారు ఈ వీసాతో ఐదేళ్ల పాటు అక్కడ ఉండొచ్చు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు 2012లో ఈ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.

విదేశీ విద్యార్థుల స్టడీ పర్మిట్లపై కెనడా పరిమితి

హోంశాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు లక్ష మంది ఈ ప్రోగ్రామ్‌ కింద ఆస్ట్రేలియాలో రెసిడెన్సీ దక్కించుకున్నారు. ఇందులో 85శాతం చైనా మిలియనీర్లే కావడం గమనార్హం. అయితే, గత కొన్నేళ్లుగా ఈ స్కీమ్‌పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీసా ప్రోగ్రామ్‌ను దుర్వినియోగం చేసి కొందరు విదేశీయులు అక్రమ సంపదను తరలిస్తున్నారనే వాదనలున్నాయి. దీంతో వీటి జారీని రద్దు చేస్తున్నట్లు హోంమంత్రి క్లేర్‌ ఓ నీల్‌ తమ ప్రకటనలో వెల్లడించారు. వీటి స్థానంలో వృత్తి నిపుణులకు మరిన్ని ఎక్కువ వీసాలు జారీ చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించనుందని తెలిపారు. ఇప్పటికే కెనడా, బ్రిటన్‌, సింగపూర్‌ వంటి దేశాలు కూడా ఈ తరహా వీసా స్కీమ్‌లను రద్దు చేశాయి.

భారత్‌పై తక్కువ ప్రభావమే..

ఆస్ట్రేలియా నిర్ణయం భారతీయులపై తక్కువ ప్రభావమే చూపించనుందని నిపుణులు చెబుతున్నారు. 2022 వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే.. ఈ దేశంలో అమెరికా, యూకే దేశస్థులు ప్రధాన పెట్టుబడిదారులుగా ఉన్నారు. ఆ తర్వాత బెల్జియం, జపాన్‌, సింగపూర్‌ వంటి దేశాలున్నాయి. మొత్తం విదేశీ పెట్టుబడుల్లో భారత్‌ 17వ స్థానంలో ఉంది. ఇక, వృత్తి నిపుణులను పెంచుకోవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. విదేశీ విద్యార్థుల కోసమూ ప్రత్యేక వీసా ప్రోగ్రామ్‌లు తీసుకురావాలని భావిస్తోంది. ఈ పరిణామాలు నైపుణ్యం గల భారత యువతకు ప్రయోజనకరమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని