Bangladesh: బంగ్లాదేశ్‌లో ప్రారంభమైన పోలింగ్‌.. భారత్‌కు ప్రధాని హసీనా ధన్యవాదాలు!

Bangladesh: బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రధాని షేక్‌ హసీనా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Updated : 07 Jan 2024 09:45 IST

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో 12వ సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ప్రధానమంత్రి షేక్‌ హసీనా (Sheikh Hasina) ఢాకాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ప్రజాస్వామ్యం కీలకమని వ్యాఖ్యానించారు.

‘‘బంగ్లాదేశ్‌ సార్వభౌమ, స్వాతంత్ర్య దేశం. జనాభా చాలా ఎక్కువ. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను వ్యవస్థాపితం చేశాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. లేదంటే దేశ అభివృద్ధి సాధ్యం కాదు. సుదీర్ఘంగా 2009- 2023 వరకు మేం అధికారంలో ఉండటం వల్లే బంగ్లాదేశ్‌ ఈ స్థాయికి చేరుకుంది’’ అని షేక్‌ హసీనా (Sheikh Hasina) అన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటేసే వాతావరణాన్ని కల్పించామన్నారు. ప్రధాన విపక్షం బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పార్టీ (BNP) ఎన్నికలను బహిష్కరించిన నేపథ్యంలో.. ఆమె ఆ పార్టీని ‘ఉగ్రవాద సంస్థ’గా అభివర్ణించారు. 

ఈ సందర్భంగా హసీనా భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘‘భారత్‌ వంటి నమ్మకమైన మిత్రదేశం ఉండడం మా అదృష్టం. బంగ్లాదేశ్‌ విముక్తి పోరాటంలో వారు మాకు అండగా ఉన్నారు. 1975 తర్వాత మా కుటుంబం మొత్తాన్ని కోల్పోయినప్పుడు ఆశ్రయమిచ్చారు. ఈ సందర్భంగా భారత ప్రజలకు నా శుభాకాంక్షలు’’ అని హసీనా వ్యాఖ్యానించారు.

దాదాపు 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ (Bangladesh)లో సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తూ BNP బంద్‌కు పిలుపునివ్వటంతో పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధాన విపక్షం ఎన్నికలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో నాలుగోసారీ షేక్‌ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్‌ పార్టీదే గెలుపని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని