Bear: విమానంలో తప్పించుకున్న ఎలుగుబంటి.. చివరకు ఏమైందంటే..!

విమానంలో రవాణా చేస్తున్న ఓ ఎలుగుబంటి తన పెట్టెలోంచి తప్పించుకున్న ఘటన ఇది. బాగ్దాద్‌- దుబాయి విమానంలో చోటుచేసుకుంది.

Published : 08 Aug 2023 18:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓ ఎలుగుబంటిని విమానంలో తరలిస్తుండగా.. అది కాస్త పెట్టెలోంచి తప్పించుకుని (Escaped Bear) చక్కర్లు కొట్టిన ఘటన కలకలం రేపింది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ నుంచి దుబాయి చేరుకున్న ఓ విమానం (Iraqi Airways) కార్గో విభాగంలో ఇది వెలుగుచూసింది. ఫలితంగా ఆ ఫ్లైట్‌ తిరుగు ప్రయాణం ఆలస్యమైంది.

ఇరాకీ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానంలో ఇటీవల ఓ ఎలుగుబంటిని బాగ్దాద్‌ నుంచి దుబాయికి తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే దానిని ప్రత్యేక పెట్టెలో పెట్టి, విమానం కార్గోలోకి ఎక్కించారు. అయితే, విమానం దుబాయికి చేరుకున్న సమయంలో.. ఆ భల్లూకం పెట్టెలోంచి తప్పించుకుని, అక్కడే తిరుగుతున్నట్లు కార్గో సిబ్బంది గుర్తించారు. కొంతమంది దానిని నిమురుతున్నట్లు కనిపిస్తోన్న వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

రెండు ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం.. సురక్షిత ప్రాంతాలకు వేలమంది!

కొద్దిసేపటికి ఓ ప్రత్యేక బృందం విమానాశ్రయానికి చేరుకుని, దానికి మత్తుమందు ఇచ్చి విమానం నుంచి కిందికి దించడంతో.. కథ సుఖాంతమైంది. ఈ క్రమంలోనే విమానం తిరుగు ప్రయాణం ఆలస్యం కావడంతో.. ప్రయాణికులకు ఆ విమానయాన సంస్థ క్షమాపణలు చెప్పింది. అంతర్జాతీయ జంతు సంక్షేమ మార్గదర్శకాలను పాటిస్తూనే ఆ ఎలుగును రవాణా చేసినట్లు తెలిపింది. అయితే, దాన్ని ఎందుకు తరలించారో తెలియరాలేదు.

మరోవైపు.. ఇరాక్‌ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. రెండు చిన్న ఎలుగుబంట్లను రవాణా చేశామని.. ఆ సమయంలో రెండోది కూడా అక్కడే ఉన్నట్లు వెల్లడించడం కొసమెరుపు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని