USA: ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో నిర్ణయించాం.. జోర్డాన్‌లో సైనికుల మరణంపై బైడెన్‌

USA: జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన దాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో నిర్ణయించామని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు.

Published : 31 Jan 2024 10:38 IST

వాషింగ్టన్‌: జోర్డాన్‌లో అమెరికా (USA) సైనికుల మరణానికి ప్రతీకారం తప్పదని అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) పునరుద్ఘాటించారు. అందుకు కారణమైన వారిపై ఎలా దాడిలో చేయాలో నిర్ణయించామని మంగళవారం వెల్లడించారు. దాని కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. అయితే, పశ్చిమాసియాలో యుద్ధాన్ని మరింత విస్తరించే ఉద్దేశం మాత్రం తమకు లేదని స్పష్టం చేశారు.

ఇరాన్‌ మద్దతున్న ఏ ఉగ్రసంస్థ ఈ దాడికి  పాల్పడిందో ఇంకా ధ్రువీకరించుకోవాల్సిన అవసరం ఉందని అమెరికా రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే ప్రతీకార దాడులు చేయడానికి ఉన్న ప్రత్యామ్నాయాలనూ పెంటగాన్‌ సమీక్షిస్తోందని వెల్లడించారు. బైడెన్ (Joe Biden) మాత్రం ఇప్పటికే ఎలా దాడి చేయాలో నిర్ణయించామని ప్రకటించడం గమనార్హం. మరోవైపు తమ ప్రతిస్పందన దశలవారీగా ఉంటుందని జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి జాన్‌ కిర్బీ వెల్లడించారు. కొంత కాలం పాటు వరుస దాడులు ఉంటాయని చెప్పారు. మరణించిన సైనికుల కుటుంబాలను బైడెన్‌ పరామర్శించారని తెలిపారు.

జోర్డాన్‌లోని (Jordan) అమెరికా (USA) సైనిక స్థావరంపై ఇటీవల జరిగిన డ్రోన్‌ దాడిలో ముగ్గురు సైనికులు మరణించిన విషయం తెలిసిందే. తామే ఈ దాడికి పాల్పడ్డట్లు ఇరాక్‌ కేంద్రంగా పనిచేసే ముజాహిదీన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ రెసిస్టెన్స్‌ గ్రూపు ప్రకటించింది. ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం మొదలయ్యాక పశ్చిమాసియాలో అమెరికా సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి. తమ స్థావరంపై దాడి ఇరాన్‌ మద్దతిచ్చే మిలిటరీ గ్రూపు పనేనని అమెరికా చెబుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని