Red Sea: హౌతీలపై ప్రతీకార దాడులు కొనసాగుతాయ్‌: బైడెన్‌

Red Sea: ఎర్ర సముద్రంలో నౌకలపై హౌతీలు దాడులను ఆపని నేపథ్యంలో ప్రతీకార చర్యలు కొనసాగుతూనే ఉంటాయని అగ్రరాజ్య అధ్యక్షుడు బైడెన్ స్పష్టం చేశారు.

Updated : 19 Jan 2024 08:40 IST

వాషింగ్టన్‌: ఎర్ర సముద్రంలో (Red Sea) నౌకలపై దాడికి దిగుతున్న హౌతీ రెబెల్స్‌పై (Houthis) ప్రతీకార చర్యలు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. ఇప్పటివరకు అమెరికా, బ్రిటిష్‌ సైన్యాలు చేసిన దాడులు హౌతీలను నిలువరించలేకపోయాయన్నారు. యెమెన్‌లోని హౌతీల స్థావరాలపై అమెరికా గురువారం వరుసగా ఐదోసారి దాడి చేసిందని వచ్చిన వార్తల నేపథ్యంలో బైడెన్ (Joe Biden) స్పందించారు.

నౌకలపై దాడులు ఆపేది లేదు..

హౌతీ రెబెల్స్‌ (Houthis) నాయకుడు అబ్దెల్‌ మాలెక్‌ అల్-హౌతీ సైతం ఎర్ర సముద్రం, గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌ మీదుగా ప్రయాణించే నౌకలపై తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని గురువారం ఓ వీడియో సందేశంలో ప్రకటించారు. ఇజ్రాయెల్ యుద్ధంలో చిక్కుకుపోయిన హమాస్‌, పాలస్తినీయులకు మద్దతుగానే తాము ఈ దాడులు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికా, బ్రిటన్ చేస్తున్న ప్రతీకార దాడులు ప్రారంభం అయిన తర్వాత తొలిసారి స్పందించిన అబ్దెల్‌ మాలెక్‌.. తాము ఈ చర్యలతో ఏమాత్రం భయపడడం లేదన్నారు.

భారత్ ఆందోళన..

ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న నౌకలపై దాడి చేస్తామంటున్న హౌతీలు.. ఇతర దేశాల వాటినీ లక్ష్యంగా చేసుకోవడంపై మండిపడింది. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితులను చాలా దగ్గరగా పరిశీలిస్తున్నామని తెలిపింది. గల్ఫ్‌ ఆఫ్‌ ఎడెన్‌లో బుధవారం రాత్రి డ్రోన్‌ దాడిని ఎదుర్కొన్న ఓ సరకు రవాణా నౌకను భారత యుద్ధ నౌక కాపాడింది. అందులో 9 మంది భారతీయులు సహా 22 మంది సిబ్బంది ఉన్నారు.

ఇది జరిగిన తర్వాతే విదేశాంగశాఖ ప్రధాన కార్యదర్శి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ గురువారం ఎర్ర సముద్రంలో పరిస్థితులపై స్పందించారు. ఈ ప్రాంతం కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి కీలక రవాణా మార్గమని స్పష్టం చేశారు. భారత నావికాదళం నిరంతర గస్తీ కాస్తోందని.. భారత నౌకలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు కృషి చేస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని