Biden: పన్నూ హత్యకు కుట్ర..భారత్‌కు ఏకంగా సీఐఏ చీఫ్‌ను పంపిన బైడెన్‌!

సిక్కు వేర్పాటువాది పన్నూ హత్యకు కుట్ర జరిగిందని భావించిన అమెరికా.. దీనిపై స్పష్టమైన వివరాలు తెలుసుకునేందుకు తన గూఢచర్య విభాగాధిపతిని భారత్‌కు పంపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది.

Published : 01 Dec 2023 15:55 IST

వాషింగ్టన్‌: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు ఓ భారతీయుడు కుట్ర పన్నాడంటూ అమెరికా (USA) అభియోగం మోపడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అయితే, ఈ కుట్రపై పూర్తి వివరాలను తెలుసుకునేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తమ నిఘా సంస్థ చీఫ్‌ను భారత్‌కు పంపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ తాజాగా వెల్లడించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) చీఫ్‌ విలియం బర్న్స్‌ ఆగస్టులో భారత్‌కు వచ్చినట్లు పేర్కొంది. పన్నూ హత్యకు ఓ భారతీయుడు కుట్ర చేస్తున్నాడని అమెరికా వర్గాలు గుర్తించిన తర్వాతే బర్న్స్‌ పర్యటన జరిగిందని తెలిపింది. 

భారత్‌లోని ఓ అధికారి కనుసన్నల్లోనే పన్నూ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు అమెరికా ఆరోపిస్తోంది. మరోవైపు ఆగస్టులో భారత్‌ వచ్చిన విలియం బర్న్స్‌.. ఇక్కడి రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్ వింగ్‌ (RAW) చీఫ్ రవి సిన్హాతో భేటీ అయినట్లు వాషింగ్టన్‌ పోస్టు పేర్కొంది. పన్నూ హత్యకు జరిగిన కుట్రపై విచారణ అవసరమని.. అందుకు భారత్‌ సహకరించాలని ఆయన కోరినట్లు తెలిపింది. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా భారత్‌ నుంచి అమెరికా స్పష్టమైన హామీ కోరినట్లు సమాచారం.

పన్నూ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు జులైలోనే వదంతులు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఇరుదేశాల ఉన్నత స్థాయి అధికారులు పరస్పరం చర్చలు జరిపారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని అమెరికా డిమాండ్‌ చేసింది. మరోవైపు సెప్టెంబర్‌లో దిల్లీ వేదికగా జరిగిన జీ20 సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు బైడెన్‌.. ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా ఈ విషయాన్ని కూడా లేవనెత్తినట్లు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. నవంబర్‌లో అమెరికా విదేశాంగశాఖ మంత్రి ఆంటోని బ్లింకెన్‌, రక్షణ శాఖ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ భారత్‌ పర్యటన సందర్భంగానూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు సదరు వార్తాసంస్థ పేర్కొంది.

అమెరికా అందించిన సమాచారం మేరకు భారత్‌ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. అంతలోనే భారతీయుడిపై అభియోగాలు మోపడంతోపాటు, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు అమెరికా ప్రకటించడం చర్చనీయాంశమైంది. పన్నూ కుట్ర పన్నాడని భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడం ఆందోళన కలిగించే విషయమని గురువారం మన విదేశాంగశాఖ వెల్లడించింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇందులో ఒక భారత అధికారి ప్రమేయముందని ఆరోపించడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని