Colombian Children: కారడవిని గెలిచిన ‘ఆ చిన్నారులు’.. ఆరోగ్యంగా కోలుకున్నారు!

కొలంబియాలోని అమెజాన్‌ కారడవుల్లో తప్పిపోయి.. 40 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడిన నలుగురు చిన్నారులను ఆస్పత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. వారు పూర్తిగా కోలుకోవడంతో తాజాగా డిశ్ఛార్జి చేశారు.

Published : 15 Jul 2023 18:34 IST

బొగొటా: దక్షిణ అమెరికా కొలంబియా (Colombia)లోని అమెజాన్‌ అడవు (Amazon rainforest)ల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు.. మృత్యుంజయులుగా నిలిచిన విషయం తెలిసిందే. తొలుత విమాన ప్రమాదం నుంచి బయటపడిన వారు.. ఆ తర్వాత 40 రోజులకు సజీవంగా కన్పించడంతో.. అంతటా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అప్పటికే సరైన తిండి లేక కృశించిపోయిన ఆ చిన్నారులను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. ఈ క్రమంలోనే నెలరోజులకుపైగా చికిత్స అందుకున్న ఆ పిల్లలు.. తాజాగా ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

‘మిలిటరీ ఆస్పత్రిలో చిన్నారులను 34 రోజులపాటు నిత్యం వైద్యుల పర్యవేక్షణలో ఉంచాం. వారికి మంచి ఆహారం అందజేశాం. ఈ క్రమంలోనే నలుగురూ చక్కగా కోలుకున్నారు. వారి ఆరోగ్యం, బరువు అన్ని మెరుగయ్యాయి’ అని శిశుసంక్షేమ అధికారులు తెలిపారు. విమాన ప్రమాదంలో చిన్నారుల తల్లి మృతి చెందడంతో.. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా వారి సంరక్షణ బాధ్యతలు ప్రస్తుతం శిశుసంక్షేమ విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. పూర్తిగా ఎవరికి వారి బాధ్యతలు అప్పగించాలనేది ఆరు నెలల్లో నిర్ణయిస్తామని అధికారులు వెల్లడించారు.

కారడవుల్లో అద్భుతం.. విమానం కూలిన 40 రోజులకు సజీవంగా చిన్నారులు

ఇదిలా ఉండగా.. బ్రెజిల్‌ అమెజాన్ అటవీ ప్రాంతంలోని అరారాక్యూరా నుంచి కొలంబియాలోని శాన్‌జోస్‌ డెల్‌ గ్వావియారేకు మే 1న బయల్దేరిన ఓ విమానం.. కొలంబియాలో కూలిపోయింది. ఈ ఘటనలో పైలట్‌, చిన్నారుల తల్లి, గైడ్‌ మృతి చెందగా.. 13, 9, 4 ఏళ్ల చిన్నారులు, 11 నెలల పసిబిడ్డ అక్కడినుంచి తప్పిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే పెద్దఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు.. ప్రమాదం జరిగిన 40 రోజుల తర్వాత చిన్నారులను సజీవంగా గుర్తించడంతో దేశ అధ్యక్షుడు పెట్రో సంతోషం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని