China Lockdown: చైనాలో కరోనా.. ఆంక్షల గుప్పిట్లో 40కోట్ల మంది..!

ప్రస్తుతం చైనాలో 40కోట్ల మంది కొవిడ్‌ ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

Published : 16 Apr 2022 02:08 IST

లాక్‌డౌన్‌ ఆంక్షలతో చైనీయుల సతమతం

బీజింగ్‌: ప్రపంచ దేశాల్లో కరోనా వైరస్‌ తగ్గుముఖం పడుతోన్న వేళ చైనాలో మాత్రం మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రపంచంలో ఏ దేశంలో లేనివిధంగా అక్కడ కరోనా ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఇప్పటికే షాంఘైతోపాటు పలు నగరాల్లో పూర్తి లాక్‌డౌన్‌ అమలులో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో స్థానికంగా కొవిడ్‌ నియంత్రణ చర్యలు చేపడుతున్నారు. దీంతో ప్రస్తుతం చైనాలో 40కోట్ల మంది ఆంక్షల గుప్పిట్లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

కరోనా వైరస్‌ విజృంభణకు చైనా నగరాలు వణికిపోతున్నాయి. ఫిబ్రవరి నెలలో షేన్‌ఝేన్‌లో తొలుత కొవిడ్‌ ఆంక్షలు మొదలుపెట్టారు. అప్పటినుంచి తాజాగా షాంఘై వరకు ఆంక్షల క్రమం కొనసాగుతూనే ఉంది. గవేకాల్‌ డ్రాగొనామిక్స్‌ అధ్యయనం ప్రకారం, చైనాలోని 100 ప్రధాన నగరాల్లో దాదాపు 87 చోట్ల కొవిడ్‌ కట్టడి ఆంక్షలు అమలు చేస్తున్నట్లు సమాచారం. ఇక నొమురా హోల్డింగ్స్‌ సంస్థ ఆర్థికవేత్తల నివేదిక ప్రకారం 37.3కోట్ల మంది ప్రజలు పలు రకాల కొవిడ్‌ ఆంక్షల్లో కొనసాగుతున్నట్లు అంచనా.

ఆంక్షల చట్రంలో ప్రధాన నగరాలు..

రెండున్నర కోట్ల జనాభా కలిగిన షాంఘైలో గత రెండు వారాలుగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నప్పటికీ వైరస్‌ ఉద్ధృతి అదుపులోకి రావడం లేదు. తాజాగా పొరుగు ప్రాంతమైన సుఝౌ ప్రావిన్సులోనూ కరోనా తీవ్రత పెరుగుతోంది. దీంతో కున్‌షాన్‌ నగరంలో గత వారం లాక్‌డౌన్‌ ఆంక్షలు విధించారు. దీంతో తైవాన్‌కు చెందిన దిగ్గజ టెక్‌ కంపెనీలు మూతపడ్డాయి. మరోవైపు షాన్‌షీ ప్రావిన్సు రాజధాని తైయువాన్‌లోనూ కొవిడ్‌ కట్టడి చర్యలు కఠినతరం చేస్తున్నారు. ప్రస్తుతం 53లక్షల జనాభా కలిగిన ఆరు జిల్లాల్లో లాక్‌డౌన్‌ విధించారు. ఇక ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాబల్యంతో ప్రముఖ వాణిజ్య నగరమైన గువాన్‌ఝౌలోనూ కొవిడ్‌ కట్టడి చర్యలు ఊపందుకున్నాయి. పాఠశాలలు మూసివేయడం, రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయితే, మొన్నటివరకు లాక్‌డౌన్‌ అమలు చేసిన జిలిన్‌ ప్రావిన్సుతోపాటు సుజౌ, టాంగ్‌షాన్‌, లాంగ్‌ఫాంగ్‌ వంటి ప్రావిన్సుల్లో మాత్రమే ప్రస్తుతం కొవిడ్‌ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా చైనాలోని ప్రధాన నగరాల్లో కొవిడ్‌ ఆంక్షల కారణంగా చాలా సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నాయి. ఐఫోన్‌ తయారీదారు పెగాట్రాన్‌ కార్పొరేషన్‌ వంటి సంస్థలతోపాటు టెస్లా, నియో వంటి కార్ల తయారీ సంస్థలు మూతపడుతున్నాయి. ఈ తరహా కొవిడ్‌ ఆంక్షలు మరికొన్ని రోజులు కొనసాగితే మే నెలలో చైనా ఆటోమేకర్స్‌ ఉత్పత్తిని నిలిపివేయాల్సి వస్తుందని వాహన తయారీ సంస్థలు చెబుతున్నాయి. ఇలా వైరస్‌ కట్టడికి లాన్‌డౌన్‌ వంటి కఠిన ఆంక్షలను విధించడం వల్ల ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడుతుందని నివేదికలు చెబుతున్నప్పటికీ కొవిడ్‌ జీరో విధానానికే కట్టుబడి ఉంటామని అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని