China: షాంఘైలో వారంలోనే గరిష్ఠ స్థాయికి కొవిడ్‌!

చైనాలో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. జనాభాపరంగా అతిపెద్ద నగరమైన షాంఘైలో వారం రోజుల వ్యవధిలోనే గరిష్ఠ స్థాయి కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.

Updated : 23 Dec 2022 16:57 IST

బీజింగ్‌: చైనా(China)లో కరోనా విజృంభిస్తోంది. రోజూ భారీస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో.. దేశ వాణిజ్య రాజధాని, జనాభాపరంగా అతిపెద్ద నగరమైన షాంఘై(Shanghai)లో వారం రోజుల వ్యవధిలోనే గరిష్ఠ స్థాయి కేసులు(Peak‌) వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య విభాగం ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మరోవైపు.. చైనాలో వైరస్‌(Corona Virus) వ్యాప్తిని ఇప్పటికీ తక్కువ చేసి చూపెడుతోన్న అధికారులు.. దేశ ఆరోగ్య వ్యవస్థపై మాత్రం తీవ్ర ఒత్తిడి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గురువారం దేశవ్యాప్తంగా నాలుగు వేలలోపే కొత్త కేసులు నమోదైనట్లు చైనా వెల్లడించింది. ఎటువంటి కరోనా మరణాలు సంభవించలేదని వరుసగా మూడో రోజూ తెలపడం గమనార్హం.

‘2.4 కోట్ల జనాభా కలిగిన షాంఘైలో వారంలో కొవిడ్‌ గరిష్ఠ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది’ అని హువాషన్‌ అంటువ్యాధుల కేంద్రం డైరెక్టర్ జాంగ్ వెన్‌హాంగ్‌(Zhang Wenhong) వ్యాఖ్యానించినట్లు ఓ స్థానిక వార్తాసంస్థ తాజాగా తెలిపింది. ‘గరిష్ఠ స్థాయి దశ.. తీవ్రమైన కేసులను కూడా పెంచుతుంది. ఇది మొత్తం వైద్య వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గరిష్ఠ స్థాయి అనంతరం.. మరో నెల, లేదా రెండు నెలలపాటు వేవ్ కొనసాగుతుంది’ అని వెన్‌హాంగ్‌ చెప్పారు. వైరస్‌ వ్యాప్తి అనివార్యమని గుర్తించి, దీనికి మానసికంగా సిద్ధపడాలన్నారు. అయితే, షాంఘై పరిసర ప్రాంతాల్లోని ఆస్పత్రులను సందర్శించినప్పుడు.. తీవ్రమైన లక్షణాలతో బాధపడుతున్న వృద్ధుల సంఖ్య తక్కువే ఉందని గుర్తించినట్లు తెలిపారు.

ఇదిలా ఉండగా.. చైనాలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ‘బీఎఫ్‌.7’ కోరలు చాస్తోన్న విషయం తెలిసిందే. కేసులతోపాటు కొవిడ్‌ మరణాలూ భారీగానే ఉన్నాయని అంతర్జాతీయ వార్తాసంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడి చాంగ్‌కింగ్‌ నగరంలోని ఓ శ్మశానవాటికకు రెండు గంటల వ్యవధిలోనే 40 మృతదేహాలు వచ్చినట్లు ఓ వార్తాసంస్థ తెలిపింది. అయితే, శ్వాసకోశ వ్యవస్థ వైఫల్యంతో మరణించిన వారిని మాత్రమే చైనా తన కొవిడ్‌ మరణాల లెక్కలోకి తీసుకుంటోంది. దీంతో మరణాల సంఖ్యలో భారీ వ్యత్యాసం కనిపిస్తోందని లండన్‌కు చెందిన ఎయిర్‌ఫినిటీ లిమిటెడ్‌ తెలిపింది. రాబోయే రోజుల్లో రోజుకు 10 లక్షల కేసులు.. 5 వేల చొప్పున మరణాలు నమోదయ్యే అవకాశం ఉందని ఈ సంస్థ అంచనా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని