china: భూ కక్ష్యలోకి ప్రవేశించిన చైనా రాకెట్‌ శకలాలు

చైనా లాంగ్‌మార్చి 5బీ రాకెట్‌ భారీ శిథిలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Updated : 31 Jul 2022 17:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌కు చెందిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. వీటికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు వీటిని ఉల్కాపాతంగా భ్రమించి వీడియోలు తీసుకొన్నారు. శనివారం రాత్రి 10.45 సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూవాతావరణంలోకి ప్రవేశించాయి. అమెరికా స్పేస్‌ కమాండ్‌ కూడా ఇదే సమయంలో చైనా రాకెట్‌ శిథిలాలు భూ వాతావరణంలోకి చేరినట్లు నిర్ధారించింది.

తూర్పు, దక్షిణాసియా ప్రాంతాల్లోని చాలా చోట్ల ప్రజలు వీటిని వీక్షించారు. మలేషియా మీదుగా ఈ శకలాలు ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ కూడా షేర్‌ చేశారు. వీటిలో ఎన్ని భూమిని తాకి ఉండొచ్చనే సందేహం వ్యక్తం చేశారు. మరోవైపు చైనా స్పేస్‌ ఏజెన్సీ పనితీరును నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నిల్సన్‌ తప్పుపట్టారు. చైనా తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని పేర్కొన్నారు. లాంగ్‌మార్చ్‌ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టం కలుగజేసే ప్రమాదం ఉందన్నారు.

చైనా ఇటీవల లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ను ప్రయోగించింది. ఇది అంతరిక్షంలో నిర్మించతలపెట్టిన స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి అవసరమైన ల్యాబరేటరీ మాడ్యూల్‌ను తరలించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని