Jack Ma: టెక్‌ దిగ్గజం ‘జాక్‌ మా’ దృష్టి ఇక వ్యవసాయం వైపు!

అలీబాబా (Ali baba) గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా (Jack Ma) వ్యవసాయ రంగంపైవు దృష్టి మరల్చారు. ఓ ఆగ్రోటెక్‌ సంస్థలో 10 శాతం షేర్లు కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు కథనాలు వెల్లడించాయి.

Published : 02 Aug 2023 01:55 IST

బీజింగ్‌: చైనా (China) టెక్‌ దిగ్గజం, అలీబాబా (Alibaba) గ్రూప్‌ వ్యవస్థాపకుడు జాక్‌ మా (Jack Ma) వ్యవసాయ రంగంవైపు దృష్టి సారించారు. అలీబాబా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ పదవికి రాజీనామా చేసి విశ్రాంత జీవనం గడుపుతున్న జాక్‌మా.. తాజాగా ఓ వ్యవసాయ స్టార్టప్‌ కంపెనీలో 10శాతం షేర్లు కొనుగోలు చేసినట్లు అంతర్జాతీయ వార్తాపత్రికలు కథనాలు వెల్లడించాయి. జులై 20న చైనాలోని హ్యాంగ్‌జూ పట్టణంలో కొందరు ‘1.8 మీటర్స్‌ మెరైన్‌ టెక్నాలజీ కార్పొరేషన్‌’ పేరుతో ఓ ఆగ్రో టెక్‌ స్టార్టప్‌ను స్థాపించారు. అందులో జాక్‌మా 10శాతం షేర్లు కొనుగోలు చేసినట్లు సమాచారం. జాక్‌మా పెట్టుబడులపై వార్తలు రావడం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి.

అలీబాబా గ్రూప్‌ను స్థాపించి అపర కుబేరుడిగా ఎదిగిన జాక్‌మా.. 2020లో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. చైనా ఆర్థిక నియంత్రణ వ్యవస్థను ఓ పాన్‌షాప్‌తో పోల్చడం అప్పట్లో సంచలనంగా మారింది. తర్వాత ప్రభుత్వం యాంట్‌ గ్రూప్‌పై చర్యలు చేపట్టింది. దీంతో కొన్ని నెలలపాటు బాహ్య ప్రపంచానికి ఆయన కనిపించలేదు. 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్‌మా బహిరంగంగా కనిపించిన సందర్భాలు అరుదు. జపాన్‌, ఆస్ట్రేలియా, థాయ్‌లాండ్‌ వంటి దేశాల్లో ఉన్నట్లు ఫొటోలు మాత్రం దర్శనమిచ్చాయి.

దాదాపు ఈ మూడేళ్లపాటు ఆగ్రోటెక్‌పై జాక్‌మా అధ్యయనం చేసినట్లు అంతర్జాతీయ వార్తా పత్రికలు చెబుతున్నాయి. 2021 అక్టోబర్‌లో స్పెయిన్‌ వెళ్లిన ఆయన.. అక్కడ వ్యవసాయం, వాతావరణానికి సంబంధించిన అంశాలపై పరిశోధన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆయన నెదర్లాండ్‌, జపాన్‌, థాయ్‌లాండ్‌కు వెళ్లినట్లు సమాచారం. ఈ ఏడాది మే నెలలో జపాన్‌లోని టోక్యో విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌ గానూ సేవలందించారు. స్థిరమైన వ్యవసాయం, ఆహారోత్పత్తుల సృష్టిపై విద్యార్థులకు బోధించినట్లు టోక్యో కళాశాల ఓ ప్రకటనలో తెలిపింది. 2019లోనే అలీబాబా సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా ఉద్యోగ విరమణ చేసిన జాక్‌ మా.. ప్రస్తుతం ‘జాక్‌మా ఫౌండేషన్‌’ బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని