Israel Hamas: ‘పౌర మరణాలు ఆందోళనకరం..!’ ఐరాస వేదికగా ప్రత్యక్ష చర్చలకు భారత్‌ పిలుపు

ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరులో పౌర మరణాలపై ఐరాస వేదికగా భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Published : 25 Oct 2023 10:35 IST

ఐరాస: ఇజ్రాయెల్-హమాస్‌ యుద్ధం (Israel- Hamas Conflict) కారణంగా పశ్చిమాసియాలో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, పెద్దఎత్తున ప్రాణ నష్టంపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి స్థాపనకు అవసరమైన పరిస్థితులను సృష్టించేందుకు, హింసను విడనాడి ప్రత్యక్ష చర్చలను పునః ప్రారంభించేందుకు ఇరు పక్షాలు ముందుకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి (UNSC)లో ప్రత్యేక చర్చ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఐరాసలో భారత ఉప శాశ్వత ప్రతినిధి ఆర్‌.రవీంద్ర మాట్లాడుతూ.. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యకు చర్చలతో కూడిన ద్విదేశ పరిష్కారానికి భారత్‌ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. అదే సమయంలో ఇజ్రాయెల్‌ భద్రతా సమస్యలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇరుపక్షాల దాడుల్లో పౌర మరణాలు ఆందోళనకరమని.. ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాలన్నారు. గాజాలో మానవతా సంక్షోభానికి తెరదించాలని విజ్ఞప్తి చేశారు.

ఇజ్రాయెల్‌- పాలస్తీనా.. ఏమిటీ ద్విదేశ పరిష్కారం!

గాజా ప్రజలకు మానవతా సాయం అందించేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న ప్రయత్నాలను భారత్‌ స్వాగతించింది. తమ దేశం తరఫున ఔషధాలు, పరికరాలు సహా 38 టన్నుల సామగ్రిని చేరవేసినట్లు రవీంద్ర వెల్లడించారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పాలస్తీనాకు మానవతా సాయం కొనసాగిస్తామన్నారు. ఆరోగ్యం, విద్య, మహిళా సాధికారత, సమాచార సాంకేతికత తదితర రంగాలతో కూడిన ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వామ్యం ద్వారా పాలస్తీనా ప్రజలకు భారత్‌ తన మద్దతు అందిస్తూనే ఉంటుందని తెలిపారు.

మరోసారి పాకిస్థాన్‌ వక్రబుద్ధి..!

ఐరాస భద్రతా మండలి సమావేశంలో కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావన తెచ్చి పాకిస్థాన్‌ మరోసారి తన వక్రబుద్ధి చాటుకుంది. అయితే, పాక్‌ వ్యాఖ్యలను స్పందించడానికి కూడా అనర్హమైనవిగా పరిగణిస్తున్నట్లు, సమాధానం ఇచ్చి వాటికి గౌరవాన్ని తీసుకురాలేమని భారత ప్రతినిధి ఆర్‌.రవీంద్ర దీటుగా బదులిచ్చారు. ఓ ప్రతినిధి బృందం అలవాటు ప్రకారం పదేపదే ప్రస్తావిస్తున్న ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. గతంలోనూ ఐరాస వేదికగా భారత్‌ను ఎండగట్టేందుకు పాక్‌ చేసిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని