Christmas: అప్పట్లో బ్రిటన్‌ రాజ కుటుంబీకుల క్రిస్మస్‌ భోజనం ఇదే?

Royal Family Christmas: బ్రిటన్‌ రాజకుటుంబ క్రిస్మస్‌ సంబరాలు శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌కు చేరుకోవటంతో ప్రారంభమవుతాయి. మరి ఆ రోజు వాళ్లు ఏం తింటారో తెలుసా?

Updated : 25 Dec 2023 14:38 IST

శాండ్రింగ్‌హామ్‌: క్రిస్మస్‌ రోజు బ్రిటన్‌ రాజకుటుంబం విందు వినోదాలతో చాలా ఖరీదైన వంటకాలను ఆరగిస్తారని చాలా మంది అనుకుంటుంటారు. కానీ, అది నిజం కాదని మాజీ చెఫ్‌ డారెన్‌ మెక్‌గ్రాడీ తెలిపారు. బ్రిటన్‌లోని సామాన్యుల ఇళ్లలో పండగ రోజు ఏ వంటలైతే ఉంటాయో అవే రాజకుటుంబీకులూ (Royal Family Christmas) స్వీకరిస్తారని తెలిపారు. ఈ విషయంలో వాళ్లు చాలా సంప్రదాయంగా వ్యవహరిస్తారని వివరించారు.

1980, 90లలో శాండ్రింగ్‌హామ్‌లో క్రిస్మస్‌ వేడుకల్లో రాజకుటుంబీకులకు (Royal Family Christmas) డారెన్‌ మెక్‌గ్రాడీ స్వయంగా వంట చేసి వడ్డించేవారు. ఇటీవల ఆయన ‘ఓకే’ అనే మ్యాగజైన్‌తో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవి ఆయన మాటల్లోనే..

  • క్రిస్మస్‌ ముందురోజు రాజకుటుంబీకులంతా (Royal Family Christmas) శాండ్రింగ్‌హామ్‌కు చేరుకోవటంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆరోజు మధ్యాహ్నం తేనీరు, రుచికరమైన శాండ్‌విచ్‌లు, కేక్‌లతో విందు భోజనాలు ప్రారంభమవుతాయి.
  • తర్వాత కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయ పలకరింపులు ఉంటాయి. రాత్రి భోజనంలో చేపల వంటకాలు, సలాడ్‌, శాండ్రింగ్‌హామ్‌ ఎస్టేట్‌లో పెంచిన లేడి మాంసం వంటివి వడ్డించేవాళ్లం. డెజర్ట్‌ కింద ‘టార్టే టాటిన్‌’ లేదా రాణి ఎలిజబెత్‌-IIకు అత్యంత ఇష్టమైన ‘చాకొలెట్‌ పర్ఫెక్షన్‌ పై’ ఉండేవి.
  • డ్రింక్స్‌ విషయంలోనూ రాయల్‌ ఫ్యామిలీ చాలా సంప్రదాయంగా ఉండేది. సాయంత్రం ‘జిన్‌’, ‘డుబోనెట్‌’తో డ్రింక్స్‌ ప్రారంభిస్తారు. రాయల్‌ సెల్లార్‌లోని సైనికుడొకరు రాత్రి భోజన సమయంలో షాంపైన్‌, ఫైన్‌ వైన్స్‌ సర్వ్‌ చేసేవారు.
  • భోజన సమయంలో కుటుంబీకులంతా కొన్ని నియమాలను కచ్చితంగా ఆచరించేవారు. రాణి వచ్చే వరకు ఎవరూ కూర్చునేవారు కాదు. అలాగే ఆమె తినడం ప్రారంభించేవరకు మిగతా ఎవరూ భోజనాన్ని స్వీకరించేవారు కాదు. వీటిలో చాలా నియమాలు ప్రస్తుత రాజు ఛార్లెస్‌-III హయాంలోనూ కొనసాగుతాయని అనుకుంటున్నా.
  • తర్వాత అదే రోజు రాత్రి నేను స్టాఫ్‌ డిస్కోకు డీజేగానూ వ్యవహరించేవాణ్ని. రాత్రి ఒంటిగంట వరకు అది కొనసాగేది. ఒకసారి ఈ డిస్కో వేడుకకు అప్పటి ప్రిన్సెస్‌ డయానా కూడా వచ్చారు.
  • క్రిస్మస్‌ రోజు ఉదయం అల్పాహారంతో భోజనాలు ప్రారంభమయ్యేవి. రాజకుటుంబంలోని మహిళలంతా వాళ్ల పడక గదుల్లోనే తర్వాతి కార్యక్రమాలకు సిద్ధమవుతూ అల్పాహారాన్ని స్వీకరించేవారు.
  • మధ్యాహ్నం సరిగ్గా 1:15 గంటలకు భోజనానికి కూర్చునేవారు. స్థానికంగా నోర్ఫోక్‌ ప్రాంతంలో పెంచిన టర్కీ కోళ్లతో చేసిన వంటకం ఇందులో ప్రధాన ఆకర్షణ.
  • రాణి ఎలిజబెత్‌-IIకు వడ్డించే వంటకాల్లో అల్లం ఉపయోగించేవాళ్లం కాదు. అలాగే ఘాటుగా ఉండే ఉల్లిని కూడా వాడేవాళ్లం కాదు. ప్రజలతో మాట్లాడేటప్పుడు ఎలాంటి వాసన రావొద్దని ఆమె ఉల్లికి దూరంగా ఉండేవారు.
  • ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు వంట చేసేవాళ్లం. తర్వాత రాణి ప్రసంగానికి హాజరయ్యేవాళ్లం.
  • ప్రస్తుత రాజు ఛార్లెస్‌-III కూడా ఈ సంప్రదాయాలన్నింటినీ కొనసాగిస్తారని అనుకుంటున్నా. ముఖ్యంగా సేంద్రియ ఉత్పత్తులతో చేసిన ఆహారాన్ని ఆయన ఎక్కువగా ఇష్టపడతారు. పైగా దిగుమతి చేసుకున్న వాటి కంటే స్థానిక వస్తువులు, సరకులు, కూరగాయలనే ఉపయోగించాలని ఆయన చెబుతుంటారు.
  • అయితే, రాయల్‌ కుటుంబంలో ఇప్పుడు కొంతమంది తమ వ్యక్తిగత ఆహార అలవాట్లకు అనుగుణంగా వంట చేయించుకుంటున్నారు. కానీ, నేను పనిచేసిన సమయంలో అలా ప్రత్యేకమైన నియమాలేమీ ఉండేవి కాదు. క్రిస్మస్‌ రోజు రాణి సమక్షంలో ఏది వడ్డిస్తే అందరూ అది తినాల్సిందే. ఒకవేళ నచ్చకపోతే మానేయడం తప్ప నచ్చిన వంటకం వడ్డించడం అనే సంప్రదాయం ఉండేది కాదు.
  • క్రిస్మస్‌ రోజు రాత్రి ఏదైనా స్వీట్‌తో విందు భోజనాలు ముగిసేవి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని