సంక్షిప్త వార్తలు(7)

మానవ మెదడు నిర్మాణం, స్పందనలపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు దానికి సంబంధించిన ఓ లక్షణాన్ని కనుగొన్నారు.

Updated : 16 Dec 2022 06:21 IST

మెదడుపైన పీడనాల ప్రభావంపై అధ్యయనం

లండన్‌: మానవ మెదడు నిర్మాణం, స్పందనలపై అధ్యయనం చేస్తున్న పరిశోధకులు దానికి సంబంధించిన ఓ లక్షణాన్ని కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ పరిశోధకులతో కలిసి కార్డిఫ్‌ విశ్వవిద్యాలయం చేసిన ఈ పరిశోధనలో మెదడుపై పీడనాన్ని ప్రయోగించి దాని స్పందనలను గమనించారు. అలాంటి పరిస్థితుల్లో జిలాటిన్‌ ఎలా ప్రవర్తిస్తుందో మెదడు ఆ మాదిరిగానే స్పందిస్తోందని గుర్తించారు. పాలిస్టరిన్‌లానే తంతువులుగా విడిపోయి ఛిద్రమవుతోందని తెలుసుకున్నారు. ఈ పరిశోధనకు వారు ఎంఆర్‌ఐ స్కానింగ్‌ ఫలితాలు, కృత్రిమ మేథను ఉపయోగించారు. ఈ వివరాలు ‘ద రాయల్‌ సొసైటీ ఇంటర్‌ఫేస్‌’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. వివిధ శస్త్రచికిత్సల సమయంలో వైద్య పరికరాలతో తాకినపుడు మెదడు ఏ విధంగా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడానికి, వైద్యులు జాగ్రత్త పడటానికి ఈ ఫలితాలు ఉపయోగపడతాయని పరిశోధకులు తెలిపారు.


త్వరలో ప్రేమతో పెంచుకునే వాచ్‌లు, సెల్‌ఫోన్లు

వాషింగ్టన్‌: కొత్త సాంకేతికత వచ్చేకొద్దీ పాత ఎలక్ట్రానిక్‌ వస్తువులను వదిలించుకునే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో ‘ఈ - చెత్త’ ముప్పు ముంచుకొస్తోంది. ఉపయోగించే సాధనానికి, మనిషికి మధ్య బంధాన్ని ఏర్పరిస్తే ఈ సమస్యను పరిష్కరించవచ్చని షికాగో విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు భావించారు. అనుకున్నదే తడవుగా ఏకకణ జీవి సాయంతో పనిచేసే చేతి గడియారాన్ని రూపొందించారు. ఆ జీవికి వీరు ‘స్లైమ్‌ మోల్డ్‌’ అని నామకరణం చేశారు. ఈ జీవికి కావాల్సిన నీరు, ఓట్స్‌ అందిస్తేనే దాని పరిమాణం పెరిగి సర్క్యూట్‌ పనిచేస్తుంది. లేదంటే అది తెగిపోయి వాచ్‌లోని ఫీచర్లు పనిచేయవు. ఆహారాన్ని అందించడం ద్వారా ఓ పెంపుడు కుక్కతో ఏర్పడినట్టే మన గడియారంతోనూ సంబంధం ఏర్పడుతుంది. ఆ జీవి ఆకలి గురించి వచ్చే ఆలోచనతో వస్తువును వదిలించుకోవడానికి మనసొప్పదని ఈ వాచ్‌ను తయారుచేసిన ‘లు’ సంస్థ ధీమా వ్యక్తం చేసింది.


మనల్ని నిద్రపుచ్చేది చంద్రుడు కాదు.. సూర్యుడే

వాషింగ్టన్‌: మనం ఎంతసేపు సూర్యరశ్మిలో గడిపామన్న సమాచారంతో మనం నిద్రపోయే సమయాన్ని ఊహించవచ్చని ‘యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌’ పరిశోధకులు కనుగొన్నారు. 2015 నుంచి 2018 వరకు 507 మంది విద్యార్థుల జీవనశైలిని శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. పగటి పూట ఎక్కువ సేపు ఎండలో గడిపిన వారు రాత్రి సరైన సమయానికి చక్కగా నిద్రపోయారని ఈ పరిశోధనలో వెల్లడైంది. ఎండలోకి ఏమాత్రం వెళ్లకుండా రాత్రుళ్లు బయట తిరిగేవారికి నిద్రలేమి సమస్య తప్పలేదు. మనిషి నిద్రను నియంత్రించే సహజ ‘సకేడియన్‌ గడియారం’ పనితీరుకు, ఎండకు సంబంధం ఉందని పరిశోధకులు వెల్లడించారు. ఎక్కువ సమయం కృత్రిమ కాంతిలో గడపకుండా, అవసరం లేకపోయినా సహజమైన సూర్యరశ్మిలో గడపాలని సూచించారు.


తోషాఖానా కేసులో ఇమ్రాన్‌కు ఎదురుదెబ్బ
ఎన్నికల సంఘం పిటిషన్‌ను స్వీకరించిన పాక్‌ న్యాయస్థానం

ఇస్లామాబాద్‌: విదేశీ ప్రతినిధులు ఇచ్చిన బహుమతులను ప్రభుత్వ ఖజానా(తోషాఖానా) నుంచి తక్కువ మొత్తానికి కొని ఎక్కువ మొత్తానికి అమ్ముకున్నారన్న అభియోగాలను ఎదుర్కొంటున్న పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుకు సంబంధించి ఇమ్రాన్‌పై విచారణ ప్రక్రియను ప్రారంభించాలన్న పాక్‌ ఎన్నికల సంఘం పిటిషన్‌ను ఇస్లామాబాద్‌ కోర్టు స్వీకరించింది. ఇందుకు సంబంధించి జనవరి 9న హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం ఇమ్రాన్‌కు సమన్లు పంపింది.


సాంకేతిక కారణాలతో కాస్మోనాట్‌ల స్పేస్‌వాక్‌ రద్దు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) వెలుపల నిర్వహించతలపెట్టిన స్పేస్‌వాక్‌.. సాంకేతిక సమస్యల కారణంగా చివరి నిమిషంలో రద్దయింది. రష్యన్‌ వ్యోమగాములు సెర్గీ ప్రొకొపీవ్‌, దిమిత్రి పెటెలిన్‌లు బుధవారం స్పేస్‌వాక్‌ చేయాల్సి ఉంది. వీరిద్దరూ ఉన్న సోయుజ్‌ క్యాప్సూల్‌లో కూలెంట్‌ లీకేజీతో పాటు పలు ఇబ్బందులను శాస్త్రవేత్తలు గమనించారు. దీంతో తక్షణం స్పేస్‌వాక్‌ను విరమించుకున్నారు. ప్రస్తుతం ఐఎస్‌ఎస్‌లోని వ్యోమగాములకు ఎలాంటి ప్రమాదం లేదని అమెరికా రోదసి సంస్థ- నాసా స్పష్టం చేసింది. తాజా సాంకేతిక సమస్యలకు గల కారణాలను, సోయుజ్‌ పరిస్థితిని అమెరికా, రష్యా అంతరిక్ష సంస్థలు పరిశీలించనున్నాయి. గత నెలలోనూ సాంకేతిక ఇబ్బందులతో స్పేస్‌వాక్‌ రద్దయింది. 


జి-20 సారథిగా భారత్‌పై గురుతర బాధ్యత: ఐఎంఎఫ్‌

వాషింగ్టన్‌: అల్పాదాయ దేశాలను రుణ ఊబి నుంచి బయటపడేయడానికీ, క్రిప్టో కరెన్సీపై నియంత్రణలను కట్టుదిట్టం చేయడానికీ, వాతావరణ మార్పుల నిరోధంలో వర్థమాన దేశాలకు నిధులు సమకూర్చడానికీ జి-20 అధ్యక్ష హోదాలో భారతదేశం కృషి చేయాలని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) ప్రథమ ఉప మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపీనాథ్‌ పిలుపునిచ్చారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న గోపీనాథ్‌ తన సందేశాన్ని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. పేద దేశాలను రుణ ఊబి నుంచి గట్టెక్కించడానికి జి-20 యంత్రాంగాన్ని పటిష్ఠంగా ఉపయోగించుకోవాలన్నారు. ‘‘పేద దేశాలు వాతావరణ మార్పులను నిరోధించాలంటే కర్బన ఉద్గారాలను తగ్గించాలి. బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాలను ఉన్నఫళాన విడనాడితే ఆ దేశాల అభివృద్ధి దెబ్బతింటుంది. ఖరీదైన హరిత ఇంధనాలకు మళ్లే ఆర్థిక స్థోమత వాటికి ఉండదు. కాబట్టి సంపన్న దేశాలు ఆర్థిక సహాయం చేస్తేనే అవి కర్బన వనరుల నుంచి హరిత ఇంధనాలకు మారగలుగుతాయని, ఈ విషయంలో భారత్‌ చొరవ తీసుకోవాలని గోపీనాథ్‌ సూచించారు.


పొరుగు దేశాల నుంచి అమెరికాకు పోటెత్తనున్న వలసలు

వాషింగ్టన్‌: అక్రమ వలసదారుల వల్ల అమెరికాలో కొవిడ్‌-19 వ్యాపించకుండా అరికట్టడానికి డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో ప్రవేశపెట్టిన టైటిల్‌ 42 ఉత్తర్వుకు ఈ నెల 21తో గడువు తీరిపోనున్నది. దీంతో దక్షిణ అమెరికాలోని మెక్సికో, ఈక్వెడార్‌, కొలంబియా, వెనెజువెలా, క్యూబా, నికరాగువా తదితర దేశాల నుంచి లక్షల మంది వలసదారులు అమెరికాకి పోటెత్తనున్నారు. టైటిల్‌ 42ని ఎత్తివేయాలని గత నెలలో ఒక కోర్టు ఆదేశించడం ప్రస్తుత జో బైడెన్‌ సర్కారుకు తలనొప్పి తెచ్చిపెడుతోంది. టైటిల్‌ 42 రద్దును వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ ఏలుబడిలోని 19 రాష్ట్రాలు ఫెడరల్‌ అప్పీల్స్‌ కోర్టులో పిటిషన్‌ వేశాయి. అక్కడ సానుకూల తీర్పు వస్తే ఆయా రాష్ట్రాల్లో వలసదారులను మళ్లీ అడ్డుకోగలుగుతారు. బైడెన్‌ ప్రభుత్వం కూడా అప్పీలుకు వెళ్లనున్నా, గడువు లోపల కోర్టు తీర్పు ప్రకారం వలసదారులను నిర్బంధ శిబిరాల నుంచి విడుదల చేస్తోంది. అధికార మార్గాల్లో రాజకీయ ఆశ్రయం కోసం వలస వచ్చినవారు ఇమిగ్రేషన్‌ కోర్టుల్లో అర్జీలు పెట్టుకోవచ్చు. అక్రమ వలసదారులను మెక్సికోకు పంపేస్తారు. వారిలో ఇతర దేశాలకు చెందినవారి గతి ఏమవుతుందో స్పష్టత లేదు. వలసదారుల్లో దొంగ రవాణాదారులను శిక్షించడానికి అమెరికా ఏర్పాట్లు చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని