అమెరికాలో కాల్పుల మోత

అమెరికాలో  దారుణం చోటుచేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు (అయిదుగురు మహిళలు, అయిదుగురు పురుషులు) దుర్మరణం పాలయ్యారు.

Updated : 23 Jan 2023 06:13 IST

10 మంది మృతి.. మరో 10 మందికి గాయాలు
పరారీలో నిందితుడు

మాంటెరీ పార్క్‌: అమెరికాలో  దారుణం చోటుచేసుకుంది. ఓ అజ్ఞాత వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 10 మంది పౌరులు (అయిదుగురు మహిళలు, అయిదుగురు పురుషులు) దుర్మరణం పాలయ్యారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ ఆసుపత్రిలో చేర్చగా కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లాస్‌ఏంజెలెస్‌ ప్రాంతంలోని బాల్‌రూం డ్యాన్స్‌ క్లబ్‌ వద్ద శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. చైనా నూతన లూనార్‌ సంవత్సర వేడుకల నేపథ్యంలో వేలాది మంది అక్కడ గుమిగూడారు. ఆ సమయంలో ఓ వ్యక్తి మెషీన్‌ గన్‌తో వచ్చి కాల్పులకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అతడి వద్ద గల ఆయుధాన్ని కొందరు వ్యక్తులు గుంజుకుని పోలీసులకు అప్పగించారు. మాంటెరీ పార్క్‌ సిటీలో కాల్పులకు పాల్పడిన దుండగుడు పరారీలో ఉన్నాడని, ఆసియాకు చెందిన వ్యక్తిగా భావిస్తున్న అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నగరంలో 60 వేల మంది జీవిస్తున్నారు. అమెరికాలో ఈ నెలలో జరిగిన బహిరంగ కాల్పుల్లో ఇది అయిదో ఘటన. మొత్తం మీద అన్ని సంఘటనల్లో 21 మంది మృతి చెందారు. లూసియానాలోని నైట్‌ క్లబ్‌లో జరిగిన మరో కాల్పుల ఘటనలో 12 మంది గాయపడ్డారు.

భారత సంతతి వ్యక్తి మృతి: అమెరికాలోని గ్యాస్‌స్టేషన్‌(పెట్రోల్‌బంక్‌)లో పనిచేస్తున్న భారత సంతతి వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి చంపారు. ఈ ఘటన మంగళవారం ఫిలడెల్ఫియా ప్రాంతంలోని టొరెస్‌డాల్‌లో జరిగింది. పాత్రో సిబోరమ్‌ అనే వ్యక్తి ఇక్కడ క్లర్క్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు దుండగులు మాస్కులు ధరించి.. గ్యాస్‌స్టేషన్‌లోని ఓ గదిలోకి చొరబడ్డారు. అక్కడే విధుల్లో ఉన్న సిబోరమ్‌ను కాల్చి నగదు రిజిస్టర్‌ను దొంగిలించి పారిపోయారు. దొంగలను పట్టించిన వారికి 20 వేల అమెరికా డాలర్లను పోలీసులు రివార్డుగా ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని